NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర ప్రభుత్వం తీరు పట్ల తీవ్రస్థాయిల విమర్శలు చేశారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
విద్యార్థుల ఆందోళన తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో చాలామందిని అరెస్ట్ చేసింది. వారిపై అభియోగాలు కూడా మోపింది. తదుపరి చర్యలు తీసుకోవడానికి చట్టాలను పరిశీలిస్తోంది. అయితే ఈ లోగానే విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టిన నేపథ్యంలో.. కేంద్రం భవిష్యత్తులో పేపర్ లీకేజీ చేపట్టడానికి కూడా వెనుకాడే విధంగా చట్టాలను రూపొందిస్తుంది.
ఈ తరహా కేసుల్లో దోషులుగా తేలిన వారికి ఏకంగా ఐదు నుంచి పది సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించాలని కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు కోటి వరకు జరిమానా విధించాలని భావిస్తోంది.. అంతేకాదు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ లో మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పేపర్ లీక్ కు వ్యతిరేకంగా ఇప్పటికే సోమవారం బిల్లు ప్రవేశపెడతామని ప్రధానమంత్రి ప్రకటించారు. తక్షణ న్యాయం కోసం న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
నీట్ పేపర్ లీకేజీకి వ్యవహారంలో యువత కేంద్రం తీరు పట్ల తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉంది. పరీక్షను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నీట్ పేపర్ లీకేజీ వల్ల కొంతమంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ చట్టాలను తీసుకొస్తోంది. ఇవి గనక అమల్లోకి వస్తే పరీక్షల నిర్వహణలో సరికొత్త అడుగు ముందుకు పడుతుంది.. పేపర్ లీకేజీకి ఆస్కారం ఉండదు. ఈ చట్టాలను తీసుకురావడం మాత్రమే కాదని.. పకడ్బందీగా అమలు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులను తొక్కి పారేయాలని.. వైద్య విద్యలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తుల మీద అత్యంత కఠినమైన చర్యలు తీసుకొని.. భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలో రిపీట్ కాకుండా చూడాలని విద్యార్థులు కేంద్రాన్ని కోరుతున్నారు.








