క్రికెట్ మైదానం అయినా.. టీవీ షో అయినా.. రాజకీయాలైనా ఆయన స్టైలే వేరు. ఆయన నవజ్యోతి సింగ్ సిద్ధూ అలియాస్ సిక్సర్ సిద్దూ క్యారెక్టర్ ఒకటే. గ్రౌండ్ లో సిక్సర్లతో విరుచుకుపడడం అలవాటే. రాజకీయ జీవితంలో తన పదునైన పదజాలంతో అందరిని ఆకట్టుకుంటారు. విమర్శకుల నోటికి తాళం వేస్తుంటాడు. కొద్ది రోజులుగా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు ఆయనకు పడటం లేదు. అయినా ఎట్టకేలకు పంజాబ్ పీసీసీ పీఠం పగ్గాలు అందుకున్నాడు. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వంతో సీఎం, సిద్దూ మధ్య సఖ్యత నెలకొంది.
సిద్దూ స్వస్థలం పంజాబ్ లోని పాటియాలా. ఆయన తండ్రి భగవంత్ సింగ్ కూడా క్రికెటరే. సిద్దూను టాప్ క్లాస్ క్రికెటర్ గా చూడాలన్నది ఆయన కాంక్ష. తండ్రి కోరిక మేరకు క్రికెట్ లో శిక్షణ తీసుకున్న ఆయన 1981లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్ లోనే అర్థశతకం నమోదు చేసి అదరగొట్టాడు. 1983లో భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆరంభంలో జాతీయ జట్టులో అంతగా రాణించకపోవడంతో జట్టు నుంచి తప్పించారు తర్వాత నాలుగేళ్లకు ప్రపంచ కప్ కోసం సిద్దూను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకున్నారు.
ఆ సమయంలో వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు బాది ఔరా అనిపించారు. అప్పటి నుంచి సిక్సర్ల మోత సాగింది. 1996లో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో కెప్టెన్ అజారుద్దీన్ తో విభేదాలు రావడంతో సిద్దూ టోర్నీ ని మధ్యలోని వీడి ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చారు. అప్పట్లో ఇది సంచలనమైంది. ఈ చర్యలతో బీసీసీఐ ఆయనపై 10 టెస్టు మ్యాచ్ ల నిషేధం విధించింది. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన సిద్దూ ఏకంగా డబుల్ సెంచరీ కొట్టారు. 18 ఏళ్ల పాటు క్రికెటర్ గా అలరించిన సిద్దూ 1999లో అనూహ్యంగా ఆటకు వీడ్కోలు పలికారు.
క్రికెటర్ గా వీడిన తరువాత సిద్దూ కామెంటర్ గా అవతారమెత్తారు. తొలినాళ్లలో పలు క్రికెట్ మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తరువాత సీరియళ్ల షోలతో బుల్లితెరలో తనదైన ముద్ర వేశారు. సిద్దూకు కామెడీ అంటే చాలా ఇష్టం. అందుకే పలు కామెడీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నిర్వహిస్తున్న షోకు చాలా కాలం పాటు జడ్జీగా ఉన్నారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించారు.
టీవీ షోలతో విశేష ప్రేక్షకాదరణ పొందిన సిద్దూ 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున అమృత్ సర్ నుంచి విజయం సాధించారు. 2014 వరకు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2014లో అమృత్ సర్ స్థానాన్ని దివంగత నేత అరుణ్ జైట్లీ కేటాయించడం కోసం సిట్టింగ్ ఎంపీ అయిన సిద్దూకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. తర్వాత 2016లో బీజేపీ తరఫున రాజ్యసభకు పంపారు. 2017లో పంజాబ్ ఎన్నికల ముందు ఆయన బీజేపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ తరఫున అమృత్ సర్ తూర్పు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017 నుంచి 2019 వరకు అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో స్థానిక సంస్థలు, పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు.
సిద్దూ మంచి వాగ్దాటి కలిగిన నేత. పంచ్ డైలాగులతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటారు. విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నోరున్నవారైతేనే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లగలరనే సత్యాన్ని కాంగ్రెస్ గుర్తించింది. మరో ఆరు నెలల్లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ సమయంలో సిద్దూని కోల్పోతే భారీ మూల్యం తప్పదని కాంగ్రెస్ పెద్దలు భావించారు. అధిష్టానం ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. మరి ఇకనైనా సిద్దూ, కెప్టెన్ వివాదంసద్దు మణుగుతుందని అనుకోవచ్చా అని నాయకులు అనుకుంటున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Navjot singh sidhu gets upper hand in punjab
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com