కరోనా సెకండ్ వేవ్.. ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ఇండియాలో ప్రభావం చూపుతోంది. రోజుకు 3 లక్షల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తమ వంతు సాయం అందిస్తామంటూ ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే.. రష్యా తన వంతు సాయం ప్రకటించగా.. ఇప్పుడు మరికొన్ని దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి.
ఈ విషయమై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ కు ఎలా అండగా ఉండగలమో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. బ్రిటన్ తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా ఇండియాకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి.
‘‘భారత్ లో హృదయవిదారక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కష్టకాలంలో మేము భారత్ వెంట ఉంటాం. కరోనాపై పోరులో ఇండియాకు సహకరిస్తాం’’ అని అమెరికా హెల్త్ సెక్రెటరీ మాట్ హన్కాక్ అన్నారు. అదేవిధంగా వైట్ హౌస్ ప్రతినిధి జెన్ సాకి మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్ తో అటు రాజకీయంగా ఇటు, వైద్య అవసరాల పరంగా సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో అవసరమైన సాయాన్ని అందించే మార్గాలను అణ్వేషిస్తున్నామని చెప్పారు.
అటు యూరోపియన్ యూనియన్ సైతం భారత్ కు స్నేహహస్తం చాచింది. ఈ దారుణ పరిస్థితుల్లో ఒకరికి ఒకరు అండగా ఉండడం అవసరమని ప్రకటించింది. జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా తమ వంతు సహకారం అందిస్తామని ప్రకటించాయి.
ప్రధానంగా భారత్ లో ఆక్సీజన్ కొరత వేధిస్తోంది. అదేవిధంగా.. రెమ్ డెసివర్ వంటి కరోనా మందులు కూడా అవసరమైనన్ని అందుబాటులో లేవు. దీంతో.. వీటికి చాలా డిమాండ్ పెరిగింది. కేవలం శ్వాస సరిగా అందకపోవడం వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇతర దేశాలు ఈ విషయంలోనే సహకారం అందించే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా.. ఆక్సీజన్ తోపాటు, రెమ్ డెసివర్ ఇంజక్షన్లు నౌకల ద్వారా పంపింస్తామని ప్రకటించిందని సమాచారం.