Chandrababu Arrest: చంద్రబాబుకు జాతీయస్థాయిలో మద్దతు లభిస్తోంది. గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై జాతీయస్థాయి నాయకులు ఆరా తీస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని ఏపీలోని విపక్ష నాయకులు ఆరోపించారు. చంద్రబాబుకు బాహటంగానే మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో బిజెపి, కాంగ్రెస్ తో పాటు మిగతా రాజకీయ పక్షాలు సైతం చంద్రబాబుకు మద్దతు తెలపడం విశేషం.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. టిడిపి ప్రభుత్వ హయాంలో తప్పు జరిగి ఉంటే విచారణ చేపట్టాలని.. కానీ ప్రతీకారంతో ఎవర్నీ ఏమీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అటు వామపక్షాల నాయకులు సైతం స
స్పందించారు. సిపిఐ నారాయణ అరెస్టును ఖండిస్తూనే.. రాజమండ్రి వెళ్లి చంద్రబాబును పరామర్శించారు.
ఇప్పటికే బీజేపీ జాతీయ నేత, ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి సైతం ఖండించారు. జనసేన అధ్యక్షుడు పవన్ చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఆయనను కలిసేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు సైతం ఈ ఘటనపై స్పందించారు. అరెస్టు జరిగిన తీరును ఖండించారు.యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కుటుంబ సభ్యులతో సైతం మాట్లాడినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి చంద్రబాబు ఇటీవల జాతీయ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బిజెపికి మద్దతుగానే మాట్లాడుతున్నారు. అటు విపక్షాలతో రూపుదిద్దుకున్న ఇండియా కూటమికి దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబుకు ఇండియా కూటమి నుంచే బాహటంగా మద్దతు దక్కుతుండడం విశేషం. చంద్రబాబు అరెస్టుపై జాతీయ పార్టీలన్నీ ఒకే అభిప్రాయంతో ఉన్నాయి. జాతీయ స్థాయిలో సైతం చంద్రబాబు అరెస్ట్ పై విస్తృత చర్చ నడుస్తోంది.