Nara Brahmani: నిజం గడప దాటేలోపే.. అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్న చందంగా సోషల్ మీడియా దుష్పరిణామాలు వ్యక్తులకు తీరని నష్టాన్ని గురి చేస్తున్నాయి. సోషల్ మీడియా మరీ బరితెగించి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వాడకాన్ని పెంచిన తర్వాత దీని స్వరూపమే మారిపోయింది. తను చేసి మంచి పనులను ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులపై ఆరోపణలకు కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్నాయి. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అందరికీ చేరువయ్యే అవకాశం ఉండడంతో.. ఇటీవల కాలంలో సోషల్ వార్ ఊపందుకుంది.
అయితే తాజాగా ఏపీలో అయితే మరింత జుగుప్సాకరంగా మారింది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి పై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆమె హైదరాబాదులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కు చెందిన ఫామ్ హౌస్ ను రూ.1600 కోట్లకు కొనుగోలు చేశారని.. అది టిడిపి ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన సొమ్ముతో కొన్నారని.. దీని కొనుగోలు విషయంలో అత్త నారా భువనేశ్వరి తో గొడవ పడ్డారని.. కొద్దిరోజుల పాటు ఇంటి నుంచి ఆ ఫామ్ హౌస్ లోకి వెళ్లిపోయారని.. అక్కడ తన సన్నిహిత మిత్రుడు తో గడిపారని .. రామోజీరావు, రాధాకృష్ణల సహకారంతో చంద్రబాబు బ్రాహ్మణిని ఒప్పించి ఇంటికి తెప్పించారని ఈ కథనం సారాంశం.
అయితే ఇందులో నమ్మదగిన అంశాలేవి పొందుపరచలేదు. కేవలం ఊహాగానాల మేరకు రాసుకొచ్చిన కథనం ఇది. ప్రింట్ మీడియాలో ఒక కథనం వచ్చినట్టు చూపిస్తూ సోషల్ మీడియాలో వైయస్ జగన్ సైన్యం పేరిట పోస్ట్ చేశారు. ఆ పేపర్ కథనంపై ఫలానా పత్రిక అని కానీ.. డేట్ లైన్ అంటూ ఏదీ లేకుండా అభూత కల్పనతో బ్రాహ్మణి నాలుగో ప్రియుడుతో ఈ ఫామ్ హౌస్ లో గడిపినట్లు దుష్ప్రచారానికి దిగారు. ఈ కథనం అంతా డొల్లతనంగా కనిపించడం విశేషం. ప్రస్తుతం చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బ్రాహ్మణి తెరపైకి వచ్చారు. ఆందోళన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణిని టార్గెట్ చేసుకుని ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాలు అధోగతికి దారి తీయడం దారుణం. మహిళలను, మహిళ నేతలను టార్గెట్ చేసుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట మంత్రి రోజాఫై టిడిపి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. అది మరవక ముందే ఇప్పుడు బ్రాహ్మణిని టార్గెట్ చేసుకుంటూ దుష్ప్రచారానికి ప్రత్యర్థులు దిగడం దారుణం. ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుని ఏపీ పరువును దిగజార్చుతున్నారు. ఇప్పటికైనా మహిళల విషయంలో సంయమనం పాటించకపోతే రోజురోజుకు ఇవి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ బాధితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే అన్ని రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వినియోగం విషయంలో నియంత్రణ పాటిస్తే మేలు. లేకుంటే సమాజంలో ఏపీ పరువు గంగపాలు కావడం ఖాయం.