Narendra Modi Sends Surprise to Newlyweds : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన శివకుమార్ కు మే 23న వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో తమ వివాహానికి హాజరుకావాలని ప్రైమ్ మినిస్టర్ కు శివకుమార్ వివాహ పత్రికతో పాటు లేఖ కూడా రాశారు. ఆ లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్ట్ ద్వారా పంపించాడు. అయితే ఆయన తన వంతుగా ప్రయత్నం చేశాడు గాని.. ప్రధానమంత్రి కార్యాలయం తన లేఖకు స్పందిస్తుందని ఊహించలేదు. దీంతో నెల ఏడవ తేదీన ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఆ జంటను దీవిస్తూ.. నూరేళ్లు అద్భుతమైన దాంపత్యం, అనితర సాధ్యమైన ఐశ్వర్యం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తాను కోరుకుంటున్నానని ప్రధానమంత్రి వారికి లేఖ పంపించారు. ఆ లేఖను చూసిన ఆ దంపతులు ఉప్పొంగి పోయారు. తమ లాంటి సామాన్యుల మీద ప్రధానమంత్రి ఈ స్థాయిలో ప్రేమ చూపించడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
Also Read : రైతులకు డబుల్ ధమాకా.. ఒకేసారి పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులు అకౌంట్లో…
ఊహించలేదట
శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం. ఆయన తీసుకునే నిర్ణయాలంటే చాలా ఇష్టం. అందువల్లే తన వివాహానికి దేశ ప్రధానిని ఆహ్వానించాడు. అంతేకాదు తన వివాహానికి హాజరైతే ఆనందపడతానని ఆ లేఖలో పేర్కొన్నాడు. భద్రతాపరమైన కారణాల వల్ల ప్రధానమంత్రి శివకుమార్ వివాహానికి హాజరయ్యే పరిస్థితి ఉండదు. పైగా నరేంద్ర మోడీ ప్రస్తుతం ఊపిరి సలపని వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు. అందువల్లే తనకు వివాహ పత్రికను పంపించిన శివకుమార్ కు ఆయన అద్భుతమైన లేఖను పంపించారు. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇలాంటి స్పందన వస్తుందని శివకుమార్ ఊహించలేదు.. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి తనను దీవిస్తూ ఏకంగా లేఖ రావడంతో ఆయన ఆనందం తట్టుకోలేకపోతున్నాడు.
” నాకు నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం. ఆయనను జీవితంలో ఒక్కసారైనా చూడాలని అనుకున్నాను. అందువల్లే నా వివాహానికి ఆయన హాజరైతే బాగుంటుందని భావించాను. నేను సామాన్యుడిని కాబట్టి.. నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం కాబట్టి నా కోరికను ఆ విధంగా వ్యక్తం చేశాను. నా వంతు ప్రేమను చూపిస్తూ.. ఆయనకు నా వివాహ పత్రికను పంపించాను. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ స్థాయిలో ఊహించని బహుమతి లభిస్తుందని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రధానమంత్రి అంత బిజీగా ఉండి కూడా.. నా గురించి ఆలోచించి.. ఈ స్థాయిలో లేఖ రాస్తానని అనుకోలేదు. ఎంతైనా నాలాంటి సామాన్యుల మీద మోడీ చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. ప్రధానమంత్రి రాసిన లేఖ నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఇంతకు మించిన బహుమతి నాకు లభిస్తుందని అనుకోవడంలేదని” శివకుమార్ చెబుతున్నాడు. శివకుమార్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేఖ రావడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శివకుమార్ ను అతడి స్నేహితులు, బంధువులు అభినందిస్తున్నారు. ప్రధానమంత్రి నుంచి లేఖ రావడం గొప్ప విషయమని అభివర్ణిస్తున్నారు.