Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఢిల్లీ...

Nara Lokesh: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఢిల్లీ బయలుదేరిన ఏపీ సీఐడీ

Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వ్యవహారంలో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు ఒక రకంగా హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం డిస్పోస్ చేసింది. అంతేకాదు ఈ కేసులో లోకేష్ కు నోటీసులు ఇచ్చి విచారించాలని ఏపీ సిఐడిని కోర్టు ఆదేశించింది. మరోవైపు విచారణకు సహకరించాలని నారా లోకేష్ కు కోర్టు తేల్చి చెప్పింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలు అలముకున్నాయి. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు కావడం, బెయిల్ కోసం వారు దాఖలు చేస్తున్న పిటిషన్లు ఫలితం ఇవ్వకపోవడంతో టీడీపీలో నైరాశ్యం అలముకుంది. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పేరు ప్రస్తావనకు రావడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14 గా నారా లోకేష్ పేరు చేరుస్తూ ఈమధ్యే విజయవాడ కోర్టులో ఏపీ సిఐడి మెమో దాఖలు చేసింది. ఈ క్రమంలో తనను అరెస్టు చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం లోకేష్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. లోకేష్ తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏపీ సిఐడి తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలను వినిపించారు.. ఈక్రమంలోనే లోకేష్ ను 41_ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. “మేము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నాం. దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని లోకేష్ ను ఆదేశించండి” అంటూ శ్రీరామ్ చేసిన అభ్యర్థనను ఏపీ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది.. 41_ఏ కింద నోటీసులు విచారించుకోవాలని సూచించింది. ఆదేశాలు అనుసరించి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. లోకేష్ ను కలిసి నోటీసులు అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, సీ ఆర్ పీ సీ_41 ఏ (ఏడు సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు) సంబంధించిన నిబంధనలను పాటిస్తామని ప్రభుత్వం తరపున లాయర్ చెప్పారు. ఒకవేళ లోకేష్ విచారణ సహకరించకపోతే అరెస్ట్ కనుక చేయాల్సి వస్తే, కోర్టు అనుమతితోనే ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ఈ కారణంగానే లోకేష్ కు 41_ఏ నోటీసు ఇస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. కాగా, లోకేష్ ముందస్తు బెయిల్ కు పిటిషన్ వేశారు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సెక్షన్ల కింద నమోదు చేసి ఉంటారని, ఇప్పుడు అవి పక్కన పెట్టి ఉంటారని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఇంకా నిర్ధారణ కాలేదని, వివరాలు తెలియాల్సి ఉందని అంటున్నారు. అయితే తాజా ఎఫ్ ఐ ఆర్ లో అధికారులు ఏమేమీ పేర్కొన్నారు అనేది వెల్లడి కావలసి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular