Nara Lokesh Padayatra: యువగళం పాదయాత్ర కడప జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి హాజరయ్యేందుకు లోకేష్ తన పాదయాత్రకు నాలుగు రోజుల పాటు విరామం ఇచ్చారు. సోమవారం సాయంత్రం పాదయాత్ర విడిది కేంద్రానికి చేరుకున్నారు. ఈ నెల 23న కడప జిల్లాలో పాదయాత్రతో అడుగుపెట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 24, 25 తేదీల్లో రెండురోజుల పాటు పాదయాత్ర జరిగింది. ఆ తరువాత మహానాడు కోసం పాదయాత్ర విరమించారు. రాజమండ్రి బయలుదేరి వచ్చారు.
మహానాడులో లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కీలక ప్రసంగం చేశారు. మహానాడు వేడుకను పూర్తి చేసుకుని తిరిగి ఈ నెల 29న కడప విమానాశ్రయానికి లోకేశ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రానికి చేరుకున్నారు.మంగళవారం అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సాయంత్ర భారీ బహిరంగ సభ ఉంటుంది. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో ఈ సభ ప్రత్యేకత సంతరించుకుంది. భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న పాదయాత్ర ప్రారంభమైంది. 110 రోజుల్లో మొత్తం 1423 కి.మీ లోకేశ్ నడిచారు. ఇవాళ 111వ రోజు జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి నడక ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ చిత్తూరు, అనంతపురం, కర్నూలులో లోకేష్ పాదయాత్ర పూర్తయ్యింది. ప్రస్తుతం కడపలో కొనసాగుతోంది. మరో నెల రోజుల పాటు ఈ జిల్లాలో కొనసాగే అవకాశాలున్నాయి. అనేక అవాంతరాలు నడుమ ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది.