Nara Bhuvaneswari – Lokesh: చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ” సత్యమేవ జయతే” పేరుతో ప్రత్యేక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అటు చంద్రబాబు సైతం జైలులో దీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజమండ్రిలో భువనేశ్వరి, ఢిల్లీలో లోకేష్ ఒకరోజు పాటు దీక్ష చేపట్టనున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల సైతం ఈ దీక్షలు చేపట్టనున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. సత్యమేవ జయతి కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించి.. టిడిపి శ్రేణులు నిరాహార దీక్షలకు దిగారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఉదయం 10 నుంచి ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ నివాసంలో లోకేష్ దీక్షకు దిగారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఆయనతోపాటు ఎంపీలు సైతం దీక్షను కొనసాగించనున్నారు.
రాజమండ్రిలో నారా భువనేశ్వరి దీక్ష ప్రారంభమైంది. కోరుకొండ రోడ్డు లోని రాజా ధియేటర్ సమీపంలో మెయిన్ రోడ్డు కు ఆనుకుని ఉన్నఎకరా స్థలంలో పెద్ద శిబిరం ఏర్పాటు చేశారు. పెద్ద వేదికను సైతం తీర్చిదిద్దారు. ఆమెకు ప్రత్యేక సీటు కేటాయించారు. సమీపంలో 30 మంది లోపు తెలుగు మహిళలు దీక్షలో కూర్చునేలా కుర్చీలను ఏర్పాటు చేశారు. రాజమండ్రి తో పాటు రూరల్ నియోజకవర్గాలకు చెందిన టిడిపి శ్రేణులు దీక్ష శిబిరానికి పెద్ద ఎత్తున తరలివచ్చాయి. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. సాయంత్రం ఆరుగురు విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి భువనేశ్వరితో దీక్ష విరమింపజేయనున్నారు.