Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరి.. పరిచయం అక్కర్లేని పేరు. దివంగత సీఎం నందమూరి తారక రామారావు కుమార్తెగా, మాజీ సీఎం చంద్రబాబు సతీమణిగా ఆమె సుపరిచితురాలు. ఆమె రాజకీయ వేదికలు పంచుకోవడం అంతంత మాత్రమే. హెరిటేజ్ వ్యాపార కార్యకలాపాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు వంటి వాటిలో మాత్రం పాలుపంచుకున్నారు.అయితే ఆమె ఇప్పుడు రాజకీయ పర్యటనలు చేయాల్సి వచ్చింది. రాజకీయ ప్రసంగాలు తప్పనిసరిగా మారాయి. భర్త చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆమె ప్రజల మధ్యకు రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.
చంద్రబాబు అరెస్టు అయ్యి దాదాపు 50 రోజులు అవుతోంది. ఇంతవరకు ఆయనకు న్యాయస్థానాల్లో ఊరట దక్కలేదు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇప్పటికే విచారణ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో నవంబర్ మొదటి వారంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలతో టిడిపి అభిమానులు చాలామంది మృతి చెందారు. వారి కుటుంబాలను భరోసా కల్పించేందుకు గాను భువనేశ్వరి నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. తొలిసారిగా తిరుపతి జిల్లాలో మృతుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి తదితర నియోజకవర్గాల్లో తొలి విడత యాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే టిడిపి, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో.. ఇరు పార్టీల శ్రేణులు భువనేశ్వరి యాత్రలో పాల్గొన్నాయి. భువనేశ్వరి యాత్రపై టిడిపి శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఆమె యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ఆశాభావంతో ఉన్నాయి.
తొలిసారిగా ప్రజల మధ్యకు వస్తున్న భువనేశ్వరి ఏ మేరకు వారిని ఆకట్టుకుంటారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్టీఆర్ కుమార్తెలలో పురందేశ్వరి ఒక్కరే రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఆమెకు కాంగ్రెస్ తో పాటు బిజెపిలో మంచి గౌరవమే దక్కింది. మంచి వాగ్దాటి, సమయస్ఫూర్తితో ఆమె మాట్లాడగలరు. సమకాలిన రాజకీయ అంశాలపై ఆమెకు సమగ్ర అవగాహన ఉంది. అయితే వాగ్దాటిలో పురందేశ్వరి తో పోల్చుకుంటే భువనేశ్వరి కాస్త వీక్. చంద్రబాబు అరెస్టు తర్వాత మాత్రం ఆమె పరిణితితో మాట్లాడారు. టిడిపి శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఈ సంఘీభావ యాత్రలో సైతం టిడిపి అభిమానులను, ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి.