
Tarakaratna- Suhasini: ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కనుమూశారు. జనవరి 27న గుండెపోటుకు గురై 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న వయసు 40 సంవత్సరాలు. యమ రంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజులోనే ఒకేరోజు 9 సినిమాలను ప్రారంభించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు తారకరత్న.
అయితే సినిమాలేవీ క్లిక్ కాకపోవడం, కొన్ని కాంబినేషన్లు మారిపోవడంతో… హీరో పాత్రల నుంచి విలన్ పాత్రల్లోకి దిగారు. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. వాస్తవానికి తారకరత్న సినిమా కెరియర్ పూల పాన్పు లాగా సాగలేదు. వరుసగా సినిమాలు చేయడం, ఆగడం, మళ్లీ చేయడం ఇలా సాగింది. ఒకటో నెంబర్ కుర్రాడు తప్ప ఇది నా సినిమా అని ఆయన చెప్పుకునే అవకాశం లేకపోయింది. 2002 ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా పరిచయమైన తారకరత్న.. ఆ తర్వాత తొమ్మిది సినిమాలకు ఒకేసారి సంతకం చేశారు. యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు అందులోవే. సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతుండడంతో తారకరత్న సుదీర్ఘ విరామం తీసుకున్నారు.
2009లో అమరావతి అనే సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు. దానికి నంది అవార్డు కూడా తీసుకున్నారు. దాదాపు ఏడేళ్ళ విరామం తర్వాత 2016లో రాజా చెయ్యి వేస్తే సినిమాలో విలన్ గా చేశారు. అందులో నారా రోహిత్ హీరో. మహా భక్త సిరియాల అనే భక్తి సినిమాలో కూడా తారకరత్న నటించారు. 2022లో హాట్ స్టార్ లో 9 అవర్స్ అనే వెబ్ సీరీస్ లో నటించాడు. తాజాగా మరికొన్ని ఓటిటి సంస్థలతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. తన భార్య అలేఖ్య రెడ్డి ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

తారకరత్న మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు తారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయన పార్టీ తరఫున ప్రచారం చేశారు. ముందు నుంచీ నారా కుటుంబంతో మంచి సంబంధాలు నడుపుతూ వచ్చారు.. కేవలం లోకేష్ మాత్రమే కాకుండా చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ తో కూడా తారకరత్నకు మంచి సంబంధాలు ఉన్నాయి.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. కూకట్పల్లిలో హరికృష్ణ కుమార్తె పోటీ చేసినప్పుడు ఆమె ప్రచారానికి ఆమె సొంత సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నప్పటికీ, తారకరత్న ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవల గుంటూరు జిల్లా పెదనందిపాడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన తారకరత్న, వచ్చే ఎన్నికల్లో తాను కూడా బరిలోకి దిగుతానంటూ సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఇక తెలుగుదేశంలో తారకరత్న పూర్తి స్థాయిలో పనిచేస్తారనేది అర్థమైంది. అంతేకాదు మాచర్లలో తెలుగుదేశం కార్యకర్తలపై దాడి వంటి అంశాల పైనా తారకరత్న మాట్లాడారు. సందర్భం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీలోకి వస్తానని చెప్పారు.. టైగర్ 2024లో బయటకు వస్తుందంటూ ఒక ట్వీట్ చేశారు. అందులో టైగర్ అనే పదం ఎవరిని ఉద్దేశించి అన్నారన్న చర్చ కూడా సాగింది. దీనికి కొనసాగింపుగా జనవరిలో నారా లోకేష్ ను కలిశారు. బొట్టు, ట్రిమ్ చేయని గడ్డం, చంద్రబాబు వేసుకునే తరహా రంగు డ్రెస్ వేసుకొని పొలిటికల్ ఎటైర్లో కనిపించారు. లోకేష్ తో సమావేశం తర్వాత రాజకీయాల్లో తారకరత్న చురుకుగా ఉన్నారు. ఆ తర్వాత కుప్పంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చింది.. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో 23 రోజులపాటు చికిత్స పొంది చివరికి కన్నుమూశారు.