KCR- Namasthe Telangana Paper: మీడియా అంటే ఇప్పుడు పార్టీల మౌత్ పీస్ గా మారింది. నాయకుల అవసరాల ఆధారంగా ట్యూన్ అవుతున్నది. ఏ పార్టీ కరపత్రం, ఏ పార్టీ గొట్టం ఏమిటో ప్రజలకు బాగా తెలుసు. పార్టీ కరపత్రాలు అయినంత మాత్రాన కొట్టే డప్పును చూసి కొట్టాలి. లేకుంటే చెవికి చిల్లు పడుతుంది. రక్తం ధారగా కారుతుంది. ఈరోజు టిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారుతున్న నేపథ్యంలో.. గులాబీ కరపత్రం నమస్తే తెలంగాణ చేసిన గాయి గాయి అంత ఇంతా కాదు.. టిఆర్ఎస్ పార్టీ పేరు మారితే జాతీయ పార్టీ అయిపోయినట్టు రెచ్చి పోయి ప్రచారం చేసింది.. ఇదొక్కటే కాదు టిఆర్ఎస్ వీర విధేయ మీడియాలోనూ ఇదే తీరు కొనసాగింది.. పాత్రికేయాన్ని పాతర వేసి, కరపాత్రికేయాన్ని మోస్తున్న ధోరణి ఏవగింపు కలిగించింది. ఇంతకీ నమస్తే తెలంగాణ బాధ ఏంటంటే… దాని ఓనర్ కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అర్జెంటుగా ప్రధాని కుర్చీ కావాలట. వెంటనే నరేంద్ర మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పి దిగి పోవాలట. ఏం రాస్తున్నారో విలేకరులకు సోయి లేదు. కనీసం దాని యజమానికైనా కొంత ఇంగితం ఉండాలి కదా. భారత రాష్ట్ర సమితి అనేది కేసీఆర్ సొంత పార్టీ. తను ఒక మేల్ శివగామి. తను చెప్పిందే శాసనం. ఎవడి మాట వినడు. ఇంకెవరినీ పట్టించుకోడు. పర్ సపోజ్ ఇదే కేసీఆర్ రేపటి నాడు నో నో ఇది నా తెలంగాణ.. జాతీయ రాజకీయాలు మనకు అవసరం లేదు… అని ఇదే బిఆర్ఎస్ పేరును టిఆర్ఎస్ గా మార్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

బతికుండగానే చంపేసింది
ముందుగానే చెప్పినట్టు.. ఈ రోజు కేసీఆర్ సేవలో నమస్తే తెలంగాణ తరించిపోయింది. బి ఆర్ ఎస్ అనగానే అదేదో గొప్ప రాజకీయ పరిణామం అయినట్టు రెచ్చిపోయింది. బీఆర్ఎస్ అని ప్రకటించుకోగానే జాతీయ పార్టీ అయినట్టు… దేశ రాజకీయ యవనిక పై మన జయ పతాక అని రాసుకుంటూ వచ్చింది.. ఎన్నికల సంఘం రాజముద్ర వేస్తే జయ పతాకం ఎగరేసినట్టా? ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. జాతీయ స్థాయికి కొత్త “ధృవతార” కేసీఆర్ అంటూ డెక్కు పెట్టింది.. కెసిఆర్ అంటే రాజకీయ నాయకుడు.. రాజకీయాలు మాత్రమే చేస్తాడు. కానీ వార్త రాసే విలేఖరికి ఏమైంది? ఆయనకంటే సోయి లేదు. మరి వార్త దిద్దే సబ్ ఎడిటర్ జ్ఞానం ఏమైంది? అందరూ గులాబీ గులాల్ చల్లుకున్నారా? అసలు ధ్రువతార అంటే అర్థం ఏమిటి ఏంటో తెలుసా? వారు వాడిన పదంతో కెసిఆర్ ను బతికుండగానే చంపేసినట్లు లెక్క. పేరులో తెలంగాణ ఉంది కాబట్టి… అది ప్రాంతీయతను సూచిస్తుంది కాబట్టి.. తనకు ఇప్పుడు నరేంద్ర మోడీతో పొసగడం లేదు కాబట్టి.. దానికంటూ జాతీయ పార్టీ పెడితే కొన్ని కొత్త చిక్కులు వస్తాయి కాబట్టి.. తెలంగాణ రాష్ట్ర సమితి తనలో ఉన్న తెలంగాణతనాన్ని వదిలేసుకుంది. భారతీయ రాష్ట్రీయ సమితి అని స్వీయ నామకరణం చేసుకుంది.
ఆప్ చూసి నేర్చుకోవాలి
ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఆరు సీట్లు దక్కించుకుంది.. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. అలాగని రాత్రికి రాత్రి ఆప్ జాతీయ పార్టీ అయిపోలేదు.. ఒక్కో రాష్ట్రానికి అక్టోపస్ లా విస్తరిస్తోంది.. వాస్తవానికి జాతీయ పార్టీ కావాలి అంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు సాధించి ఉండాలి.. గత ఎన్నికల్లో కనీసం రెండు శాతం సీట్లను కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి. ప్రస్తుతం ఆప్ ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉంది.

అప్పట్లో గోవాలో జరిగిన ఎన్నికల్లో 6.77 శాతం ఓట్లను సాధించింది. ఇప్పుడు గుజరాత్ లో కూడా 10% దాటి ఓట్లు సాధించుకుంది. హిమాచల్ ప్రదేశ్ లోనూ ఓట్ల శాతాన్ని బాగానే పెంచుకుంది.. ఇదంతా కాదు టిఆర్ఎస్ పార్టీకి దోస్త్ గా ఉన్న మజ్లీస్ కూడా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, బీహార్, బెంగాల్ రాష్ట్రాలలో ఉనికి చాటుకుంది. కొన్ని ఓట్లు, వాటితో పాటు సీట్లూ ఉన్నాయి. ప్రస్తుతం అధికారికంగా బిజెపి, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, టీఎంసీ మాత్రమే జాతీయ పార్టీలు. రాబోయే రోజుల్లో సీపీఎం, సీపీఐ, ఎన్ సీపీ, బీ ఎస్పీ, టీఎంసీ తమ జాతీయ హోదా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మోడీ అలా నరుకుతున్నాడు కాబట్టి.. నమస్తే తెలంగాణ చెప్పినట్టు భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీ అయి పోదు. తెలంగాణ మాండలికంలో చెప్పాలి అంటే ఇల్లు అలకగానే పండగ కాదు.