
Nagaland, Meghalaya, Tripura Election: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల్లోల బీజేపీ మళ్లీ వికసించబోతున్నట్లుల ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడించాయి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందని, ఒక రాష్ట్రంలో హంగ్ ఏర్పడవచ్చని తెలిపారు. దీంతో కమ్యూనిస్టులకు ఈసారి కూడా నిరాశే మిగిలే అవకాశం ఉంది. ఈ నెల 16న∙త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సోమవారం ముగిశాయయి. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.
త్రిపురలో పట్టు నిలుపుకోనున్న కమలం పార్టీ..
త్రిపుర రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ కూటమికి 36 నుంచి 45 స్థానాలు వస్తాయని, లెఫ్ట్ కూటమికి 6 నుంచి 11 స్థానాలు, తిప్రా మోథా పార్టీకి 9 నుంచి 16 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. మొత్తం 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీలో 31 స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే బీజేపీకి 36–45 సీట్లు వచ్చే అవకాశం ఉండటంతో మరోసారి త్రిపురలో బీజేపీనే అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తొలిసారి విజయం సాధించింది. దీంతో పాతికేళ్లుగా పట్టు నిలుపుకున్న కమ్యూనిస్టులు మట్టి కరిచారు. తాజా ఎన్నికల్లోనూ 2018 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి.
నాగాలాండ్‌లోనూ..
మరో ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ – ఎన్డీపీపీ కూటమికి విజయం సాధిస్తుందని తెలిపింది. ఈ కూటమికి 35 నుంచి 43 సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు, ఎన్‌పీఎఫ్‌కు 2 నుంచి 5 సీట్లు దక్కుతాయని తెలిపింది.
మేఘాలయలో హంగ్..
ఇక మేఘాలయ రాష్ట్రంలో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) విజయభేరీ మోగిస్తుందని జీన్యూస్ – మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ వివరించింది., ఎన్‌పీపీకి 21 నుంచి 26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు 8 నుంచి 13 సీట్లు, బీజేపీకి 6 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 6 సీట్లు, ఇతరులకు 10 నుంచి 19 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఏ పార్టీకి మేఘాలయలో మెజార్టీ రాకపోవడంతో ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉంది. వివిధ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇక్కడ కూడా బీజేపీకి చాన్స్ ఉందని విశేలషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఇతరులు కీలకంగా మారనున్న నేపథ్యంలో కమలం చొరవ చూపితే ఇతరులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.

కాంగ్రెస్‌కు నిరాశే..
ఇక ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు నిరాశే మిగిలే అవకాశం ఉంది. గతేడాది జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. దాని ప్రభావం ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపనట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఈ ఏడాది చివరి వరకు మరో ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.