Nagababu : యువత రాజకీయాల్లోకి రాకపోతే దుర్మార్గులు, అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు పేర్కొన్నారు. జనసేన పార్టీ యువతకే ప్రాధాన్యత ఇస్తోందని, యువత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని, అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వివేకానంద వికాస వేదికపై జరిగిన “యువశక్తి” బహిరంగ సభను ఉత్తరాంధ్ర నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… “ స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా అందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని స్వామి వివేకానంద చెప్పిన మాటలు మనకు స్ఫూర్తి. యువత ఇటీవల ఎక్కువగా సామాజిక మాధ్యమాలకే పరిమితం అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయాల్లో పాల్గొంటున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. యువతీ యువకులు ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గోవాలి. రాజకీయాల పట్ల అవగాహన పెంచుకోవడం ప్రజాక్షేత్రంలో చాలా ప్రయోజనకరం. రాజకీయాల గురించి యువత పట్టించుకోక పొతే అసమర్థ నాయకుల నియంతృత్వం, ఆధిపత్యం ఆవహిస్తుంది. భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

*అన్ని కులాల కలయిక జనసేన పార్టీ
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంటుందని చాలా రాజకీయ పార్టీలు మాటల్లోనే చెప్తాయి. కానీ యువత కోసం రాజకీయ వేదిక ఏర్పాటు చేసిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది, జనసేన పార్టీది. జనసేనలో యువతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనసేన కుటుంబ పార్టీ కాదు… కుల పార్టీ అంతకంటే కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే పార్టీ జనసేన మాత్రమే. జనసేనలో నేను ఒక సైనికుడిని. ఏ విధమైన పదవుల కోసం కాకుండా పార్టీ నిర్మాణం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే జనసేనలో పని చేస్తున్నాను. జనసేనలో సాధారణ కార్యకర్తలు కూడా రాష్ట్ర, జాతీయ నాయకులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తూ… యువతకు సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతోంది. యువతలో దాగి ఉన్న శక్తిని నిర్వీర్యం చేస్తోంది.

*అంతటి పాకిస్థాన్ నియంతను ఓ మహిళ పాట కూల్చేసింది
ఒకప్పుడు పాకిస్థాన్ లో నియంతల కోటను కూల్చిన ప్రఖ్యాత పాకిస్తాన్ కవి “ఫయాజ్ అహ్మద్” రాసిన ఒక పాట గుర్తుకొస్తోంది.
“మేము చూస్తాం.. మేమూ చూస్తాం.. మేము చూడడం తథ్యం..
తారా స్థాయికి చేరిన మీ క్రౌర్యం, మీ అణిచివేత
దూది పింజల వలె యెగిరి పోవడం
మేము చూస్తాం.. మేమూ చూస్తాం..
“జి-యా-ఉల్ హక్” పాకిస్థాన్ నియంతగా చెలరేగి పోతున్న సమయమది. ప్రజలను, రాజకీయ పార్టీలను క్రూరంగా హింసించి, పౌర హక్కులను హరించి వేస్తున్న పాలన అది. నలుపు రంగు నిరసనకు గుర్తు కాబట్టి దేశంలో ఎక్కడా ఆ రంగు కనిపించకూడదని హుకుం జారీ చేశాడు. నల్ల బురఖా, నల్ల రిబ్బను, నల్ల చున్నీ, నల్ల జెండా వంటివేవి ఎక్కడ కనపడినా పోలీసులు హింస పెట్టేవారు. ఆ చీకటి రోజులలో ఒక పాకిస్థాన్ గాయని కరాచీ స్టేడియానికి నల్ల చీర కట్టుకొని వచ్చి ఈ గేయం ఆలపించడం మొదలు పెట్టింది. పోలీస్ వ్యవస్థ బిత్తర పోయింది. అనంత శక్తి కలిగిన నియంతను ఒక సాధారణ మహిళ సవాలు చేస్తున్న తీరు చూడడానికి పుట్టల నుంచి ఉసుళ్లు పగిలినట్లు వేలాదిగా జనం స్టేడియంకు చేరుకున్నారు. పోలీస్ వ్యవస్థ నిస్సహాయ స్థితికి చేరింది. ఆ తర్వాత పాకిస్థాన్ మొత్తం ఆ పాట ప్రతిధ్వనించింది. సైనిక నియంతృత్వాన్ని ప్రతిఘటించడానికి ప్రజలకు ఉత్సాహం, ధైర్యం కలిగించింది. జనం తిరగబడ్డారు. జియా కాళ్ళ క్రింద నేల కదిలింది. దెబ్బకు మిలిటరీ పాలనకు స్వస్తి పలికి ప్రజాస్వామిక ఎన్నికలకు పూనుకొన్నాడు. ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితులలో దారుణమైన చావు చచ్చాడు. అంత పెద్ద కోటను ఒక చిన్న పాట కూల్చి వేసింది.” ప్రజల నిరసనకు అంత గొప్ప శక్తి ఉంటుంది. ప్రజల వద్ద తుపాకులుండవు, కత్తులుండవు, యుద్ధం చేయలేరు. చంపడమో, చావడమో అన్న తెగింపూ ఉండదు. కేవలం ఈ పద్దతి మాకు నచ్చలేదు మార్చండని మాత్రమే ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతారు. స్వాతంత్య్ర సమరంలో మహాత్మ గాంధీ ప్రయోగించిన పాశుపతాస్త్రం ఇదే.. అపారమైన సైనిక శక్తి కలిగిన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రజల ముందు చీమల పుట్ట లాగా మారిపోయింది. అహింసాయుత ప్రజా ఉద్యమాలతో నియంతల క్రౌర్య పాలనకు చరమగీతం పాడిన సదృశ్యాలు ప్రపంచ చరిత్రలో చాలానే కన్పిస్తాయి. ఎమర్జెన్సీ ఆకృత్యాలకు ఇందిరా గాంధీ చెల్లించుకొన్న మూల్యం ఏమిటో మనం ప్రత్యక్షంగా చూశాం.
*గాడి తప్పితే ఎవరికైనా ఇదే గతి
అవినీతి, ఆధిపత్యం, అరాచకాలు, నియంత పాలన, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేక పోవడం తదితర కారణాలతో అరబ్ దేశాలలో ప్రజలు తమ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేశారు. లిబియా, ఈజిప్ట్, సిరియా, యెమెన్ వంటి దేశాలలో ప్రభుత్వాలు కూలిపోయాయి. మొన్నటికి మొన్న శ్రీలంక దేశంలో నియంతృత్వ పాలనకు విసుగు చెందిన ప్రజలు పాలకులను తరిమి కొట్టారు. పోలీస్ వ్యవస్థను ఏకపక్షంగా వాడుకొని, తమ కుర్చీయే భద్రం అనుకొన్న ప్రతి నియంత అనుభవమూ ఇదే. ప్రజలను హింసించిన నియంతలు, తాడు పామై తమనే కరవడానికి రావడం చూసి, మతి చలించి, ఏమీ చేయలేక, దుమ్ములో కలిసి పోవడం చరిత్ర చెప్పే నిజం.
*చెప్పినా వినరు.. సమాలోచన అన్నదే లేని ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విద్యావంతుడు కాదు కనుక చరిత్ర చదివే అవకాశం అతనికి లేదు. ఒకరు చెప్తే వినే నైజం కూడా కాదు. ఆయనకు సలహా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు. ఆలోచన తప్ప సమాలోచన ఆయన నిఘంటువులో లేదు. పెరిగిన వాతావరణం ముఠా కుమ్ములాటల మయం కారణంగా ఫ్యాక్షన్ కుటుంబాలకు ప్రజాస్వామ్యం అనే పదం వినోదంగా కనపడుతుంది. చెప్పిన పని, ఎదురు చెప్పకుండా చేసే వారు మాత్రమే ఆ కుటుంబాలకు దగ్గరగా మసల గలుగుతారు. మార్గం ఏదైనా ఫలితం మాత్రం తమకు అనుకూలం కావాలని కోరుకోవడం వారికి అలవాటైన విద్య. అందుకే బాబాయి హత్య వారికి తప్పుగా కనిపించడం లేదు. అడ్డం వచ్చే వారిని పక్కకు తప్పిస్తే నేరమెట్లా అవుతుందని వారు భావించడం సహజం. తమ నీడను చూసి తామే భయపడడం నియంతల స్వభావం. అందుకే మన రాష్ట్రంలో ఉద్యోగుల మీద నిఘా, ఉపాధ్యాయుల మీద ప్రతాపం, సామాజిక మాధ్యమాలలో చిన్న పోస్ట్ పెట్టినా ఉలిక్కి పడడం, ప్రతిపక్షాల సభలకు వచ్చే జనాన్ని చూస్తే జడుపు, ప్రతీ సమస్యకు సీబీసీఐడీ పోలీసులను ప్రయోగించడం, అరెస్టులు, కేసులు, దాడులు, దుర్మార్గాలతో ప్రజలను భయపెట్టడం సర్వ సాధారణం అయిపోయింది. పులులమని చెప్పుకుని పిరికితనం పాలు తాగే నైజం వైసీపీ నాయకులకు బాగా వంట పట్టింది. పక్కన పోలీస్ లేకుంటే గడప దాటి కాలు బయట పెట్టలేని స్థితిలో వారిలో అభద్రతా భావం పెరిగి పోయింది.
*ప్రజలు ప్రశ్నిస్తే వీరికి కోపం
ప్రజలు తమ హక్కులను అడిగితే వీరికి కోపం. ప్రజలకు బాధ్యతలు తప్ప హక్కులుండవని వీరి నమ్మకం. బాధ్యత అంటే తాము విసిరిన బిస్కట్లు ఏరుకొని తిని, చెప్పిన గుర్తు మీద ఓటు ముద్ర వేయడం మాత్రమేనని వారి భావన. ఇసుక అమ్మినా, గనులు కొల్లగొట్టినా, ప్రభుత్వ దుకాణాలలో కల్తీ మద్యం పోసినా, భూములు కబ్జా చేసినా, కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినా, దళితులకు గుండు కొట్టి, దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా…. ఇది వైసీపీ పాలకుల నైజం. లాఠీలతో చావబాదినా, తన్నులు తిన్నవాడి మీదనే కేసులు పెట్టినా భరించాలే తప్ప ఇదేమిటని ప్రశ్నిస్తే వీరికి కోపం వస్తుంది. చిరాకు పడతారు. మరింత రెచ్చిపోతారు. అకృత్యాలను మరింత ఉదృతం చేస్తారు. ప్రభుత్వ వ్యవస్థ రాజు చెప్పినట్లు నడుచుకోవాలన్నది జగన్ అభిమతం. ప్రత్యర్థులను, ప్రతిపక్షాలను చిత్తుగా చితక్కొట్టడం రాజనీతిగా భావించే వైసీపీ, గత మూడున్నరేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు భయంకరమైన అనుభవాలను ఇచ్చింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రను అడ్డుకోవడమే ఒకటో నెంబర్ జీవో కుట్ర. ప్రభుత్వ వైఫల్యాలు ప్రత్యర్థి మాటలతో బహిర్గతం కాకూడదనే దురుద్దేశంతోనే ఈ జీవో జారీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక గత రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క మంచి చట్టం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం మంచి చట్టం చేయక పోవడం మాట అటుంచి ప్రజాస్వామ్యాన్ని నిలువునా పాతర వేయడానికి ఎక్కడో అట్టడుగున ఉన్న బ్రిటీష్ కాలం నాటి 1861 పోలీస్ చట్టాన్ని బయటకు తీసి, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ప్రజలకు తెలియజేసే హక్కులను కాలరాస్తోంది. బ్రిటీష్ దొరలు, విదేశీ పాలకులు భారతీయులను బానిసలుగా కాళ్ళ కిందే పడి ఉండాలని, జనం ఉద్యమాలు, ఊరేగింపులు అంటూ వీధులకెక్కకుండా ఉండాలని ఇలాంటి చట్టాలు చేశారు. స్వతంత్ర సమరంలో పాల్గొన్న ఏ వీరుడూ వీటిని లెక్క చేయకుండా ధిక్కరించి జైళ్లకు వెళ్లి తెల్ల దొరల దురంతాలకు చరమ గీతం పాడారు. అలాంటి దుర్మార్గమైన చట్టాలతో మనల్ని ఆపలేరు. మనమిప్పుడు బానిసలం కాదు.. రాజ్యాంగ రక్షణ ఉన్న పౌరులం, పౌర హక్కులను హరించి వేసే ఏ దుష్ట ప్రయత్నాన్ని కూడా సహించకూడదు. ఒకటో నెంబర్ జీవోను చెత్త బుట్టలో విసిరేయడానికి స్వాతంత్య్ర పోరాటం అవసరం లేదు. ప్రజలందరూ వీధులలోకి వచ్చి గట్టిగా ఒక్క కేక పెడితే చాలు. నియంతల పాలనను దహించేసే దృశ్యం మూడు నెలల క్రితమే మన రాష్ట్రంలో ఆవిష్కృతమయ్యే పరిస్థితి ఏర్పడింది. సమాజ శ్రేయస్సు తప్ప స్వార్థం తెలియని రాజకీయ నేత కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోలీస్ విన్నపాన్ని అర్థం చేసుకొని గత అక్టోబర్ 17వ తేదీన విశాఖ హోటల్ గదిలో తనకు తాను బందీగా గడిపారు. ఆ రాత్రి ఆయన హోటల్ గది దాటి, వీధిలోకి వచ్చి, ఆవేశంతో ఊగిపోతున్న జనం ముందు చేతులు కట్టుకొని నిలబడి ఉంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న అరాచకీయ విష సర్పాలు ప్రజాగ్రహం అనే మంటల్లో ఆ రోజే మాడి మసి అయ్యేవి. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువతరంలో ఉన్న అభిమానం భగ భగ మండే నిప్పుకణికతో సమానమని, ఓర్పుతో, నిగ్రహంతో, సంయమనంతో ఆ నిప్పుకణికకు నివురు కప్పి పెడుతున్నారు. ఆయనలో ఆ నిగ్రహం సడలిన నాడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన నియంతృత్వ పాలనకు శాప విమోచనం జరిగి పోతుంది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు హానికరంగా తయారైన వైసీపీ పాలన తీరును మార్చడానికి నిజాయితి, నిబద్ధత, సిద్ధాంతలతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరం. అది జనసేన తోనే సాధ్యం….అని శ్రీ నాగబాబు స్పష్టం చేశారు.
హమ్ దేఖేంగే..
హమ్ దేఖేంగే..
మీ పతనం తథ్యం..
మేము చూస్తాం.. మనమూ చూస్తాం…
మీ పతనాన్ని మా కళ్ళారా చూస్తాం..
వైసీపీ పతనాన్ని మనందరి కళ్ళారా చూస్తాం….అంటూ ముగించారు.