Pawan Kalyan- Nagababu: జనసేనలో మెగా బ్రదర్ నాగబాబు యాక్టివ్ గా పనిచేస్తున్నారు. తమ్ముడు పవన్ కు వెన్నంటి నడుస్తున్నారు. జనసేన బలోపేతం పై ఫోకస్ పెంచారు. అయితే ఇటీవల పవన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలు చూసి కలవరపాటుకు గురవుతున్నారు. అదే సమయంలో సొంత పార్టీ శ్రేణులను అలెర్ట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నేరపూరిత రాజకీయాలకు తాను బలవుతానేమో అని పవన్ వ్యాఖ్యానించినప్పుడు నాగబాబు డిప్రెషన్ కు గురయ్యారు. ఎమోషనల్ గా ఫీలయ్యారు. అటు సోదరుడిగా బాధపడినా.. జనసేన నాయకుడిగా మాత్రం ధైర్యంతో మాట్లాడారు. అటువంటి సందర్భం వస్తే ముందుగా తానే బలవుతానని కూడా స్పష్టం చేశారు. తనను దాటుకొని పవన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుందని వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలే పంపారు.

పవన్ విశాఖ పర్యటన సమయంలో కూడా నాగబాబు ఆయన వెంటే ఉన్నారు. అటు ఎయిర్ పోర్టు ఘటనను బాధ్యులు చేస్తూ జనసేన నాయకులపై కేసులు నమోదయ్యాయి. అటు పవన్ జనవాణి కార్యక్రమానికి హాజరుకాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అటు విశాఖను వీడి విజయవాడ చేరుకున్న పవన్ వైసీపీ నేతల చర్యలపై దీటుగా స్పందించారు. కాస్తా ఘాటుగానే రియాక్టయ్యారు. అయితే ఈ క్రమంలో తనపై నేరపూరిత రాజకీయాలకు బలవుతానేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్యచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా అనుమానించారు. తనను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై చెప్పుతీసి మరీ హెచ్చరికలు పంపారు. వీటిన్నింటినీ గమనించిన నాగబాబు తమ్ముడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ఆ పరిస్థితే కానీ వస్తే అంతకంటే ముందుగా నేనే నిలబడతానని నాగబాబు ప్రకటించడం జన సైనికుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.

అయితే మెగా బ్రదర్స్ పై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం ముందుగా రియాక్టు అయ్యేది నాగబాబే. అటు మెగా అభిమాన సంఘాల వారధిగా కూడా వ్యవహరిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అటు తరువాత కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. గత ఏడాదిగా జనసేన యాక్టివ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను తీసుకున్నారు. అటు మెగా అభిమానులు, ఇటు జన సైనికుల మధ్య కోఆర్డినేటర్ గా ఉంటూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. జనసేన ఆఫీషియల్ స్పీచ్ మెన్ గా కూడా పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళుతున్నారు. మొత్తానికైతే పవన్ కు మెగా బ్రదర్ నాగబాబు అన్ని అంశాల్లో కొండంత అండగా నిలుస్తూ వస్తున్నారు.