AP Govt Schools: ఒకప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి సెల్ ఫోన్ తో ప్రవేశిస్తే నేరం…ఇప్పుడు దానిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అక్కడితో ఆగకుండా ఇప్పుడు విద్యార్థులు కూడా సెల్ ఫోన్లు తెచ్చుకోవాల్సిందేనని ఆదేశాలిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్ లైన్ బోధన నేపథ్యంలో ఏపీలో జగన్ సర్కారు ప్రఖ్యాత బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం పరిమిత ఒప్పందాలకు పరిమితమైన ప్రభుత్వం నవంబరు 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆన్ లైన్ విద్యాబోధన చేపట్టాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చింది. విద్యార్థులు తప్పకుండా స్మార్ట్ ఫోన్లు తెచ్చుకోవాలని ఆదేశాలిచ్చింది. అయితే ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం విద్యార్థికి రూ.10 వేల చొప్పన అదనపు భారం పడనుంది. పైగా సెల్ ఫోన్లతోచదువులెలా సాగుతాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

జాతీయ విద్యావిధానంతో సామాన్య, పేద కుటుంబాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిన్నటికి నిన్న గ్రామాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేశారు. సమీప ఉన్నత పాఠశాలల్లో మెర్జ్ చేశారు. అటు ఉపాధ్యాయులను సైతం సర్దుబాటు చేశారు. అయితే ప్రక్రియ ఇంతవరకూ ఒక కొలిక్కిరాకపోగా ఇప్పుడు ఆన్ లైన్ బోధన అంటూ హడావుడి చేయడం ప్రారంభించింది. నాలుగు నుంచి పదో తరగతి విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా బోధనకు సన్నద్ధమవుతోంది. అయితే దీనిపై తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ కొనాలంటే చేతిలో రూ.10 వేలు ఉండాలి. పోనీ పిల్లాడి చేతిలో ఫోన్ పెడితే సక్రమంగా వినియోగిస్తాడా? లేదా పక్కదారి పడతాడా? అన్న అనుమానం తల్లిదండ్రులను వెంటాడుతోంది. విద్యార్థుల చేతిలో సెల్ ఫోన్లు ఇస్తే కలిగే దుష్పరిణామాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

అయితే దీనిపై ఉపాధ్యాయులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉపాధ్యాయులను తగ్గించేందుకే ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేసే అనేక నిర్ణయాలను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇప్పుడు ఆన్ లైన్ బోధన హడావుడి అందులో భాగమేనన్న ఉపాధ్యాయులు అనుమానిస్తున్నారు. నేరుగా తరగతి గదిలోనే బోధన, అనుమానాల నివృత్తి చేస్తుంటేనే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడం లేదని.. అటువంటిది ఆన్ లైన్ బోధనతో విద్యాబోధన కుంటుపడడం ఖాయమని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వం నవంబరు 1 నుంచి 1 నుంచి 4 వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్లు తెచ్చుకోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.