Naga Babu: ఎన్నడూ లేనంతగా జనసేనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ ఒంటరిగా పార్టీ నడిపిన పవన్ కళ్యాణ్ కు సోదరుల అండ దొరికింది. నాగబాబు ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలోకిరగా.. చిరంజీవి మాత్రం తన సపోర్టు ఎప్పటికీ జనసేనకు ఉంటుందని అభయమిచ్చారు. అభిమాన సంఘాల ప్రతినిధులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా అభిమాన సంఘాలన్నీ ఒకే తాటిపైకి వస్తున్నాయి. అయితే గత కొంతకాలంగా చిరంజీవి రాజకీయ రీ ఎంట్రీపై రకరకాల కథనాలు వచ్చాయి. ఆయన రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నారని టాక్ నడిచింది. దీనిపై మెగా అభిమానులతో పొలిటికల్ సర్కిల్ లో కూడా ఒక రకమైన ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఇటువంటి సమయంలో మెగా బ్రదర్ నాగబాబు జనసేన కోసం క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఆయన జనసేన కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అయితే ఎక్కడికక్కడే పార్టీ శ్రేణుల నుంచి, మెగా అభిమానుల నుంచి ఒక రకమైన ప్రశ్న వస్తోంది. చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఎక్కువమంది ప్రశ్నిస్తున్నారు. ఆయన జనసేనలోకి వస్తే పార్టీకి మరింత ఊపు వస్తుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఆయన మద్దతు ఉంటుంది..
జనసేనకు చిరంజీవి మద్దతు విషయంలో నాగబాబు క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. చిరంజీవి కి సినిమాలంటే ప్యాషన్ అని చెప్పారు. ఆయన సినిమా రంగంలో కొనసాగుతారని స్పష్టం చేశారు. కానీ ఆయన మద్దతు మాత్రం జనసేనకు ఉంటుందని కుండబద్దలుగొట్టారు. మొత్తానికి జనసేనకు మెగా బ్రదర్స్ లో ఒకరు ప్రత్యక్షంగా..మరొకరు పరోక్షంగా సహకారమందించడంపై జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Singer KK Remuneration: ఒక్క పాట కి KK ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాడో తెలుసా?
మరోవైపు నాగబాబు తన పర్యటనల్లో ఎక్కడా మాట జారకుండా జాగ్రత్త పడుతున్నారు. పొత్తుల విషయంలో మీడియా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర విషయంలో స్వరాన్ని పెంచారు. ఈ ప్రాంతాన్ని గతంలోని ప్రభుత్వం..ప్రస్తుత ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయంటూ ఆరోపించారు. విశాఖలోని రుషికొండకు గుండు కొట్టటమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
పార్టీ ముఖ్యులతో పవన్ సమావేశం జనసేన లో కొన్ని ప్రాంతాల్లో నాయకత్వం లోపాలు ఉన్నాయని అంగీకరించారు. పార్టీలో అక్కడక్కడా విభేదాలున్నా..కార్యకర్తలు బలమైన మద్దతు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో విలువైన ఖనిజ సంపద ఉందని.. వనరులు ఉన్నాయని, అయినా స్థానిక ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన దీన పరిస్థితులు కొనసాగుతున్నాయని నాగబాబు ఆవేదన వ్యక్తం చేసారు.
పొత్తులపై ఫోకస్..
మరోవైపు పవన్ కల్యాణ్ శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న సమావేశం హాట్ టాపిక్ గా మారింది. జనసేన శ్రేణులపై కేసులు, వాటిని ఎలా ఎదుర్కొవాలి అన్న అంశంపై మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటుచేస్తున్నారు. అక్కడ పవన్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశముంది. పార్టీ కార్యకర్తలపైన కేసులు నమోదు అంశం పైన డీజీపీని కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేత మనోహర్ డీజీపీకి లేఖ రాసారు. అదే సమయంలో సాధ్యమైనంత వరకు జిల్లాల పర్యటనలు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మరోవైపు పొత్తులపై కూడా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బీజేపీతో మిత్రపక్షంగా ముందుకెళుతున్నారు. ఈ నెల 6,7 తేదీల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటన సమయం లో తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటుగా పొత్తుల అంశం పైన క్లారిటీ ఇవ్వనున్నారు. నడ్డాతో పవన్ విజయవాడలో 7వ తేదీన సమావేశం అవుతారని తెలుస్తోంది. ఆ సమయంలో రెండు పార్టీల భవిష్యత్ రాజకీయ అడుగులు పైన పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పిన పవన్ ..ఇప్పుడు రాజకీయంగా వేస్తున్న అడుగులను అటు టీడీపీ ఆసక్తిగా గమనిస్తోంది, పొత్తుల అంశం పైన తమ వైపు నుంచి తొందర పడి ప్రతిపాదనలు చేయకూడదని ఇప్పటికే టీడీపీ నిర్ణయించింది. దీంతో..పార్టీ సమావేశం..నడ్డా పర్యటన తరువాత ఏపీలో పొత్తులపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Also Read:Chandrababu Naidu- KCR: చంద్రబాబు, కేసీఆర్.. ఓ సీక్రెట్ కుట్ర కోణం