Somu Veerraju- Nadendla Manohar: ఏపీలో ఎన్నడూ లేనంతంగా పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. ఇంకా ఎన్నికలకు ఏడాది పైగా సమయమున్నా రేపే అన్న రేంజ్ లో పార్టీలు స్పీడ్ పెంచాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య పొత్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు జరగకున్నా..వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఒకే అజెండాతో ముందుకెళుతున్నాయి. అయితే ప్రధాని మోదీ విశాఖ వేదికగా పవన్ ను కలిసిన తరువాత సమీకరణాలన్నీ మారిపోయాయి. ఇది జరిగి వారం దాటుతున్నా దీని వెనుక రచ్చ ఆగడం లేదు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. విశ్లేషణలు చెబుతున్నారు. అటు పవన్ ఒక చాన్స్, ఇటు చంద్రబాబు అఖరి చాన్స్ అని స్లోగన్స్ మొదటు పెట్టడంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందన్న కామెంట్స్ వినిపించాయి. అటు బీజేపీ నాయకులు కూడా స్వరం పెంచారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని.. పవన్ తో ప్రధాని ఇదే విషయం చెప్పారని వారు ప్రచారంచేయడం ప్రారంభించారు.

తాజాగా ఈ ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏపీలో బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయన్నారు. కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు. దీనిపై ప్రధాని మోదీ పవన్ కు స్పష్టం చేశారని అని కూడా చెప్పుకొచ్చారు. కేవలం బీజేపీ, జనసేన మాత్రమే కలిసి ముందుకు నడుస్తాయన్నారు. టీడీపీతో పొత్తును బీజేపీ పెద్దలు అంగీకరించలేదన్న విషయం పవన్ కు తెలిసిందని అర్ధం వచ్చేలా సోము కామెంట్స్ చేశారు. వీటికి మీడియాలో ప్రాధాన్యం లభించింది. అటు సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అయితే ఓవరాల్ గా జనసేనను కార్నర్ గా చేసి జరుగుతున్న ప్రచారం, మోదీ, పవన్ భేటీ విషయాలు బయటకు రావడంపై జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్ స్పందించారు. ప్రధాని మోదీ, పవన్ భేటీలో చర్చకు వచ్చిన విషయాలు గోప్యంగా ఉంచారని.. ఆ విషయాలు బయటకు వచ్చే చాన్స్ లేదన్నారు. పొత్తులపై స్పందిస్తూ ఇప్పటికీ జనసేన ఒకటే స్టాండ్ తో ఉందన్నారు. వైసీపీ విముక్త ఏపీకి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. తద్వారా పొత్తులు ఉంటాయని మనోహర్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. ప్రస్తుతం వివిధ పార్టీల నేతలు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అన్నీ అర్ధరహితంగా తేల్చేశారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయముందున్న మనోహర్.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా జనసేన వ్యవహరిస్తోందని చెప్పారు.

గత ఎన్నికల నుంచి బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. కానీ టీడీపీ ప్రస్తావన వచ్చేసరికి మాత్రం ఆ రెండు పార్టీలు విరుద్ధ ప్రకటనలు చేస్తూ వస్తున్నాయి. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం గత మూడున్నరేళ్లుగా ఒకటే స్టాండ్ మెయింటెన్ చేస్తున్నారు. టీడీపీని కుటుంబ పార్టీగానే అభివర్ణిస్తున్నారు. ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. ప్రధాని మోదీతో భేటీ తరువాత పవన్ వ్యవహార శైలిలో మార్పు రావడాన్ని గమనించిన బీజేపీ నేతలు జనసేన టీడీపీతో కలవదని భావించారు. కానీ నాదేండ్ల మనోహర్ తాజా వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే చేశారని.. పవన్ అనుమతి లేకుండా అలా మాట్లాడరని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో సఖ్యత, మరోవైపు పొత్తుల అంశాన్ని సజీవంగా ఉంచాలన్నదే జనసేన ప్లాన్ గా జనసైనికులు చెబుతున్నారు. మొత్తానికి అయితే సోము వీర్రాజు అలా ప్రకటన చేశారో లేదో.. నాదేండ్ల మనోహర్ అదే స్పీడులో క్లారిటీ ఇవ్వండపై ఉభయ పార్టీల్లో ఒకరకమైన గందరగోళం ఏర్పడింది.