Munugode Bypoll: ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడేదే ప్రజాస్వామ్యం అని.. అబ్రహం లింకన్ ఎప్పుడో నిర్వచించాడు.. కానీ ఆయన నిర్వచించిన ప్రజాస్వామ్యం ఇప్పుడు పూర్తి ధన స్వామ్యమైంది. డబ్బు ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉండేలా పొందుపరిచారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అది కాదు. ఇక తాజాగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ప్రకటన, గురువారం జరిగే పోలింగ్ వరకు ప్రతి విషయంలోనూ డబ్బు కట్టలు తెంచుకుంది. మద్యం ఏరులై పారింది. ఎక్కడికక్కడ అధికార దర్పం బుసలు కొట్టింది. ఇలాంటి స్థితిలో రేపటి తరానికి ఇదీ ప్రజాస్వామ్యం గొప్పతనం ఎలా చెప్పాలి? వెనుకటి విలువలను ఎలా కాపాడాలి? ఇలాంటి డబ్బుతో కూడిన రాజకీయాలు చేస్తూ నాయకులు ఇస్తున్న సందేశం ఏమిటి?

మాకు డబ్బులు ఇవ్వరా?
మునుగోడు ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బహుశా దేశంలో అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక ఇదే కాబోలు. వేలం వెర్రిగా డబ్బులు పంపకం, ఇష్టానుసారంగా మద్యం పంపిణీ, అధికార దుర్వినియోగం.. వెరసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించాయి. గురువారం పోలింగ్ నేపథ్యంలో బుధవారం రాత్రి వరకు పంపకాలు జోరుగా సాగాయి. చాలా ప్రాంతాల్లో ఓటర్లు మాకు డబ్బులు ఇవ్వరా అంటూ నాయకులను ప్రశ్నించారు. తులం బంగారం అన్నారు. ద్విచక్ర వాహనాలు ఇస్తామన్నారు. ఇంతా తీస్తే ఇచ్చేది కేవలం మూడు వేలేనా అంటూ నిట్టూర్చారు. పైగా ఎక్కడికక్కడ నేతలను నిలదీశారు. సంస్థాన్ నారాయణపురం, చండూరు, మర్రిగూడ మండలాల్లో అయితే ఓటర్లు రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. మరో ప్రధాన పార్టీ ఓటుకు నాలుగు వేల చొప్పున పంపిణీ చేస్తే.. అధికార పార్టీ కేవలం 3000 ఇస్తుండడంతో ఓటర్లు నారాజ్ గా ఉన్నారు.

ఖర్చు అదిరిపోయింది
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఇందు కోసం డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టాయి. మూడు ప్రధాన పార్టీలు ఖర్చు మూడంకెల కోట్లను మించిపోయింది. ఒకవేళ గనుక ఈ డబ్బులనే ప్రజల కోసం ఖర్చు పెట్టి ఉంటే మునుగోడు భవిత మరో మాదిరి ఉండేది. కానీ అధికారమే పరమావధిగా భావించిన నాయకులు డబ్బులను ఓట్లు కొనుగోలు చేసేందుకు మాత్రమే ఖర్చు పెట్టారు. ఫలితంగా మునుగోడు ఉప ఎన్నికలను అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా మార్చారు. ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. గెలుపుపై ఎవరి ఆశలు వారే పెట్టుకున్నారు. గురువారం ఉదయం కూడా అక్కడక్కడ డబ్బులు పంచుతూ కనిపించారు.