Munugode By Poll: మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల్లోనూ కాక రేపుతోంది. ఎలాగైనా గెలిచి తీరాలనే తలంపుతో అన్ని పార్టీలు ఓటర్లకు ప్రతిరోజును పండగలాగా చేస్తున్నాయి. ముక్క, చుక్క, లెక్క తో ఇప్పుడు మునుగోడు కాస్త మనీ గోడు అయింది. సరే ఈ విషయం పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్లు, వెలమలదే పెత్తనం. ఓసిల్లో రెడ్ల ఓట్లు 7,701(3.3%), కమ్మ 4,880(2.1%), వెలమ 2,360(1%), వైశ్య 3,760(1.6%) శాతం ఓటర్లు ఉన్నారు. బీసీలు మాత్రం 66.2% ఓటర్లు ఉన్నారు. అయితే బీసీల్లో గౌడ, యాదవులు, ముదిరాజుల ఓట్లు ఎక్కువ. ఈ జనాభా దమాషా ప్రకారం మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీలకే అవకాశం ఇవ్వాలని మొదటి నుంచి కుల సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘంతో పాటు, గౌడ, యాదవ, ముదిరాజ్, పద్మశాలి సంఘాలు బీసీల కే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటినుంచే గౌడ, యాదవ, పద్మశాలి సంఘాల పెద్దలు సమావేశాలు పెడుతూ తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. బీసీలకు టికెట్ ఇవ్వకుంటే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కానీ టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఓసీలకు అందులోనూ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చాయి. తీరా ఇప్పుడు వారిని గెలిపించుకునేందుకు బీసీల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీల తీరుపై బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తమను లీడర్ల గానే కాకుండా ఓటర్లుగానే చూస్తున్నారు లోలోపల కుమిలిపోతున్నారు.

అధికార పార్టీ తిరుగుబాటు చేసినా
అధికార పార్టీకి ఆదిలోనే బీసీలో నుంచి తిరుగుబాటు ఎదురయింది. పార్లమెంట్ మాజీ సభ్యుడు బూర నరసయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నారబోయిన రవి లాంటి వారంతా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు. ఒక దశలో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి మరి చెప్పించారు. కానీ వీటిని పెద్దగా పట్టించుకోని పార్టీ అధిష్టానం చివరకు ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఇప్పటికీ ఆయా నేతలను దూరంగానే పెడుతోంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న రాజు గోపాల్ రెడ్డి బిజెపిలో చేరడంతో మళ్లీ ఆయనకే టికెట్ ఇవ్వక తప్పలేదు. టిఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పార్టీలోనూ టికెట్ కొట్లాట జరిగింది. బీసీ లీడర్లు పున్నా కైలాష్ నేత, పల్లె రవికుమార్ లాంటి వాళ్ళు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారు. కొత్తగా పార్టీలో చేరిన డాక్టర్ సుధాకర్ గౌడ్ తనకు టికెట్ కు వస్తుందని ఆశించారు. మరోవైపు బీసీలకు దీటుగా ఓసీ వర్గం వారు కూడా టికెట్ కోసం పట్టుబట్టారు. ఓవైపు పాల్వాయి స్రవంతి, మరోవైపు చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ పడ్డారు. పలు రాజకీయ సమీకరణాల అనంతరం కాంగ్రెస్ లో గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ స్రవంతికే టికెట్ ఇచ్చింది. ఇలా మూడు ప్రధాన పార్టీలు ముగ్గురు రెడ్లకే టికెట్లు ఇవ్వడంతో బీసీ నేతల్లో నైరాశ్యం అలముకుంది.
కులాల వెంట పడుతున్నాయి
ఓసీలకు టికెట్లు ఇచ్చిన ప్రధాన పార్టీలు బీసీ కులాల ఓటర్ల వెంట పడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ గొల్ల, కురమలకు గొర్రెల చెక్కులు, గౌడ్ లకు నీరా లైసెన్స్ లు, పద్మశాలిలకు నేత బంధు, ప్రభుత్వం నుంచి రుణాలు, ముదిరాజులకు చేప పిల్లల పంపిణీ ఆశ చూపి ఓట్లు అడుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు కుల సంఘాల వారిగా సమావేశాలు పెట్టి హామీలు గుప్పిస్తున్నారు. ఒక బిజెపి ఇదంతా కూడా తమ ఘనత అని ప్రచారం చేసుకుంటున్నది. కాంగ్రెస్ నాయకులు బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళూ గొర్రెలు, బర్రెలు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికుల గురించి పట్టించుకోని ప్రభుత్వం కేవలం ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే స్కీములు తెరపైకి తెస్తోందని విమర్శిస్తున్నారు. ముందుగానే చెప్పినట్టు మునుగోడు నియోజకవర్గంలో బీసీలకే ఆధిక్యం ఎక్కువ. అందువల్లే బూర నరసయ్య గౌడ్ టిఆర్ఎస్ టికెట్ కోసం పట్టుబట్టారు. కర్నే ప్రభాకర్ భార్య పద్మశాలి కావడంతో ఆయన కూడా సీరియస్ గానే ప్రయత్నించారు.

బీసీలకే టికెట్ ఇవ్వాలని కుల సంఘాలు సమావేశాలు నిర్వహించాయి కూడా. అయినప్పటికీ వారి గోసను ఏ పార్టీ పట్టించుకోలేదు. ఇక మునుగోడు చిన్న కొండూరు నియోజకవర్గంగా ఉన్నప్పుడు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొండా లక్ష్మణ్ బాపూజీ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ తరఫున బొమ్మగాని ధర్మభిక్షం (గౌడ), 1999 ఎన్నికల్లో జెల్లా మార్కండేయులు (పద్మశాలి), 2004 ఎన్నికల్లో చిలువేరు కాశీనాథ్ ( పద్మశాలి) పోటీ చేశారు. కొండ లక్ష్మణ్ బాపుజీ తప్ప మిగిలిన వారంతా తప్ప మిగిలిన వారంతా ఓడిపోయారు. అయితే గుడ్డిలో మెల్లగా టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఓసీలకు టికెట్ ఇవ్వడంతో… బీఎస్పీ బీసీ నేత శంకరాచారికి, ప్రజాశాంతి, తన జన సమితి ఉమ్మడి అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ ను రంగంలోకి దింపాయి. అయితే లో లోపల కుతకుత ఉడికిపోతున్న బీసీ ఓటర్లు మునుగోడు లో ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సి ఉంది.