Pawan Kalyan- Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం.. ఈ పేరు రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధిగా కాకుండా కాపు ఉద్యమ నేతగానే సుపరిచితం. అటు ఉమ్మడి ఏపీలో సైతం కాపు వాణిని వినిపించిన నాయకుడు ముద్రగడ. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముద్రగడ పొలిటికల్ గా ముద్ర వేసుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేశారు. అనూహ్యంగా కాపు ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. అయితే ఈ క్రమంలో చాలా పార్టీలు మారారు. కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు. మరికొన్నిసార్లు ఫెయిలయ్యారు. కానీ కాపు ఉద్యమ నేతగానే గుర్తించబడ్డారు. 1994లో ప్రత్తిపాడులో తొలిసారి ఓటమి ఎదురైన తరువాత నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఇక ప్రత్తిపాడు ముఖమే చూడనని.. ఇక్కడ నుంచి పోటీ చేయనని శపథం చేసి మరీ తప్పుకున్నారు. 2009లో పిఠాపురం సీటును కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేయడంతో కాదనలేకపోయారు. పోటీచేసినా ఆయనకు నిరాశే ఎదురైంది. ప్రత్యక్ష రాజకీయాలెందుకని కాపు ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరుతారని భావించినా.. అటువైపు వెళ్లలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చగలిగారన్న టాక్ ఉండేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కాపు ఉద్యమాన్ని బంద్ చేసి ఇంటికే పరిమితమయ్యారు.
2024 ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది. అధికార వైసీపీ నుంచి బంపర్ ఆఫర్ ఉన్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం జనసేన జోరు మీద ఉన్న నేపథ్యంలో జగన్ పునరాలోచనలో పడ్డారు. బలమైన కాపు సామాజికవర్గం నేతలను బరిలో దించడం ద్వారా పవన్ ను చెక్ చెప్పొచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగా ముద్రగడను వైసీపీకి రప్పించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ముద్రగడ వైసీపీలోకి వస్తే.. కాకినాడ ఎంపీ సీటు కానీ.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సీటు కానీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ముద్రగడ మాత్రం దీనిపై ఎటువంటి సంకేతాలు ఇవ్వనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన దాదాపు రెండు దశాబ్దాల నుంచి యాక్టివ్ పొలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. రెండుసార్లు పోటీచేసి ఓటమి చవిచూశారు. ఇప్పుడు కానీ తొందర పడితే మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని భావిస్తున్నారు. అందుకే జగన్ ఇచ్చిన ఆఫర్ కు టెంప్ట్ అవ్వక పెండింగ్ లో పెట్టారు.
అయితే ముద్రగడ మౌనానికి పవనే కారణమని తెలుస్తోంది. ఈసారి జనసేనకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే పవన్ మేనియా నడుస్తోంది. పైగా పవన్ ప్రత్తిపాడు నుంచి బరిలో దిగుతారన్న ప్రచారం ఉంది. ఆయన కానీ బరిలో దిగితే మాత్రం తూర్పుగోదావరి జిల్లాపై స్పష్టమైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ స్థానంలో వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలున్నాయి. గతంలో ప్రజారాజ్యం రూపంలో ఎదురైన దెబ్బను ముద్రగడ మరిచిపోలేదు. అందుకే ఎన్నికల వరకూ వేచిచూడాలన్న రీతిలో పద్మనాభం అండ్ కో ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం వైసీపీ వైపు ఏమంతా మొగ్గు చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్న అపవాదు ఆయనపై ఉంది. ఇప్పుడు అదే పార్టీలోచేరితే పొలిటికల్ గా డ్యామేజ్ జరుగుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడు ముద్రగడ ముందు జనసేన రూపంలో మరో ఆప్షన్ ఉంది. ప్రజల్లో కూడా ఆ పార్టీ పట్ల సానుకూలంగా ఉంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ప్రజలు సంపూర్ణంగా టర్న్ అయ్యారు. పైగా జనసేనలో చేరితే ఎటువంటి అడ్డంకులు, అభ్యంతరాలుండవు. పైగా పవన్ కు పెద్దదిక్కుగా నిలిచే అవకాశం సైతం ఉంది. గత రెండు ఎన్నికల్లో వైసీపీకి ముద్రగడ ఆయాచిత లబ్ధి చేకూర్చారన్న టాక్ కు కూడా చెక్ చెప్పే అవకాశముంది. పొలిటికల్ గా కూడా వారసుడికి లైన్ క్లీయర్ చేయవచ్చు. అందుకే అధికార పార్టీ ఆఫర్ ను పెండింగ్ లో పెట్టారని.. ఎన్నికల సమయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని ముద్రగడ అభిమనులు, అనుచరులు చెబుతున్నారు.