Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం.. కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నేత. రాజకీయ నాయకుడి కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే సుపరిచితం. అయితే ఆయన ప్రస్తుతం వైసీపీ కండువా కప్పి మాట్లాడుతున్నారు. కాపు ముసుగు తీసి డైరెక్టు అయ్యే క్రమంలో జనసేన అధినేత పవన్ పై పడ్డారు. కాపుల ఈబీసీ రిజర్వేషన్లను జగన్ తీసేటప్పుడు…పవన్ పై వైసీపీ శ్రేణులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు.. వంగవీటి మోహన్ రంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను జగన్ విస్మరించినప్పుడు.. అదే వంగవీటి వారసుడు రాధా హత్యకు రెక్కీ నిర్వహించినప్పుడు..వైసీపీ నేత కొడాలి నాని కాపు నా కొడకల్లారా అన్నప్పుడు… ఇలా ఏ సందర్భంలోనూ మాట్లాడని ముద్రగడ ఇప్పుడు వారాహి యాత్రలో పవన్ వైసీపీ నేతలపై విమర్శలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం పవన్ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపడుతున్నారు. ఈ నెల 14న ప్రారంభమైన యాత్రలో రోడ్ షోలతో పాటు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పవన్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాలు చేసే నాయకులు కొందరి లాభం కోసమే ప్రయత్నిస్తున్నారంటూ పవన్ ఆరోపించారు. ప్రభుత్వాలు మారిపోయిన తరువాత ఉద్యమాలు మూసివేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. దీనిపై ముద్రగడ రియాక్టయ్యారు. పవన్ కే ఏకంగా సుదీర్ఘ లేఖ రాశారు. అయితే ఆయన లేఖ తానెందుకు ఉద్యమాన్ని నిలిపివేసింది రాయలేదు. కానీ అడుగడుగునా వైసీపీపై, జగన్ పై తనుకున్న అభిమానాన్ని చాటుకుంటూ లేఖ రాశారు.
లేఖ మొత్తం పవన్ వ్యాఖ్యలు, వ్యవహార శైలిని తప్పుపట్టారే తప్ప.. వైసీపీ నుంచి కాపు కులానికి, నాయకులకు ఎదురైన అవమానాలు, అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు. ప్రధానంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ కుటుంబం కాపుల అభ్యున్నతికి పాటుపడిన విషయాన్ని ప్రస్తావించారు. కాపు రిజర్వేషన్ ఉద్యమానికి చంద్రశేఖర్ రెడ్డి తాత, తండ్రి ఎంతగానో చేయూతనిందించారని చెప్పుకొచ్చారు. ద్వారపురెడ్డి ఒక సచ్ఛిలుడిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయనపై విమర్శలు ముద్రగడకు బాధ కలిగించాయట. అతడు తప్పుడు మనిషి అయితే కాకినాడ ప్రజలు ఎందుకు రెండుసార్లు గెలిపించారని ముద్రగడ ప్రశ్నించారు. దమ్ముంటే చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి గెలవాలని పవన్ కు ముద్రగడ సవాల్ చేశారు.
అక్కడితో ఆగని ముద్రగడ పవన్ వాడుతున్న భాష, ఆహార్యంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2019లో తానిచ్చిన సలహా మేరకు పోరాడి ఉండి ఉంటే బాగుండేదన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై పోరాడాలని తాను సూచించినట్టు ముద్రగడ గుర్తుచేశారు. మొత్తానికైతే ముద్రగడ అసలు సిసలైన వైసీపీ మాదిరిగా మారిపోయారు. ప్రస్తుతం పవన్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలనే గుర్తుచేస్తూ లేఖ రాశారు. అయితే ఈ లేఖ ముద్రగడ రాశారా? లేకుంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందా అన్న సెటైర్లు పడుతున్నాయి.