151 మంది ఎమ్మెల్యేలు.. 23 మంది ఎంపీలున్న ఏపీ సీఎం జగన్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు వైసీపీ నుంచే గెలిచిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టుకెక్కాడు. అది విచారణకు వస్తే జగన్ కు చిక్కులే. అలాంటిది జగన్ వదిలిపెడుతాడా? తాజాగా కొరఢా ఝలిపించాడు.
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసి వీడియోలు రిలీజ్ చేస్తూ నానా రచ్చ చేస్తున్న వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు గట్టి షాక్ ఇచ్చారు వైఎస్ జగన్. గత కొంతకాలంగా ఏపీ సర్కార్ పై రఘురామ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి తదితరులపై ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను తప్పులను ఎత్తి చూపుతూ ఎండగడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఎంపీ రఘురామను ఈరోజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం.
హైదరాబాద్లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామకృష్ణంరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
అయితే రఘురామను అరెస్ట్ చేసి తీసుకెళ్లకుండా మొదట కేంద్ర ప్రభుత్వ సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చిచెప్పారు. బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారని సమాచారం.
ఈరోజు రఘురామ బర్త్ డే. ఇదే రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా శుక్రవారం.. రేపు శనివారం.. ఎల్లుండి ఆదివారం అంటే వరుసగా మూడు రోజులు రఘురామను బుక్ చేసేలా సీఎం జగన్ స్కెచ్ గీసినట్లు తెలుస్తోంది. దీన్ని పక్కా ప్రణాళికతోనే రఘురామను బుక్ చేసినట్టు అర్థమవుతోంది.