నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజకీయంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు వస్తే ఎలా విజయం సాధించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. వైసీపీ ఆయనపై అనర్హత వేటు వేయించాలని చూస్తున్న నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైతే జరగబోయే పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. నియోజకవర్గంలో స్వతంత్రంగా పోటీ చేసినా విజయం సాధించాలనే తపనలో ఉన్నారు. దీని కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
రఘురామపై వైసీపీ కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఆయనపై ఎప్పుడు వేటు పడినా ఆశ్చర్యపోనవసరం లేదు. వైసీపీ డిమాండ్లలో మొదటిది రఘురామపై అనర్హత వేటు వేయడమే అని తెలుస్తోంది. తరువాత అభివృద్ధి పనులపై దృష్టి నిలపనున్నట్లు సమాచారం. రఘురామ రాజును పార్టీ నుంచి వెళ్లగొంట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అనుకోకుండా ఉప ఎన్నిక వస్తే వ్యవహరించాల్సిన వ్యూహంపై రఘురామ ప్రధానంగా ఆలోచిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
రఘురామకు టీడీపీతో మంచి సంబంధాలున్నాయి. బీజేపీతో కూడా రిలేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగి జగన్ నిలబెట్టిన వ్యక్తిని ఓడించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ను ఓడించాలని విపక్షాలు అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. జనసేనకూడా రఘురామకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
రఘురామపై పోటీ చేసే సత్తా గల అభ్యర్థి ఉన్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ఇటీవల బీజేపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ గంగరాజుకు టికెట్ ఇచ్చే యోచనల ఉన్నట్లు సమాచారం. కానీ గంగరాజు ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉంటారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక బీసీ వర్గానికి ప్రాధాన్యమిస్తే కొత్తపల్లి సుబ్బారాయుడుకు కేటాయిస్తారని చెబుతున్నారు. కానీ ఆయన ఎంతవరకు పోటీ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు ఎలాగైనా గెలవాలని భావిస్తున్నట్లు సమాచారం.