
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు బెయిల్ వచ్చింది. అయితే.. న్యాయస్థానం షరతులు కూడా విధించింది. మీడియాతోగానీ.. సోషల్ మీడియాలోగానీ ఎలాంటి విషయాలూ మాట్లాడొద్దని ఆదేశించింది. దీంతో.. ఆ ‘రెండు ఛానళ్లు’ తెగ బాధపడిపోతున్నాయట. అరరే ఎంతపైనేందే అని గింజుకుంటున్నాయట. దీంతో.. వారినీవీరినీ చర్చలకు పిలిచి ‘అలా ఎలా ఆదేశిస్తారు?’ అని చెప్పిస్తున్నాయట.
అయితే.. నిజానికి రాజకీయ నాయకులు అన్న తర్వాత ప్రతీరోజు ఏదో ఒక విషయంపై స్పందిస్తుంటారు. వాటిని రిపోర్ట్ చేయడం మీడియా పని. ఆ తర్వాత ఏవైనా విశ్లేషణలు ఉంటే తమ కోణాన్ని జోడించి కథనాలు వండుతుంటాయి. ఇది సహజం. కానీ.. రఘురామ ఫీడ్ తోనే ఆ రెండు ఛానళ్లు నడుస్తాయని, ఆయన ఫీడ్ లేకపోతే ముందుకు సాగలేవు అన్నట్టుగా వ్యవహరించాయని అంటున్నారు విశ్లేషకులు.
ఆయనకు ప్రత్యేక స్లాట్ కేటాయించి.. ఉద్దేశపూర్వక కథనాలు ప్రసారం చేయించాయని సీఐడీ కేసు నమోదు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఎలాంటి ఉద్దేశమూ లేనప్పుడు ఇలా ప్రత్యేక సమయం ఇచ్చి మరీ.. ఇంటర్వ్యూలు ఇప్పించాల్సిన అవసరం ఏంటన్నది వైసీపీ నేతలు వాదన. ఇది దురుద్దేశ చర్యకాక మరేమిటి అని వారు అంటున్నారు. ఈ వాదనలు కొనసాగుతుండగానే రఘురామకు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది.
కానీ.. మీడియాతో మాట్లాడొద్దని నోటికి తాళం వేయడంతో.. అరరరే ఎంత పనైందీ అంటూ ఆ రెండు ఛానళ్లు మదనపడిపోతున్నాయట. సుప్రీం ఆదేశం లేకపోతే.. ఒకటీ, రెండూ.. అంటూ ఆ రెండు ఛానళ్లు ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టి ఉండేవని అంటున్నారు. మీడియా వాస్తవాలను చూపించాలి. యథార్థాలను ప్రజలకు వివరించాలి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా.. ఒక పార్టీకి, వర్గానికి కొమ్ముకాయడం ప్రజలకు ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు విశ్లేషకులు.