
రఘురామ విషయంలో వైసీపీ పాచికలు పారట్లేదా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఆయనపై ఆనర్హత వేటు వేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం అంత ఆశాజనకంగా లేదనే ప్రచారం సాగుతోంది. జగన్ ఢిల్లీ పర్యటనలో రఘురామ వ్యవహారాన్ని కూడా సెట్ చేశారని, ఇక రఘురామపై వేటు ఖాయమని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ.. ఆ దిశగా ఎలాంటి సూచనలూ కనిపించలేదు. అనర్హత వేటు వేయాలంటే.. ముందుగా స్పీకర్ షోకాజ్ నోటీసులు జారీచేస్తారు. కారణాలను తెలుసుకుంటారు. కానీ.. ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగకపోవడం గమనించాల్సిన అంశం.
ఇదిలా ఉంటే.. అటు రఘురామ మాత్రం వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో తమకు పనికొస్తాడని కాషాయ నేతలు భావిస్తున్నారేమోగానీ.. అడగ్గానే అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. ఆయన చెప్పే మాటలన్నీ వింటున్నారు. మంత్రులను కలవడమే కాకుండా.. రాజ్యాంగ పరంగా ఎలా ముందుకు వెళ్లవచ్చునో.. అలాంటి మార్గాలన్నింటా వెళ్తున్నారు రఘురామ.
అంతేకాదు.. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ అంశాన్ని చర్చించాలని చూస్తున్నారు. ఈ లోగానే తనకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతున్నట్టు సమాచారం. ఒకవేళ పార్లమెంటులో ఈ చర్చ జరిగితే.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న విషయం సభ దృష్టికి తెస్తే.. జాతీయంగా ఈ విషయం చర్చలోకి వస్తుంది. ఇది పార్టీకి ఇబ్బందికర పరిణామమే అవుతుందని భావిస్తున్న వైసీపీ.. ఆ లోగానే వేటు వేయించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ.. అది జరిగే పరిస్థితి ప్రస్తుతానికైతే కనిపించట్లేదు.
మొత్తానికి.. రఘురామపై అనర్హత వేటు వేయించడం అనేది మాత్రం సాధ్యం కాదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఇదేవిధమైన దాడిని రఘురామ ఇంకా కొనసాగిస్తే.. పార్టీకి ఇబ్బందికరమే. మరి, ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఏం చేస్తుంది? జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.