MP Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నానికి తమ్ముడి పోరు తప్పేలా లేదు. కేశినేని నాని తమ్ముడు చిన్ని పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు. నాని వ్యతిరేక వర్గంతో చేతులు కలిపి టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇన్నాళ్లు అండగా ఉన్న తమ్ముడు పక్కలో బల్లెంలా మారడంతో కేశినేని నాని జీర్ణించుకోలేక పోతున్నారు.

కేశినేని నాని ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోతే, ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఇష్టం లేని వ్యక్తులకు టికెట్లు ఇస్తే సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్న ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ, దేవినేని ఉమా లాంటి కేశినేని నాని వ్యతిరేక వర్గంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీని పై కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. తమ్ముడు ప్రత్యర్థులతో తిరగడం తట్టుకోలేకపోతున్నారు.
కేశినేని శివనాథ్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని గతంలో చంద్రబాబుతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ కోసం ఎవరైనా పనిచేయోచ్చంటూ సర్దిచెప్పుకున్నారు. కానీ కేశినేని చిన్న కార్యక్రమాలు విజయవాడ లోక్ సభ పరిధిలో యాక్టివ్ గా జరుగుతున్నాయి. నిత్యం నగరంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ప్రజల్ని ఆకట్టుకునే పనిలో పడ్డారు. దీంతో తన సీటుకు ఎక్కడ దెబ్బ పడుతుందోనన్న బాధ కేశినేని నానిలో పెరుగుతోంది. దీంతో తమ్ముడి పై బహిరంగ విమర్శలు మొదలుపెట్టారు.

కేశినేని మరో అడుగు ముందుకేసి మీడియా పై కూడ రుసరుసలాడారు. చీరలు, బిర్యానీలు పంచే వారికి మీడియా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. తనది జాతీయ స్థాయి అని అన్నారు. దుర్గ గుడి ఫై ఓవర్ సాధ్యం కాదంటే, సాధ్యం చేసి చూపించానని అన్నారు. రతన్ టాటా తనకు స్నేహితుడంటూ చెప్పుకొచ్చారు. తనకు మీడియా ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తాను ఎన్నో దానాలు చేస్తానని అవన్నీ మీడియాలో వస్తేనే సేవ చేసినట్టా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి తమ్ముడి ఎంట్రీతో నానికి చెక్ పెడతారనే బాధ ఎక్కువగా ఆయనలో కనిపిస్తోందని విజయవాడలో గుసగుసలు వినపడుతున్నాయి.