Vande Bharat Train: ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన పిచ్చి ఉంటుంది… వారి చేస్టలు వారికి పిచ్చిగా అనిపించకపోయినా.. ఎదుటివారికి ఇబ్బందిగా మారుతుంటాయి. ఒక్కోసారి తమ పిచ్చితో వారే ఇరుక్కుపోతారు ఇలా.. తెలుగు రాష్ట్రాల మధ్య కొత్తగా పరుగులు పెడుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను చాలా మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ ట్రైన్ గురించి సరైన అవగాహన లేని ఓ వ్యక్తి.. అలా ప్రయత్నించి ఇలా ఇరుక్కుపోయాడు.

కొత్త ఆరాటంతో..
మనకు ఆరాటం ఎక్కువ. ఏదైనా కొత్త విషయం తెలుసుకునే వరకూ నిద్రపట్టదు. వారం రోజులుగా వందేభారత్ రైలు గురించి మీడియాలో కథనాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు పరుగులు తీయడం మొదలు పెట్టింది. ఇక ప్రయాణికులు వందేభారత్ ఎక్కడం, ఫొటోలు తీసుకోవడం, వీడియోలు తీయడం మొదలు పెట్టారు. వందే భారత్ కూడా.. మామూలు రైళ్లలాగ ఎక్కి ఫొటోలు తీసేసుకోవచ్చనీ, రైలు కదిలే టైంలో దిగేయవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ వందేభారత్ చాలా తక్కువ సమయం మాత్రమే స్టేషన్లలో ఆగుతుంది. పైగా.. దాని డోర్స్ ఆటోమేటిక్‌గా తెరచుకోవడం, ట్రైన్ బయలు దేరే ముందే ఆటోమేటిక్‌గా మూసుకుంటాయి.
సెల్ఫీ తీసుకుందామని..
రైలు గురించి సరైన అవగాహన లేక.. రైలు ఎక్కి ఒక సెల్ఫీ తీసుకుని.. వెంటనే దిగిపోదామని ఓ వ్యక్తి రాజమండ్రిలో వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. ఆ స్టేషన్‌లో వందేభారత్ ఆగేది 2 నిమిషాలు మాత్రమే. దీంతో ఫొటో తీసుకుని దిగుదామనుకునే సమయానికే డోర్ క్లోజ్ అయిపోయింది. ట్రైన్‌లో ఇరుక్కు పోయాడు. డోర్ దగ్గర ఉన్న బటన్ నొక్కి.. పైలట్‌ను ‘ట్రైన్ దిగాలి.. ఆపండి‘ అని కోరాడు. విషయం తెలుసుకున్న పైలట్.. అలా ఎలా ఎక్కావని ఫైర్ అయ్యారు. మధ్యలో ట్రైన్ ఆగదన్న ఆయన.. బుద్ధిలేదా అని క్లాస్ తీసుకున్నారు. విజయవాడలోనే ఆగుతుందనీ.. అక్కడే దిగాలని సూచించారు.

సోషల్ మీడియాలో వైరల్..
ఇలా పొరపాటున వందేభారత్ ఎక్కి ఇరుక్కుపోవడంతో ఈ ప్రయాణికుడి విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతను చేసిన పొరపాటు వల్ల అతను రాజమండ్రి నుంచి.. విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రయాణికుడికి ఫైన్ వేశారా లేక కొత్త ట్రైన్ కదా తెలియక ఎక్కి ఉంటాడని జాలపడి వదిలేశారా అన్నది తెలియాల్సి ఉంది.
మామూలు రైళ్లలా కాదు..
వందేభారత్ మామూలు ట్రైన్స్ లాంటిది కాదు. మెట్రో రైళ్ల లాంటిది. ఇందులో ఆధునిక టెక్నాలజీ ఉంది. డోర్స్ ఆటోమెటిక్‌గా మూసుకుపోతాయి. ప్రధాన స్టేషన్లలోనూ 2 నిమిషాలకు మించి ఆగదు. అలా ఎక్కి ఫొటో తీసుకుని, ఇలా వచ్చేద్దామంటే కుదరదు. ఎక్కేవారు దిగే ప్రయాణికులతో ట్రైన్ ద్వారాలు బిజీగా ఉంటాయి. హడావుడిలో ఫొటోల కోసం ఎక్కితే బుక్ అయిపోతారు. అనవసరంగా వందేభారత్ ఎక్కితే, రైల్వే టీసీలు రూ.10 వేల దాకా పెనాల్టీ వేసే అవకాశం కూడా ఉంది. అందుకే టికెట్ ఉంటేనే వందేభారత్ ఎక్కాలి. లేదంటే బయట నుంచే చూడాలని రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు.