MP Dinesh Sharma
MP Dinesh Sharma: భార్య వేధింపులు తట్టుకోలేక.. ఆమె పెట్టిన కేసుల నుంచి బయటపడే మార్గం లేక.. ఆమె బంధువుల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని ఎదిరించలేక ఇటీవల బెంగళూరు నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. చాలా రోజులపాటు దీనిపై చర్చ నడిచింది. రాజకీయాలక అతీతంగా చాలామంది ఈ ఘటనను ఖండించారు.. ఇలా జరగడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు దినేష్ శర్మ సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. రాజ్యసభలో ఆయన ఈ విషయంపై సుదీర్ఘంగా మాట్లాడారు..” ఇటీవల కాలంలో భార్యల వేధింపులు పెరిగిపోతున్నాయి. భర్తలపై దాడులు సర్వసాధారణంగా మారుతున్నాయి. సున్నిత మనస్కులు భార్యల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన చట్టాల్లో స్త్రీలకు ఉన్నంత వెసలు బాటు పురుషులకు లేకుండా పోతోంది. దీనివల్ల ఇబ్బందికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవి సమాజ శ్రేయస్సుకు ఏమాత్రం మంచివి కావు. ఇలాంటి ఘటనలు ఇలానే జరుగుతుంటే సమాజం విచ్చిన్నం అవుతుంది.. అందువల్లే ఇటువంటి దారుణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందరూ ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రావాలి. ఓకే తాటిపై ఉండి సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. చట్టాల విషయంలో ఏకరూపకత తీసుకురావాలి. స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా చట్టాలను రూపొందించకుండా.. ఒకే విధంగా అమలు చేయాలని” దినేష్ శర్మ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో సంచలనం
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు దినేష్ శర్మ మాట్లాడిన మాటలు మీడియాలో, సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. దీనిపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. దినేష్ శర్మ ఒకే కోణంలో మాట్లాడుతున్నారని.. రెండు మూడు ఘటనలను ఉదాహరణగా చూపించి.. చట్టాలనే మార్చాలని అంటున్నారని.. ఇది ఎలా సహేతుకం అవుతుందని వారు అంటున్నారు. ” నేటికీ సమాజంలో బాధిత పక్షంగా స్త్రీ మాత్రమే ఉంటున్నది. పనిచేస్తున్న ప్రదేశంలో.. ఆమె ఎదుగుతున్న స్థలంలో.. కట్టుకున్న భర్త వద్ద.. ఇలా ప్రతిచోట ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటితో పోల్చుకుంటే ఇవి ఏమంత పెద్దవి కావు కదా. ఒకవేళ అతుల్ ఘటనలో దోషిగా ఆమె భార్యను తేల్చాల్సిన పని కోర్టులు చేయాలి. అంతే తప్ప ఒక రాజ్యసభ సభ్యుడు ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకోకూడదు. చట్టాలు తమ పని తాము చేసుకుపోతాయి. ఘటనల్లో తీవ్రత ఆధారంగానే కోర్టులు కేసులు నమోదు చేస్తాయి. తదుపరి చర్యలు తీసుకుంటాయి. అంతేతప్ప ఏదో భావోద్వేగాన్ని రగిలించే పనిని బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులు చేయకూడదు. అలా చేస్తే సమాజం వేరే మార్గం వైపు ప్రయాణం చేస్తుంది. అందువల్లే సున్నితమైన అంశాలను రెచ్చగొట్టకూడదు. అలాంటి విషయాలను పదేపదే గెలికితే మరింత ప్రమాదం పొంచి ఉంటుందని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు..
దినేష్ శర్మ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది దినేష్ శర్మ వ్యాఖ్యలను సమర్థించగా.. మరి కొంతమంది తిరస్కరించారు. గతంలో ఆడవాళ్ళపై జరిగిన వేధింపుల ను కూడా పరిగణలోకి తీసుకోవాలని మెజారిటీ మహిళలు డిమాండ్ చేయడం ఈ సందర్భంగా విశేషం.
భార్య వేధింపులు తట్టుకోలేక ఇటీవల బెంగళూరు నగరానికి చెందిన టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఎంపీ దినేష్ శర్మ మాట్లాడారు. స్త్రీ పురుషులకు ఒకే చట్టాలు ఉండాలని డిమాండ్ చేశారు. #AtulSubhash #Rajyasabha #BJPMPDineshSharma pic.twitter.com/ZlmUiXspHa
— Anabothula Bhaskar (@AnabothulaB) February 4, 2025