Pawan Kalyan: గెలుపోటములు సహజం కానీ.. ఏపీలో మాత్రం నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో పవన్ ముందంజలో ఉన్నారు. మరుగున పడిపోయిన సమస్యలతో పాటు సమకాలిన అంశాలపై స్పందించడంలో ఆయన ముందుంటారు. ఈ విషయం చాలా సందర్భాల్లో వెల్లడయ్యింది. తాజాగా విశాఖ హార్బర్ అగ్నిప్రమాదం విషయంలో సైతం పవన్ స్పందనతో.. అటు అధికార పక్షం.. ఇటు విపక్షం స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. బాధితులైన మత్స్యకారులకు అండగా నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ముమ్మాటికీ పవన్ కళ్యాణ్ కారణం.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 40 వరకు బోట్లు కాలిపోయి. మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. హార్బర్ లో గతంలో ఎన్నడూ చూడని భారీ అగ్ని ప్రమాదం ఇది. వందలాదిమంది మత్స్యకార కుటుంబాలు వీధిన పడ్డాయి. దీనిపై స్పందించిన వైసీపీ సర్కార్ పరిహారాన్ని ప్రకటించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి వ్యక్తం చేయడానికే పరిమితమైంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టింది.
ఇటువంటి సమయంలో జనసేన అధినేత పవన్ సాహసమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాలిపోయిన బోటుకు రూ.50 వేల వంతున ఆర్థిక సాయం ప్రకటించారు. అందులో పని చేసే మత్స్యకారులకు రూ.5 వేల చొప్పున అందించనున్నట్లు చెప్పి.. వెంటనే అందించే ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రభుత్వంలో ఒక రకమైన చలనం ప్రారంభమైంది. సాధారణంగా ఇటువంటి నష్టపరిహారాల పంపిణీలో కొద్దిపాటి జాప్యం జరుగుతుంది. కానీ పవన్ చర్యలతో ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. కాలిపోయిన బోటుకు రూ.30 లక్షలు, అందులో పని చేసే మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున నగదును ప్రభుత్వం సత్వరం అందించే ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ప్రభుత్వ పరిహారం అందుతుందా? లేదా? అన్న ఆలోచన ఉండేది. కానీ పవన్ పుణ్యమా అని తమకు త్వరితగతిన పరిహారం అందిందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో వెనుకబడింది. పైగా బీసీలు పార్టీగా ముద్ర ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులు టిడిపికి అండగా నిలబడతారు. అటువంటి పార్టీ మత్స్యకారుల విషయంలో లేటుగా స్పందించడం విచారకరం. కాలిపోయిన బోటుకు రూ. లక్ష తో పాటు అందులో పని చేసే మత్స్యకారులకు రూ.10 వేలు ప్రకటిస్తూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. అయితే మత్స్యకారుల విషయంలో ఇంత ఆలస్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.పవన్ స్పందించకుంటే అటు అధికార వైసిపి, ఇటు ప్రధాన విపక్షం టిడిపి స్పందించి ఉండేవి కావని.. ఈ విషయంలో పవన్ కు మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.