Srikakulam TDP: తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటివరకు చంద్రబాబు మూడు జాబితాలను విడుదల చేశారు. 139 మంది అసెంబ్లీ, 11 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 144 అసెంబ్లీ స్థానాలు లభించాయి. మరో 17 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను పొత్తులో భాగంగా టిడిపి కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడే వైసిపి ఆశలు పెట్టుకుంది. టికెట్ల కేటాయింపులో రచ్చ జరుగుతుందని ఆశించింది. తద్వారా అది రాజకీయంగా తమకు అనుకూలంగా మారుతుందని భావించింది. అందుకు తగ్గట్టుగానే చాలాచోట్ల గొడవలు జరిగాయి. మూడో జాబితా ప్రకటన తర్వాత వివాదాలు పెరుగుతాయని వైసీపీ భావించింది. కానీ అలా జరగలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి వివాదాలు లేని 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించారు. దీంతో అక్కడ మరో నాయకత్వం లేకపోవడంతో ఎటువంటి గొడవలు జరగలేదు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే ఒకరిద్దరూ ఆశావహులు నిరసన వ్యక్తం చేశారు. అయితే వారిని కూల్ చేయడంతో మెత్తబడ్డారు. నిన్న 11 మంది అసెంబ్లీ అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించారు. అయితే ఇందులో ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే గొడవలు ఎక్కువగా బయటకు వచ్చాయి. శ్రీకాకుళంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి టికెట్లు ఇవ్వకపోవడంతో.. వారి అనుచరులు రచ్చ చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో తప్పించి ఎక్కడ ఎటువంటి నిరసనలు జరగలేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజా పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చినా.. చంద్రబాబు బుజ్జగించడంతో మెత్తబడ్డారు.
పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు టిడిపి కోల్పోవాల్సి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని వైసిపి అంచనా వేసింది. కానీ ముందుగానే నేతలను అలర్ట్ చేసి చంద్రబాబు టిక్కెట్లు ప్రకటించారు. ఆశావాహులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో నేతలను పిలిపించి మాట్లాడారు. అందుకే అవకాశం దక్కని వారు పెద్దగా బయటకు మాట్లాడడం లేదు. నిరసనలు ఆందోళనలకు తావివ్వలేదు. ఈ విషయంలో చంద్రబాబు కొంత వరకు సక్సెస్ అయ్యారు. నిన్న మూడో జాబితా ప్రకటన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా.. మిగతా జిల్లాల్లో ఎటువంటి వివాదాలు జరగకపోవడంతో తెలుగుదేశం పార్టీ ఊపిరి పీల్చుకుంది.