Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు

ఏపీలో ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు

ఉత్పత్తుల ధరలు ఏప్రిల్ 14వ తేదీ వరకు స్థిరంగా ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వల్ల ప్రజలకు ప్రాణనష్టం కలగకూడదని ఒకవైపు, నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటూ మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. కరోనా ప్రభావం వల్ల ఆక్వా రంగంతో పాటు పౌల్ట్రీ రంగం కొంత ఇబ్బందులకు గురి అవుతున్న మాట వాస్తవమన్నారు. అంతేతప్ప కరోన వైరస్ వలన ఆక్వారంగ పరిశ్రమలు మూతపడతాయని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యవసాయ,అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆక్వా సాగుకు ఏప్రిల్, మే, జూన్ నెలలు చాలా కీలకమైన నేపథ్యంలో ఆక్వా రంగం దెబ్బతినకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. అందులో భాగంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి దారులతో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తానూ చర్చలు జరిపామన్నారు. ఆక్వా ఎగుమతిదారులు, సంబంధిత శాఖాధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోందని, మన రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులకు నాణ్యత విషయంలో మంచి పేరుందని మంత్రి తెలిపారు. 90 శాతం ఉత్పత్తులు అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్రం ఉలో ఆక్వా అత్యంత ప్రధానమైన, ఆదాయం అర్జించే రంగమని చెబుతూ ఆక్వా రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామన్నారు. దేశంలో 47 శాతం ఆదాయం, రాష్రం యలో ప్రధానంగా అత్యధిక ఆదాయం ఆక్వా రంగం నుండి వస్తుండటంతో రొయ్యల రైతులు నష్టపోకుండా ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 30 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు రొయ్యల ధర నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ధరల పట్టికను మంత్రి చదివి వినిపించారు. 30 కౌంట్ కేజీ ధర రూ.430 కాగా, 40 కౌంట్ ధర రూ.310, 50 కౌంట్ ధర రూ.260, 60 కౌంట్ ధర రూ.240, 70 కౌంట్ ధర రూ.220, 80 కౌంట్ ధర రూ.200, 90 కౌంట్ ధర రూ.190, 100 కౌంట్ ధర 180 రూపాయలుగా నిర్ణయించామన్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇలా ముందే స్థిరమైన ధరలు నిర్ణయించడం దేశంలోనే మొదటిసారి అని మంత్రి తెలిపారు. ఆక్వా రైతుల కోసం ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఆక్వా ఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగుమతులు ఆగడానికి వీలులేదన్నారు. 5,6 రోజులుగా ఇదే విషయమై జిల్లా యంత్రాంగం, ఆక్వా రైతు సంఘాలు, ఎగుమతిదారులతో చర్చలు జరిపుతున్నామన్నారు. కరోనాతో సంబంధం లేకుండా రైతు పండించిన పంటను ఏ ప్రాంతంలో అయినా కొనుగోలు చేయడానికి ఎగుమతిదారులు ముందుకు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇది స్వాగతించాల్సిన అంశమని కొనియాడారు. ఆక్వా రైతులకు అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆసరా చేసుకొని కరోనా వైరస్ పేరుతో దళారుల మాటలను నమ్మి ఆక్వారంగం రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు అమ్మేందుకు వీలు లేదని ఆక్వా రైతులకు సూచించారు. హడావిడిగా సాగుచేసిన ఉత్పత్తులను అమ్ముకోవద్దని రైతులను అభ్యర్థించారు. రైతులకు నష్టం కలిగించే దళారులు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎంపెడా కు అధికారాలు ఇస్తున్నామని తెలిపారు. ఆక్వాకు సంబంధించిన ఉత్పత్తులు సీడ్ వేయడం, ఫీడ్ ను అందించడం, ప్రాసెసింగ్ నిర్వహణ, రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు. ఈ విషయంలో పోలీస్, రెవెన్యూ, వాలంటీర్లు సహకరించాలన్నారు. ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular