Mohan Babu Family Away From YSRCP: విలక్షణ నటుడు మోహన్ బాబు. నిజ జీవితంలో కూడా ఆయన వ్యవహార శైలి విలక్షణమే. తనకు తాను క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా అభివర్ణించుకుంటారు. తాను ఏది చేసినా కరెక్టే అని చెప్పుకుంటారు. అటు సినిమా రంగంలోనైనా, ఇటు రాజకీయరంగంలోనైనా హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాజకీయంగా చర్చనీయాంశమయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. కానీ పార్టీలో యాక్టివ్ గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తన విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులపై నడి రోడ్డుపై నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరుగా కుమారుడు విష్ణును తీసుకెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. చంద్రబాబు అంటేనే మండిపడిపోయేవారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేవారు.

గత ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం..
గత ఎన్నికల ముందు మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎన్నికల్లో పోటీచేస్తారని ప్రచారం నడిచింది. ఆయన స్వగ్రామం తిరుపతిలో జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉండడంతో అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగుతారని టాక్ అయితే నడిచింది. కానీ మోహన్ బాబు పోటీ చేయలేదు. ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని అభ్యర్థించారు. చివరకు చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసిన మంగళగిరిలో సైతం ప్రచారం చేశారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తనకు వైసీపీలోతిరుగలేదని మోహన్ బాబు భావించారు. అటు బంధుత్వాన్ని గుర్తుచేసుకుంటూ పలుమార్లు సీఎం జగన్ నుకలిసినా ఆయనకు పార్టీలో ప్రాధాన్యత దక్కలేదు. అయితే టీటీడీ చైర్మన్ లేకుంటే రాజ్యసభ అయినా ఇస్తారని భావించిన మోహన్ బాబుకు మొండి చేయి కనిపించింది. కనీసం థర్టీ ఈయర్ష్ ఇండస్ట్రీ పృధ్వీకి దక్కిన గౌరవం కూడా మోహన్ బాబుకు లేకుండా పోయింది. అప్పటి నుంచి ఆయన యూ టర్న్ తీసుకున్నారు. వైసీపీలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
బాలకృష్ణపై పొగడ్తలు..
మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో కుమారుడు విష్ణును అధ్యక్ష బరిలో దింపారు. ఆ సమయంలో గతంలో తాను చేసినవి మరిచిపోయి సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణను కలిశారు. మద్దతు కోరారు. అయితే ఆయన ఏం చెప్పారో కానీ బయటకు వచ్చిన మోహన్ బాబు మాత్రం బాలకృష్ణ పెద్ద మనసుతో తన కుమారుడ్ని ఆశీర్వదించారని.. నాడు అల్లుడు లోకేష్ కు వ్యతిరేకంగా తాను ప్రచారం చేసిన విషయాన్ని మరిచిపోయి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిలా వ్యవహరించారని బాలకృష్ణపై పొగడ్తల వర్షం కురిపించారు. అప్పట్లోనే మోహన్ బాబు వ్యవహారంలో తేడా రావడం చర్చనీయాంశమైంది. టీడీపీకి దగ్గరవుతున్నారన్న టాక్ నడిచింది. అటు తరువాత సినిమా టిక్కెట్ల వ్యవహారంలో తన కంటే చిరంజీవిని పిలిచి జగన్ మాట్లాడడం హర్ట్ అయ్యారని తెలుస్తోంది. అప్పటి నుంచే ఆయన వైసీపీకి దూరమయ్యారన్న ప్రచారమైతే ఉంది.

తాజాగా బాబుతో చర్చలు..
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మోహన్ బాబు గంటకుపైగా చర్చలు జరిపారు. వ్యక్తిగతంగా కలిశానని చెప్పుకున్నా ఎప్పుడూ బీజీగా ఉండే చంద్రబాబు గంట సేపు కేటాయించారంటే రాజకీయ అంశాలే అయి ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. తాజాగా మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిఖా రెడ్డిని వివాహం చేసుకుంటాడని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం భూమా కుటుంబం టీడీపీలో యాక్టివ్ రోల్ లో ఉంది. వినాయకుడి దర్శనానికి మౌనికారెడ్డితో వచ్చిన సందర్భంలో మనోజ్ విలేఖర్లతో మాట్లాడుతూ త్వరలో వివాహం, రాజకీయ అరంగేట్రానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అటు భూమా కుటుంబం టీడీపీలో ఉండడం.. మోహన్ బాబు టీడీపీకి దగ్గరవుతుండడంతో త్వరలోమంచు కుటుంబం నుంచి రాజకీయ బాంబు పేలే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.