Mohan Babu- Chandrababu: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు. తీవ్ర విమర్శలు చేసుకున్న వారు మంచి దోస్తులు కావచ్చు. స్నేహితులుగా ఉన్న వారు విరోధులు కావచ్చు. ఇది రాజకీయాల్లో మామూలే. రాజకీయాలు ఎప్పుడు ఎటు వైపు తిరుగుతాయో తెలియదు. ఎప్పుడు ఎవరికి మద్దతు పలుకుతారో కూడా అంతుచిక్కదు. గత ఎన్నికల్లో టీడీపీపై మండిపడిన సినీనటుడు మోహన్ బాబు ప్రస్తుతం బాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన విద్యాసంస్థలో చదువుకున్న వారికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేదనే అక్కసుతో మోహన్ బాబు అప్పట్లో పెద్ద రచ్చ చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆయన నివాసానికి తన కూతురు లక్ష్మితో కలిసి వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది.
ఉన్నట్లుండి చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడం ఊహలకు తెర లేపుతోంది. రాజకీయాల్లో ఇదో పెద్ద సంచలనంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో ఇద్దరు కలిసి ఏం చేస్తారనే దాని మీద చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తిరుపతిలో మోహన్ బాబు టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. వైసీపీ పార్టీ నేతగా కొనసాగారు. ఇప్పుడేమో చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు కలిసి వచ్చే ఎన్నికల్లో ఏం ప్రణాళికలు రచిస్తున్నారోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: TJ Gnanavel Dosa king : మరో జైభీమ్.. సినిమాగా ‘జీవజ్యోతి’ కేసు.. ఈ 18 ఏళ్ల పోరాటం కథేంటి?
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సైలెంట్ గా ఉన్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబుతో కలవడంలో ఆంతర్యమేమిటనే ఆందోళన అందరిలో పట్టుకుంది. అయితే తమ కలయిక మర్యాదపూర్వకంగానే జరిగినట్లు చెబుతున్నారు. తిరుపతి పరిసరాల్లో సాయిబాబా దేవాలయం నిర్మించారు. దాని ప్రారంభానికి ఆయనను ఆహ్వానించేందుకు కూతురు, తాను వచ్చినట్లు మోహన్ బాబు చెబుతున్నా అసలు ఉద్దేశం అది కాదనే వాదనలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఏపీలో రాజకీయాలు మారే సూచనలు కనిపిస్తున్నట్లు సమాచారం.
గతంలోనే ప్రత్యక్ష రాజకీయాల పట్ల ఆసక్తి లేదని తాను రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. మరోవైపు తాను బీజేపీ మనిషినని మరోసారి చెప్పారు. ఇలా పొంతనలేని మాటలు చెప్పడంతోనే చంద్రబాబు, మోహన్ బాబు ఇద్దరు కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ఏదో ప్లాన్ చేస్తున్నారనే విషయం అందరిలో వస్తోంది. కానీ దీన్ని మోహన్ బాబు కొట్టిపారేస్తున్నారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ రంగు లేదని చెబుతున్నారు. దేవాలయ ప్రారంభానికి మాత్రమే ఆయనను ఆహ్వానించినట్లు చెప్పడం తెలిసిందే.
Also Read:AP Govt On Debts: ఏపీ అప్పుల కుప్పపై షాకింగ్ లెక్కలు బయటపెట్టిన కేంద్రం