
Mohammed Khadeer Case: మీకు గుర్తుందా?! జూబ్లీహిల్స్ పబ్ లో మైనర్ పై అత్యాచారం చేసిన యువకులకు ఈ రాష్ట్రంలో ఎలాంటి రాజ మర్యాదలు దక్కాయో? వాళ్లు ఎంఐఎం లీడర్ల కొడుకులు కావడంతో జైళ్ళకు కూడా బిర్యానీ పార్సీళ్ళు వెళ్ళాయి. అంతేకాదు వారు ఉండేందుకు మంచి గది, చదువుకునేందుకు వార్తాపత్రికలు, చూసేందుకు టీవీ… ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఉన్నది జైల్లో కేవలం ఫార్మాల్టికి మాత్రమే. వారికి దక్కిన మర్యాదలు, సమకూర్చిన సౌకర్యాలు మామూలుగా లేవు. దీనిపై అప్పట్లో ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పటికీ పోలీస్ శాఖ పెద్దగా పట్టించుకోలేదు. అది బంగారు తెలంగాణలో భాగస్వామి అయినప్పటి నుంచి దానికి ప్రజల గురించి కానీ, ప్రజల సమస్యల గురించి గానీ పట్టింపు లేదు.. ఎంతసేపు అధికార పక్షానికి బాకా ఊదడం, బాజా ఊదడం పరిపాటిగా మార్చుకుంది.
మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు
చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి ఖదీర్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తమ వికృత రూపాన్ని చూపారు.. గొర్రెల మందపై పులుల మూక విరుచుకుపడినట్టు.. లాఠీకర్రలతో పోలీసులు ఖదీర్ ను విచక్షణ రహితంగా కొట్టారు. అంతేకాదు చైన్ దొంగతనం చేసినట్టు ఒప్పుకోమని ఒత్తిడి చేశారని ఖదీర్ భార్య సిద్దేశ్వరి ఆరోపిస్తోంది.. పోలీస్ దెబ్బలకు సొమ్మసిల్లి పడిపోయిన ఖదీర్ కు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. వెన్ను భాగంలో కొట్టడం వల్ల రెండు కిడ్నీలు పాడైపోయాయని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది..

సామాన్యులు మనుషులు కారా
ప్రజలు చెల్లించిన పన్నులతో వేతనాలు తీసుకునే పోలీసులు.. ఆ ప్రజల భద్రతను గాలికి వదిలేసి అధికార పార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారు. ఖదీర్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. మెదక్ లో హై ప్రొఫైల్ వ్యక్తి చైన్ స్నాచింగ్ కావడంతో… ఆయన ద్వారా పోస్టింగ్ తెచ్చుకున్న ఓ సి ఐ, ఎస్సై దీనిని సవాల్ గా తీసుకున్నారు. పైగా మెదక్ పట్టణానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో వారు మరింత రెచ్చిపోయారు.. అసలు దొంగతనం ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? చైన్ పోగొట్టుకున్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాలను గాలికి వదిలేసి.. ఎవరో చెప్పిన సమాచారం ఆధారంగా ఒక అమాయకున్ని పట్టుకున్నారు. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా.. అతడిని చితకబాదారు. మొత్తానికి అతడి మరణానికి కారణమయ్యారు.. ఇప్పుడు భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న సిద్దేశ్వరి కి అండగా ఎవరు ఉంటారు? ఆమెకు భర్త లేని లోటు ఎవరు తీర్చుతారు? కొడుకుని పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల గోస ఎవరు భర్తీ చేస్తారు? ప్రతిపక్షం ప్రశ్నించింది కాబట్టి, మీడియా వార్తలు రాసింది కాబట్టి పోలీస్ శాఖ స్పందించింది.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి డ్యామేజ్ జరగకుండా ప్రయత్నించింది.. ఇంతటి వాచ్ డాగ్ పాత్ర పోషిస్తున్న పోలీస్ శాఖ.. సామాన్యుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చూపుతుంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సామాన్యులను కొట్టి చంపడమేనా?! ఇందుకోసమేనా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది?!