
Medak Lockup Death Case: జరిగింది చైన్ స్నాచింగ్.. అది ఓ హై ప్రొఫైల్ వ్యక్తికి సంబంధించింది.. సాధారణంగానే పోలీసుల పైన ఒత్తిడి పెరిగిపోయింది.. వాళ్లు ఎంత శోధన చేసినప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతుండడంతో పోలీసులు అనేక రకాలుగా కూపిలు లాగడం మొదలుపెట్టారు. ఎవరో సమాచారం ఇస్తే ఓ యువకుడిని పట్టుకున్నారు.. అతడు దొంగతనం చేసినట్టుగానీ, దొంగిలించిన సొత్తును అమ్మినట్టుగానీ ఆధారాలు లేవు. జస్ట్ ఎవరో సమాచారం చెప్తే అదుపులోకి తీసుకున్నారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏంటి?
అంతే అతడిని ఓ ప్రైవేటు రూమ్ కు తరలించారు. తమ లాఠీలకు పని చెప్పారు. చిత్రహింసలు పెట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అతడు అచేతనంగా పడి ఉన్నప్పటికీ వీసమత్తు కనికరం కూడా చూపలేదు. పైగా దీనిని కప్పిపుచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు.. ఇదీ మెదక్ జిల్లా పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిని కన్నుమూసిన ఖదీర్ పరిస్థితి.. ప్రేమించి, తీసుకొని అన్యోన్యంగా జీవిస్తున్న తన భర్తను చిత్ర హింసలు పెడితేనే కన్నుమూశాడని అతని భార్య సిద్దేశ్వరి ఆరోపిస్తోంది. పేరుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్న పోలీసులు.. అసలు ఎటువంటి నేరం చేయని ఒక వ్యక్తిని కిడ్నీలు పాడైపోయేలా కొట్టడం దేనికి సంకేతం అని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
హై ప్రొఫైల్ వ్యక్తిది కాబట్టి ఇంత ఆర్భాటమా?
వాస్తవానికి చైన్ స్నాచింగ్ అయింది ప్రొఫైల్ వ్యక్తి ది. దీన్ని ఎవరు చోరీ చేశారు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు ఎటువంటి ఆధారాలు లభించలేదు.. అలాంటప్పుడు ఇతర కోణాల్లో కూడా కేసు దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అని ఎవరో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒక అమాయకున్ని పట్టుకొని, అతడిని చితక బాదడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఖదీర్ దొంగతనం చేశాడు అని పక్కా ఆధారాలు ఉంటే పోలీసులు అతడిని జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారించాలి.. కానీ అలా చేయకుండా అతడిని చితకబాదారు.. పోలీస్ స్టేషన్లో కాకుండా ఓ ప్రైవేట్ గదిలో ఉంచి విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఏమాత్రం కనికరం చూపలేదు. పోలీసులు చెబుతున్నట్టుగానే అతడు చేయని స్నాచింగ్ కు పాల్పడ్డాడు అనుకుంటే… వాస్తవానికి సంఘటన జరిగిన రోజు అతడు అక్కడ లేడు. ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళాడు. ఇవన్నీ నిజాలను దాచి పోలీసులు ఎవరో చెప్పిన సమాచారాన్ని నిజం అని ఎలా అనుకుంటారు? కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది అని పోలీసులు చెబుతున్నారు.. ప్రభుత్వం గొప్పలు పోతోంది. కానీ ఒక చైన్ స్నాచింగ్ కేసులు కూడా సాల్వ్ చేయలేకపోతోంది.. తన చేతకానితనాన్ని ఒప్పుకోక… ఒక అమాయకుడిని చావబాదింది.

ఇదెక్కడి గుణాత్మక మార్పు?
చేసిందంతా చేసి ఇప్పుడు తాపీగా అతని ఆసుపత్రి బిల్లు కట్టి, శవాన్ని మూడు అంబులెన్సులు మార్చి, ఆస్పత్రి బిల్లులను పూర్తిగా తగలబెట్టి శుద్ధ పూసలాగా పోలీసు డిపార్ట్మెంట్ నిలబడింది. అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ కు గురైన మరియమ్మ ఉదంతం లాగానే ఖదీర్ నేపథ్యం ఉండటం విస్మయం కలిగిస్తోంది. పైగా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను మొదటి దాకా అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాపాడే ప్రయత్నం చేశారు.. కానీ మీడియాలో వార్తలు రావడంతో నష్ట నివారణ చర్యలకు దిగారు. అంటే ఒకవేళ మీడియాలో రాకపోతే ఈ కేసును మసి పూసి మారేడు కాయ చేసేవాళ్ళు. ఆ బాధితురాలిని కూడా నోరు విప్పకుండా బెదిరించేవారు.. అటు ప్రతిపక్షాలకు గొంతు ఎత్తే అవకాశం లేక, ఇటు సామాన్యులకు బతికే అవకాశం లేక.. ఇదెక్కడి బంగారు తెలంగాణ? ఇదెక్కడి గుణాత్మక మార్పు?!