Modi game-changing plan: ప్రపంచ రాజకీయాల్లో మయన్మార్ చిన్న దేశం కావొచ్చు, కానీ అక్కడ జరుగుతున్న మార్పులు ఆసియాలో శక్తిసామ్యాన్ని నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి. చైనా, అమెరికా మధ్య జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో భారత్ కీలక స్థానాన్ని పొందింది. దీనిని ఉపయోగించుకుని మోదీ గేమ్ చేంజింగ్ ప్లాన్ రూపొందించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దారికి వచ్చాడు.భారత్‌పై వైఖరి, ధోరణి మార్చుకుంటున్నాడు. కొద్ది నెలల క్రితమే ట్రంప్ భారత ఆర్థిక పరిస్థితి, ప్రజాస్వామ్య విధానం గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ఆయన మాటల్లో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ప్రధాని మోదీని ప్రగతిశీల నాయకుడు, ప్రాంతీయ స్థిరత్వానికి ప్రధాన బలం అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ మార్పు వెనుక రాజకీయ కంటే పెద్ద వ్యూహాత్మక అవసరం ఉంది.
రేర్ ఎర్త్ మినరల్స్ కోసం..
ప్రపంచ వ్యాప్తంగా రేర్ ఎర్త్ మినరల్స్ కోసం అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. మయన్మార్ ఉత్తరప్రాంతంలోని పగ్వార్ కొండలలో ప్రపంచానికి విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. ఇవి ఆధునిక ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ టెక్నాలజీ, డిఫెన్స్ పరిశ్రమలో కీలకం. చైనా ఇప్పటికే ఈ మినరల్స్‌పై ఆధిపత్యం సాధించిన నేపథ్యంలో, మయన్మార్ నిల్వలు దక్కితే ఆ ప్రభావం మరింత పెరుగుతుంది. అందుకే అమెరికా ఈ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి భారత్, జపాన్‌తో కలిసి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. జపాన్ వద్ద ఉన్న శుద్ధి టెక్నాలజీ, భారత్ భౌగోళిక, రాజకీయ సరళత కలిస్తే చైనా ఆధిపత్యానికి ఎదురుదెబ్బ ఇవ్వొచ్చని ట్రంప్ తాతకు అర్థమైంది.
భారత్ లేకుండా ఏమీ చేయలేని పరిస్థితి..
మయన్మార్ సైనిక పాలనతో భారత్ కొనసాగిస్తున్న సమతుల్య సంబంధం ఇప్పుడు అమెరికాకు కీలకంగా మారింది. బర్మీస్ ఆర్మీకి భారత్ సాంకేతిక, లాజిస్టిక్ సహకారం అందిస్తోంది. అదే సమయంలో చైనా మద్దతుతో ఉన్న బర్మా సైనికులపై అమెరికా అంతర్గత ఒత్తిడి పెంచుతోంది. ఈ సున్నిత పరిస్థితుల్లో భారత్ సహకారం లేకుండా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి.
మన సరిహద్దు వ్యూహాత్మక ప్రాధాన్యం..
అసోం, అరుణాచల్, మిజోరాం ప్రాంతాలు మయన్మార్ సరిహద్దులతో ముడిపడి ఉన్నాయి. ఈ మార్గాల ద్వారానే మినరల్స్ రవాణా, పరిశ్రమల విస్తరణ సాధ్యం. ఈ కారణంగా భారత్ ఆగ్నేయ దిశలో పటిష్ఠ మౌలిక సదుపాయాలు నిర్మిస్తోంది. అమెరికా వ్యూహంలో ఈ రవాణా మార్గాలు ప్రధానం. మరోవైపు చైనా మయన్మార్ మీద పట్టును బలపరుచుకోగా, అమెరికా తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత్‌ను సహజ భాగస్వామిగా ఎంచుకుంది. అందుకే ట్రంప్ స్వరం మారింది. రాజకీయ విమర్శల కన్నా, సామరస్యపూర్వక దౌత్యమే ఇప్పుడు ఆయన మంత్రం.
రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్‌లో భారత్ స్వావలంబన బాటలో అడుగు వేస్తోంది. అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఉన్న నిల్వలను వెలికితీయడానికి ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. దీని ద్వారా దేశం ఆర్థిక లాభం పొందటమే కాకుండా ఆసియాలో వ్యూహాత్మక నాయకత్వాన్ని మరింత బలపరచే అవకాశం ఉంది.