దేశంలో గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 3 లక్షల కేసులు.. 2వేల మరణాలు సంభవించాయి. ఇదో కరోనా విస్ఫోటనం. ఇంతటి ఉపద్రవం వేళ ప్రచార సభలో పార్టీలు బెంగాల్ లో చేస్తున్న యాగీ అంతా ఇంతకాదు.. ఈ క్రమంలోనే సుప్రీం తీర్పుతో ఇప్పుడు మోడీ సహా నేతలంతా గప్ చుప్ గా మారిపోయారు.
ప్రధాని నరేంద్రమోడీ వెనకడుగు వేశాడు. రేపు బెంగాల్ ప్రచారానికి సర్వం సిద్ధమైన వేళ అక్కడికి వెళ్లకుండా ఢిల్లీకే పరిమితమయ్యారు.కరోనా కల్లోలం వేళ సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేసింది. మీరు చర్యలు తీసుకుంటారా? మేం తీసుకోవాలా? అని ప్రశ్నించింది.
పైగా ఇంతటి కరోనా సెకండ్ వేవ్ కూడా ప్రజలు గుంపులుగా సమూహం అయ్యే సభల నిర్వహణకు పార్టీలు మొగ్గు చూపడాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. ప్రచార సభల వల్ల కరోనా వేగంగా ప్రబలుతోందని ఆరోపించింది. ఒక విడతలో ముగిసే ఎన్నికలను బెంగాల్ లో 8 విడతలుగా నిర్వహించి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న బీజేపీకి తాజాగా సుప్రీంకోర్టు నోటీసులు శరాఘాతంగా మారాయి.
అందుకే రేపటి బెంగాల్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని మోడీ దేశంలో కరోనా పరస్థితులపై ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
సుప్రీంకోర్టు ‘దేశంలో ఎమర్జెన్సీ ’ తరహాలో పరిస్థితులు ఉన్నాయని ఆక్షేపించడంతో మోడీ అలెర్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారాన్ని పక్కనపెట్టి రేపు ఉదయం 9 గంటలకు మోడీ అధ్యక్షతన అంతర్గత సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కరోనా అత్యధిక ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో భేటి కానున్నారు. 12.30 గంటలకు ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో ప్రధాని సమావేశం ఖరారు అయ్యింది.