Diesel Vehicles Banned: దేశంలో త్వరలో ఫోర్ వీలర్ డీజిల్ వాహనాలు నిలిచిపోనున్నాయి. వచ్చే ఐదేళ్లలో వీటిని పూర్తిగా నిషేధించాలని కేంద్రానికి ఓ కమిటీ కీలక నివేదిక ఇచ్చింది. ఈమేరకు ఆదేశాలు ఇవ్వాలని సూచించింది.
కాలుష్యమే కారణం..
దేశంలో కర్బన ఉద్గారాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇందుకు వాహనాల నుంచి వచ్చే పొగ ప్రధాన కారణంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డీజీల్ వాహనాలను క్రమంగా తగ్గించాలని, ఐదేళ్ల తర్వాత పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ కమిటీ కీలక సూచన చేసింది. 10 లక్షలకు పైబడి జనాభా కలిగిన నగరాల్లో 2027 నాటికి డీజిల్ వాహనాలు తిరగకుండా చేయాలని పేర్కొంది. వాటి స్థానంలో విద్యుత్, గ్యాస్ ఆధారిత వాహనాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
2035 నాటికి అన్నీ బ్యాన్..
అలాగే 2035 నాటికి సంప్రదాయ ఇంజిన్లతో నడిచే మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాలను సైతం దశలవారీగా తప్పించాలని సూచించింది. ఈ మేరకు చమురు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ ఓ నివేదికను సమర్పించింది. ఫిబ్రవరిలోనే ఈ నివేదిక ప్రభుత్వానికి చేరినప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలి..
పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో నడిచే టూవీలర్/ త్రీ వీలర్ వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ఈలోగా చమురులో ఇథనాల్‌ను కలిపే వాటాను పెంచాలని పేర్కొంది. ఫోర్ వీలర్ల విషయానికొస్తే.. ప్యాసింజర్ కార్లు సహా, ట్యాక్సీల్లో సగం వాహనాలను ఇథనాల్ కలిపిన పెట్రోల్‌తో నడిపే విధంగానూ.. మిగిలిన 50 శాతం విద్యుత్ వాహనాలుగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పింది. డీజిల్‌తో నడిచే వాహనాలను వీలైనంత త్వరగా తప్పించాలని తన నివేదికలో స్పష్టం చేసింది. ఈవీలకు మారే వరకు సీఎన్‌జీ ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగించాలని సూచించింది. ఫేమ్ సబ్సిడీ పొడిగింపునూ పరిశీలించాలని కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
కర్బన ఉద్గారాల్లో నాలుగో స్థానం..
కర్బన ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే దేశాల్లో ప్రస్తుతం చైనా, అమెరికా, ఈయూ తొలి మూడు స్థానాల్లో ఉండగా.. భారత్ నాలుగో స్థానంలో ఉంది. కర్బన ఉద్గార రహితంగా మారే క్రమంలో 2030 నాటికి దేశంలో వినియోగించే మొత్తం ఇందనంలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ఉండేలా లక్ష్యంగా పెట్టుకుంది. 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది.