Narendra Modi: 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడం భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మలుపుగా మారింది. దశాబ్దాలుగా ఢిల్లీలో ఏర్పడిన ఒక ప్రత్యేకమైన ఎకోసిస్టమ్‌ను ఈ మార్పు నేరుగా సవాల్ చేసింది. ఈ ఎకోసిస్టమ్ నిర్ణయాల నుంచి అమలు వరకు ప్రభావం చూపే విధంగా రూపొందింది.
లూటియన్స్ మీడియా..
లూటియన్స్ ఏరియా ఢిల్లీలోని పరిపాలనా కేంద్రంగా ఉంది. ఇక్కడి ఎలైట్ వర్గం – మీడియా, రాజకీయ సలహాదారులు, పరిశోధనా సంస్థలు – ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమ ప్రభావాన్ని కొనసాగించేది. వారు సలహా మండళ్లు, కమిటీలు, కన్సల్టెన్సీల ద్వారా సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు. మీడియా, టీవీ చర్చలు, పరిశోధనా పత్రాల ద్వారా పాలకవర్గాలను ప్రభావితం చేసేవారు. ఈ వ్యవస్థను ‘‘లెఫ్ట్ లిబరల్ ఎకోసిస్టమ్’’ అని వర్ణిస్తారు. ఇది దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఢిల్లీలో ఆధిపత్యం చెలాయించింది.
కాన్ మార్కెట్ గ్యాంగ్ నుంచి లూటియన్స్ గ్యాంగ్ వరకు..
2014 తర్వాత ఈ వ్యవస్థను ఆయన నేరుగా ఐడియాలజికల్‌గా సవాలు చేశారు. కాఫీ హౌస్‌లలో కూర్చుని సాధారణ చర్చలను రాజకీయ సిద్ధాంతంగా మలచి ప్రభుత్వాలు, పార్టీలు, ప్రజలను మభ్యపెట్టే వారిని ‘‘కాన్ మార్కెట్ గ్యాంగ్’’ అని పేర్కొన్నారు. తర్వాత జాతీయవాద శక్తులు దీనిని ‘‘లూటియన్స్ గ్యాంగ్’’ అని పిలవడం మొదలుపెట్టాయి. ఈ వర్గం తమ ప్రభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. ప్రధాని నివాసం, కార్యాలయం సమీపంలోని జింఖానా క్లబ్ భూమిని భద్రతా కారణాలతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై కోర్టుల్లో స్టేలు, సవాళ్లు విఫలమయ్యాయి. ఇది లూటియన్స్ వర్గానికి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
ప్రముఖ పరిశోధనా సంస్థలు..
లెఫ్ట్ లిబరల్ ఎకోసిస్టమ్‌లో కీలకంగా ఉన్న రెండు సంస్థలు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్), సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్ ). కాంగ్రెస్, సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో సోషలిస్ట్, వామపక్ష భావాలు ఉన్నవారు వీటిని పెంచి పోషించారు. ప్రభుత్వ నిధులు, విదేశీ విరాళాలు వచ్చేవి. ఈ నిధులను ఉపయోగించి కులాలు, వర్గాలు, భాషలు, మతాల పేరిట సమాజాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరిగాయని విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో కులాల వారీగా ఓట్ల విశ్లేషణలు చేసి, వాటిని మీడియాలో ప్రచురించి ప్రజలను ప్రభావితం చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. సీపీఆర్ఎకోసిస్టమ్కు అక్షయ వటవృక్షంలాంటిది. దీనికి ఎఫషీఆర్ఏ నిధులు వచ్చేవి. నిబంధనలు పాటించని కారణంగా రెండేళ్లుగా నిధులు ఆపేశారు. దీంతో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. మూడు నాలుగేళ్లుగా యాక్టివ్‌గా లేదు. సీఎస్‌డీఎస్‌లో జోగేంద్ర యాదవ్, సంజయ్ కుమార్ వంటి విశ్లేషకులు పనిచేశారు. ప్రతి ఎన్నికల సమయంలో ప్రత్యేక నివేదికలు, కథనాలు వచ్చేవి. ఈ సంస్థకు భారత ప్రభుత్వ సంస్థ ఐసీఎస్ఎస్ఆర్ నుంచి ఏటా కోట్ల రూపాయల నిధులు వచ్చేవి. 2025, 2026 సంవత్సరాల్లో ఈ గ్రాంట్లు పూర్తిగా నిలిపివేశారు. దీంతో సంస్థ అనామకంగా మారింది. ఇటీవలి ఎన్నికల్లో ఎలాంటి నివేదికలు రాలేదు.
నిధుల నియంత్రణ..
ఈ సంస్థలు పన్ను చెల్లించేవారి డబ్బు, విదేశీ సహాయం ఉపయోగించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేని పరిశోధనలు చేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం ఈ నిధుల ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా అటువంటి సంస్థలను అదుపులోకి తీసుకుంది. నిధులు లేకుండా పోవడంతో ‘‘సోకాల్డ్ మేధావులు’’ కూడా ఇలాంటి సంస్థల నుంచి బయటకు వస్తున్నారు.
2014 తర్వాత జరిగిన ఈ మార్పులు ఢిల్లీలోని రాజకీయ, మేధో వర్గాలలో శక్తి సమతుల్యతను మార్చాయి. ఎన్నో దశాబ్దాలుగా ఏర్పడిన ఎకోసిస్టమ్‌ను నియంత్రించడం ద్వారా ప్రభుత్వం తన నిర్ణయాలను స్వతంత్రంగా అమలు చేసే వాతావరణాన్ని సృష్టించిందని ఈ విశ్లేషణ సూచిస్తుంది. ఇది జాతీయ ఆసక్తులకు అనుగుణంగా ఉన్న విధానాలకు మార్గం సుగమం చేసిందని, అయితే ఇది వివిధ వర్గాల నుంచి విమర్శలను కూడా ఆకర్షించింది. రాజకీయాల్లో ఇలాంటి మార్పులు దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి.
