Modi Shah Strategy In West Bengal 2026: పశ్చిమబెంగాల్ రాజకీయ చదరంగం పూర్తిగా విపరీతంగా మారిపోయింది. 2021లో మమతా బెనర్జీ ఎజెండా సెట్ చేసి, బీజేపీని రియాక్టివ్‌గా మార్చారు. కానీ 2026లో ఈ సమీకరణం పూర్తిగా తలకిందులైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం గత ఎన్నికల ఫలితాలను లోతుగా విశ్లేషించి, వ్యూహాత్మకంగా ఆడుతున్నారు. ఫలితంగా, మమతా బెనర్జీ డిఫెన్సివ్‌లో పడి, గెలుపుపై నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తోంది.
సర్ ఇష్యూతో వ్యూహాత్మక తప్పు..
బీజేపీ మొదటి దెబ్బ ’స్పెషల్ అసెస్మెంట్ రిజిస్టర్’ (సస్‌ఐఆర్) ద్వారా కొట్టింది. బెంగాల్‌లో 1.05 కోట్ల ఓట్లను తొలగించిన ఈ ప్రక్రియపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కోర్టుల చుట్టూ తిరగడం, స్వయంగా వాదించడంతో విలువైన సమయం వృథా చేసుకున్నారు. కానీ ఫలితం శూన్యం. తమిళనాడులో 7 శాతం ఓట్లు తొలగించినా ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ మౌనం వహించారు. ఉత్తరప్రదేశ్‌లో 1.50 కోట్ల ఓట్లు తొలగించినా అఖిలేష్ యాదవ్ లేదా రాహుల్ గాంధీ పెద్దగా స్పందించలేదు. మమతా బెనర్జీ ఈ ఇష్యూను పెద్దది చేయడం వల్ల హిందూ ఓటర్లలో ‘సర్‌కు మమతా భయపడుతున్నారు‘ అనే భావన పెరిగింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఈ ట్రాప్‌ను సిద్ధం చేసి, మమతా సమయాన్ని, శక్తిని వృథా చేయించింది. ఫలితంగా, ఆమె ప్రధాన ఎజెండా అయిన ఎన్నికల వ్యూహ రచనపై దృష్టి పెట్టలేకపోయారు.
ఈడీ దాడుల ట్రాప్..
ఇక జనవరిలో జరిగిన ఈడీ దాడులు కేవలం సోదాలు కాదు. మమత మనోధైర్యాన్ని దెబ్బతీసే వ్యూహం. గత జూన్ నుంచే నిఘా పెట్టిన ఈడీ, పూర్తి సమాచారం సేకరించి ఆకస్మికంగా దాడి చేసింది. ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో తనిఖీలు జరిపి, కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది. మమతా బెనర్జీ ఈ దాడుల్లో జోక్యం చేసుకోవడం, అధికారులతో దురుసుగా ప్రవర్తించడం వల్ల మరింత ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం నిర్ణయం మమతాకు పెద్ద దెబ్బ. ఆమె ఆరు లేదా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని, దీనివల్ల ప్రచారానికి ఎక్కువ సమయం దొరుకుతుందని ఆశించారు. కానీ ఈసీ కేవలం రెండు విడతలకేపరిమితం చేసింది. దీంతో ప్రచార సమయం తీవ్రంగా తగ్గిపోయింది. బీజేపీ మోదీ–షా జోడి ప్రభావాన్ని పూర్తిగా వినియోగించుకుంది. మమతా స్థానిక అంశాలపై దృష్టి పెట్టలేకపోయారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ కూడా ఈడీ దాడులను ఎదుర్కొన్నారు. కానీ ఆయన హడావుడి చేయకుండా, సమయాన్ని వృథా చేయకుండా ఎన్నికలపై దృష్టి పెట్టి గెలిచారు. మమతా ఈ పాఠం నేర్చుకోలేకపోయారు.
ఐప్యాక్ సహాయానికి చెక్..
2021 విజయంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ మమత గెలుపులో కీలక పాత్ర పోషించింది. కానీ 2026లో ఈ సమీకరణం మారిపోయింది. జనవరి నుంచి ఐప్యాక్ సహాయం గణనీయంగా తగ్గిపోయింది. ప్రశాంత్ కిశోర్ స్వయంగా బీహార్ రాజకీయాల్లోకి వెళ్లడంతో మమతాకు వ్యూహాత్మక మార్గదర్శకత్వం లేకుండా పోయింది. అభ్యర్థుల ఎంపికలో ఐప్యాక్ జోక్యం తగ్గడం వల్ల తప్పుడు అభ్యర్థుల ఎంపిక జరిగే ప్రమాదం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐప్యాక్ సూచన మేరకు జగన్ అభ్యర్థులను మార్చడం వల్ల ఘోర పరాజయం ఎదురైంది. ఇదే పరిస్థితి మమతాకు కూడా వచ్చే అవకాశం ఉంది. మీడియాలో ఎక్కువగా కనిపించడంపై మమతా చూపిన శ్రద్ధ, పార్టీని సిద్ధం చేయడంపై చూపలేదు. అమిత్ షా 15 రోజులు బెంగాల్‌లో ఉంటానని ప్రకటించినప్పుడు, మమతా ‘బీజేపీ అంటే బెంగాల్ ప్రజలకు గిట్టదు‘ అని మాట్లాడటం తప్ప, ఏమీ చేయలేకపోయారు.
బీజేపీ బూత్ లెవల్ వ్యూహం..
బెంగాల్‌లో అధికారం పీఠం ఎక్కాలంటే 148 సీట్లు కావాలి. బీజేపీ గత ఐదు ఎన్నికల డేటాను లోతుగా విశ్లేషించి, పంచముఖ వ్యూహంతో ముందుకు సాగుతోంది. గత ఎన్నికల్లో 144 సీట్లలో బీజేపీ రెండో స్థానంలో ఉంది. కేవలం 10 వేలకన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఇక 30 సీట్లలో మూడోస్థానంలో ఉంది. 65 స్థానాలు బీజేపీ ఎప్పటికీ గెలవలేదు. అయినా వాటిలో ఓట్ల శాతం పెంచుకునేలా బూత్ లెవల్ నుంచి వ్యూహం రూపొందించింది.
220 స్థానాలపై ఫోకస్..
బీజేపీ ఈ 65 సీట్లను వదిలేసి, మిగిలిన 220 సీట్లపై పూర్తి దృష్టి పెట్టింది. బూత్ లెవల్ వరకు పక్కా ప్లానింగ్ చేసి, ప్రతి ఓటును లెక్కగట్టుకుంటోంది. సువేందు అధికారి వంటి నేతల ద్వారా స్థానిక కదలికలను బలోపేతం చేస్తోంది. మధువా సామాజిక వర్గం బీజేపీకి మొగ్గుచూపడం గమనార్హం. మమతా మాత్రం ఈ సూక్ష్మ వ్యూహాలపై దృష్టి పెట్టలేకపోయారు. అమిత్ షా విడుదల చేసిన ’చార్జిషీట్’ మమతా 15 ఏళ్ల పాలనలోని అవినీతి, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు, రాజకీయ హింసను బయటపెట్టి, ఓటర్ల మనసుల్లో చీలిక తెచ్చింది.
2021లో మమతా బెనర్జీ బీజేపీని ట్రాప్‌లో పెట్టి గెలిచారు. కానీ 2026లో పాత్రలు మారిపోయాయి. మోదీ–షా ద్వయం గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, వ్యూహాత్మకంగా చదరంగం ఆడుతున్నారు. మమతా బెనర్జీ మాత్రం సర్, ఈడీ ట్రాప్‌లో పడిపోయింది. మీడియా ఫోకస్ వంటి అంశాల్లో చిక్కుకుని, ప్రధాన ఎజెండా అయిన ఎన్నికల వ్యూహ రచనలో విఫలమయ్యారు. బీజేపీ ’మిషన్ బెంగాల్’లో 160–170 సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతోంది. మమతా బెనర్జీ ఈ ట్రాప్ నుంచి బయటపడి, తిరిగి ఆఫెన్సివ్‌లోకి రావాలంటే తక్షణమే వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంది. లేదంటే బెంగాల్‌లో అధికార మార్పు తప్పదు.