PM Modi America Visit: మోదీకి అమెరికాలో అంత క్రేజ్ ఎందుకంటే.. తేల్చి చెప్పేసిన న్యూయార్క్ టైమ్స్

అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీ ని ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమంలో దాదాపు 8.95 కోట్ల మంది అనుసరిస్తున్నారు. దీనిపై మోదీ అమెరికా పర్యటన వేళ అక్కడి వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రధాని ప్రజాదరణలో ప్రతినెలా ప్రసారమయ్యే "మన్ కీ బాత్" రేడియో షో కీలకపాత్ర పోషిస్తోందని అభిప్రాయపడింది.

Written By: Bhaskar, Updated On : June 23, 2023 6:04 pm
Follow us on

PM Modi America Visit: మోదీ..మోదీ.. ఈ నామస్మరణతో అమెరికా మొత్తం ఊగిపోతోంది. ట్విట్టర్ నుంచి ఫేస్బుక్ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లో మోత ఎక్కిపోతోంది. గత మూడు రోజులుగా భారత ప్రధాని పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది. వాస్తవానికి భారత్ అభివృద్ధి చెందిన దేశం కాదు.మోదీ..పుతిన్ లాగానో, జో బైడెన్ లాగానో, జీ జిన్ పింగ్ లాగానో బలమైన దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేత కూడా కాదు. కానీ ఆయన అనూహ్యంగా ప్రపంచం నేత అయిపోయారు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాల అధినేతలను తలదన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ప్రకటిస్తున్న ఆయనకు ఆ శ్వేత దేశం ఘన స్వాగతం పలుకుతోంది. మోదీ కంటే వివిధ దేశాల నేతలు అమెరికాలో పర్యటించారు, ఇకముందు కూడా పర్యటిస్తారు. కానీ భారత ప్రధానికి దక్కిన గౌరవం వేరు. ఆ దేశం ఇస్తున్న మర్యాద వేరు. కీర్తిస్తున్న తీరు వేరు. ఇంతకీ ప్రధానిని అమెరికా ఎందుకు వెయ్యినోళ్ల పొగుడుతోంది? న్యూయార్క్ టైమ్స్ ఎందుకు ఆకాశానికి ఎత్తేస్తోంది?

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..

వాస్తవానికి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ దేశంలో పర్యటించేందుకు వీలులేదని అమెరికా స్పష్టం చేసింది. కనీసం ఆయనకు వీసా కూడా ఇవ్వలేదు. దీనిని అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఘనతగా ప్రచారం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ పై మత ముద్ర వేసినందుకు చంకలు గుద్దుకుంది. కానీ కాలమంతా ఒకే తీరుగా ఉండదు కదా.. మోదీ మానియా మొదలైంది. రెండుసార్లు వరుసగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ దేశమైతే వీసా ఇచ్చేందుకు నిరాకరించిందో, మతం అనే ముద్ర వేసిందో.. ఆ దేశమే నేడు సాగిలపడుతోంది. ప్రపంచానికి నాయకత్వం వహించే సత్తా మీ సొంతమని వెయ్యినోళ్ల పొగుడుతోంది. అంతేకాదు కని విని ఎరుగని రీతిలో సాదర స్వాగతం పలుకుతోంది.

ట్విట్టర్లో 8.95 కోట్ల మంది అనుసరిస్తున్నారు

అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీ ని ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమంలో దాదాపు 8.95 కోట్ల మంది అనుసరిస్తున్నారు. దీనిపై మోదీ అమెరికా పర్యటన వేళ అక్కడి వార్తా సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రధాని ప్రజాదరణలో ప్రతినెలా ప్రసారమయ్యే “మన్ కీ బాత్” రేడియో షో కీలకపాత్ర పోషిస్తోందని అభిప్రాయపడింది. “మన్ కీ బాత్” మోదీ రెండు గొప్ప బలాలను మిలితం చేస్తోంది. ఒకటి దేశంలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై లోతైన అవగాహన.. రెండవది డిజిటల్ మీడియా రంగంలో ఒక విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పడంలో ఆయనకు ఉన్న వాక్చాతుర్యం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఉచిత రేషన్ నుంచి మెరుగైన మౌలిక సదుపాయాల వరకూ విషయాన్ని అయినా సరే శ్రోతలకు ఆయన సమర్థంగా వివరించగలరు. ఏ సందేశాన్నైనా చివరి వ్యక్తి వరకూ చేర్చగలరు. భారతీయ జనతా పార్టీకి ఉన్న అపారమైన సోషల్ మీడియా నెట్వర్క్ దీనిని మరింత బలంగా ప్రజలకు చేరవేరుస్తోంది. దీనివల్ల మోదీ పై ప్రజలకు నమ్మకం ఏర్పడుతోంది. ఇది అంతిమంగా ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెడుతోంది” అని న్యూయార్క్ టైమ్స్ తన వార్త కథనంలో వివరించింది.