PM Modi vs Sonia Gandhi: ప్రజాస్వామ్యంలో పాలిటిక్స్ అనేవే ఒక అబ్సర్డ్. పదవి అనేది అంతిమం కాబట్టి.. నాయకులు ఏమైనా చేయగలరు. ఎంతకైనా తెగించగలరు. ఇందులో ఎవరూ సుద్ద పూసలు కారు. అది గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం. ఆ సమయంలో గోద్రా అల్లర్లు చెలరేగాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మోడీని ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టింది. అమిత్ షాను గుజరాత్ వెళ్ళకుండా అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం నియంత్రించగలిగారు. కొద్దిరోజులపాటు అమిత్ షా ఢిల్లీలోనే ఉన్నారు. జైలు శిక్ష కూడా అనుభవించారు. తర్వాత కాలం గిర్రున తిరిగింది. యూపీఏ ప్రభుత్వం ఓటమిపాలైంది. మోడీ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దేశ రాజకీయాలను మోదీ, షా ద్వయం శాసిస్తోంది. అంతేకాదు అప్పట్లో తమకు మేళ్లను చేసిన వాళ్లను, కీళ్లను చేసిన వాళ్లను గుర్తు పెట్టుకొని ఎవరికి ఇచ్చేది వారికి వడ్డీతో సహా ఇస్తోంది.

ఈడీ బోనులో సోనియా, రాహుల్
బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టులో ఎప్పుడయితే దాఖలు చేశారో.. అప్పటి నుంచే ఈ వ్యవహారం మీద మోదీ, షా ఒక కన్నువేశారు. అప్పట్లో అయోధ్య రామ మందిరం కేసును విచారిస్తున్న మోహన్ పరాశరన్ తో నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన పూర్వా పరాలను కనుక్కున్నారు. తర్వాత బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గోద్రా అల్లర్లకు సంబంధించిన విషయాలను తవ్వడం మొదలుపెట్టారు. భాగంగానే సెతల్వాడ్ అనే సామాజిక ఉద్యమకారిణిని, ఆమె వెనుక ఉన్న వ్యక్తులని బయటకు లాగారు. ఎప్పుడైతే కోర్టు మోదీకి క్లీన్ చీట్ ఇచ్చిందో.. అప్పుడే అమిత్ షా రంగంలోకి దిగారు. గోద్రా అల్లలకు సంబంధించి అప్పటి బిజెపి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసిన వ్యక్తులందర్నీ టార్గెట్ చేశారు. ఏకంగా ఎన్ఐఏ అధికారులను రంగంలోకి దింపి విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకొనేలా చేయించారు. ఇది సోనియాగాంధీ అండ్ కోకు మోదీ షా ఇచ్చిన ఫస్ట్ స్ట్రోక్. ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తీసుకొచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విచారణ నిమిత్తం హాజరుకావాలని సమన్లు పంపింది.
నాటి వేదనకు రివెంజ్
గోద్రా అల్లర్ల సమయంలో మోడీ పై వచ్చిన విమర్శలన్నీ తనకు గుర్తున్నాయని, ఆ సమయంలో తన కంఠంలో గరళాన్ని నింపుకున్నారని ఇటీవల అమిత్ షా వ్యాఖ్యానించిన తర్వాత ఎన్ఐఏ రంగంలోకి దిగడం విశేషం. అయితే గోద్రా అల్లర్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ మోడీ, అమిత్ షాను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు సంస్థలతో వేధించిందనే ఆరోపణలు ఉన్నాయి. పైగా ఆ సమయంలో పెట్టుబడుల నిమిత్తం అమెరికాకి మోడీ వెళ్లేందుకు కూడా యూపీఏ ప్రభుత్వం నిరాకరించింది. ఎలాగూ కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో వీసా ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. ఈ నేపథ్యంలో అప్పటి ఘటనలన్నింటిని మనసులో పెట్టుకున్న మోదీ, అమిత్ షా రివేంజ్ కు తెర తీశారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అమేథిలో రాహుల్ గాంధీని ఓడించడం ద్వారా “ప్లాన్ ఏ ” ను విజయవంతంగా పూర్తి చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో “ప్లాన్ బీ ” ని అమల్లో పెట్టారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కొనుగోలుకు సంబంధించి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగదును వినియోగించడం, అడుగడుగునా నిబంధనలకు మంగళం పాడారని బిజెపి ఆరోపిస్తోంది. మొన్నటికి మొన్న సోనియా గాంధీ విచారణకు హాజరైనప్పుడు ఈడీ అధికారులకు చెప్పిన సమాధానాలన్నింటినీ మీడియాకు లీక్ చేసింది. దీనిపైన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. పైగా సోనియాగాంధీకి విపక్ష పార్టీలు సంఘీభావం తెలపడంతో.. వారంతా ఒక్కటే, తాము మాత్రమే దేశ సంరక్షణ కోసం పనిచేస్తామని బీజేపీ బలంగా చాటి చెప్పింది.
సోనియా అభాసుపాలయింది
ఇక ఈ కేసులో సోనియాను మరింత అభాసుపాలు చేసింది చిదంబరం. అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఈడీ సోనియాకి సమన్లు ఇవ్వకూడదని వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో నవ్వు తెప్పించింది. చిదంబరం చాలా సీనియర్ అడ్వొకేట్. అన్ని రాష్ట్రాల హై కోర్టులతో పాటు సుప్రీం కోర్టు లో కూడా కేసులు వాదిస్తాడు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2012 ఢిల్లీలోని ట్రయల్ కోర్టు లో సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రైవేట్ కంప్లయింట్ ఇచ్చాడు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విషయంలో అక్రమాలు జరిగాయని, అలాగే వాటికి సంబంధించిన కావాల్సిన ఆధారాలను కోర్టులో ఇచ్చాడు. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ ని కొట్టివేయాలి అంటూ సుప్రీం కోర్టు గడప తొక్కింది. కానీ సుప్రీం కోర్ట్ ఢిల్లీ హై కోర్ట్ లో అపీల్ చేయమని చెప్పింది. ఢిల్లీ హై కోర్ట్ పిటిషన్ ని పరిశీలించిన తరువాత ట్రయల్ కోర్ట్ ని విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని భావించి సదరు కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో ఉంది. 2012 లో యూపీఏ అధికారంలో ఉంది. అందులో ఈ చిదంబరం కూడా కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. కానీ ఎఫ్ఐఆర్ లేకుండా ఈడీ ఎలా సమన్లు జారీ చేస్తుందని ప్రశ్నించి తన తెలివితేటలు ఎంతలా ఉన్నాయో ప్రపంచానికి తానే స్వయంగా చెప్పుకున్నాడు. సోనియా,రాహుల్ తో సహా తానుకూడా బెయిల్ మీద ఉన్నారనే సంగతి మరిచిపోయాడు. ఇక నాడు మోడీ షా ద్వయానికి సోనియా గాంధీ తమలపాకుతో ఒక్కటి ఇస్తే.. ఇప్పుడు వారు తలుపు. చెక్కలతో రెండు ఇస్తున్నారు. ఇవ్వడంలోనే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్.