Modi- Jagan: ఏపీ అప్పులకుప్పగా మారిపోయింది. నెల నెలా అప్పులు తెచ్చి ప్రభుత్వం గట్టెక్కుదోంది. మొదటి వారంలో ఆర్బీఐ తలుపు తట్టాల్సి వస్తోంది.సెక్యూరిటీ బాండ్లను కుదువ పెట్టి అరుణాలు పొందాల్సి వస్తోంది. భవిష్యత్ ఆదాయంపై కూడా అప్పలు తేవాల్సి వస్తోంది. తాజాగా మంగళవారం మరో రెండువేల కోట్లను ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద కుదువపెట్టి రుణం తెచ్చింది. సుమారు 19 ఏళ్ల పాటు అప్పు తీర్చాలన్న షరతుతో అప్పు తీసుకుంది. అయితే అంతా బాగానే ఉంది. కానీ మేము ఇస్తున్న సొమ్ముకు సీఎం జగన్ మీట నొక్కుతున్నారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహం చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. అంటే ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుపై కూడా కేంద్రానికి భాగస్వామ్యం ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఏపీకి ఇస్తున్నది అప్పా.. లేకుంటే ఇతర రాష్ట్రాల కంటే కేటాయింపులు ఎక్కువ అన్న ప్రశ్నలు అయితే తెరపైకి వస్తున్నాయి. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల కంటే ఓక్క రూపాయి కూడా అదనంగా కేటాయించిన సందర్భాలు లేవు. అప్పులకు మాత్రం ఇట్టే అనుమతి లభిస్తోంది.

కాగ్ తప్పుపట్టినా..
జగన్ కు అడ్డగోలుగా అప్పులకు అనుమతిస్తున్నారని కాగ్ తప్పుపడుతున్నా..వేల కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పకుండా గోల్ మాల్ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి మోదీ సర్కారు ఏపీ ప్రభుత్వంపై కఠినంగా వ్యవహరించలేదన్న వ్యాఖ్యలు సైతం ఉన్నాయి. ఇటువంటి సమయంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన కామెంట్స్ విమర్శలకు కారణమవుతున్నాయి. పోనీ జీవీఎల్ మాటలు కరెక్టే అనుకుందాం. అసలు మోదీ ఇస్తోంది.. జగన్ తీసుకుంటున్న సొమ్ము వారిది సొంత సొమ్మా అంటే అదీ కాదు. పోనీ మిగతా రాష్ట్రాల కంటే అగ్రతాంబూలం ఇచ్చి అదనపు నిధులు కేటాయించారంటే అదీ లేదు. అప్పులకు అనుమతిచ్చి.. అందులో తమకు వాటా ఉందనడం ఎంతవరకూ కరెక్టో జీవీఎల్ కే తెలియాలి.
Also Read: Revanth Reddy- KTR: టార్గెట్ కేటీఆర్.. రాహుల్ తో రేవంత్.. సిరిసిల్లలో మోహరింపు
వైసీపీ తీరు అలానే..
మరోవైపు వైసీపీ ఎంపీలు సైతం వితండవాదానికి దిగుతున్నారు. తాము కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్నాం గనుక..నిధులు వస్తున్నాయని చెబుతున్నారు. అందులో దాపరికం అంటూ ఏదీ లేదంటున్నారు. గత మూడేళ్లుగా కీలక సమయంలో బీజేపీకి అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అడిగినప్పుడల్లా నిధులు ఇస్తున్నామని అటు నుంచి బీజేపీ ఎంపీలు వాదిస్తున్నారు. అయితే పరస్పర వాదనల్లో నిజముంది. కానీ అవి నిధులు కాదు.. అప్పులు మాత్రమేనని ఇరువర్గాలు గ్రహించాల్సిన అవసరముంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అటకెక్కింది. ప్రత్యేక ప్యాకేజీ పక్కదారి పట్టింది. అవన్నీ మరచి ఇష్టారాజ్యంగా అప్పులకు మాత్రం అనుమతిచ్చి నిధులిచ్చినట్టు చెబుతోంది. అయితే ఇలా అప్పులు చేస్తోంది శాశ్వత ప్రాజెక్టుకో, ఉత్పాదక వ్యయంగా అయితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ అనుత్పాదక వ్యయంగా చూపుతుండడమే రాష్ట్ర భవిష్యత్ కు ఇబ్బందిగా మారింది.

కార్పొరేషన్ల పేరిట రుణాలు..
తొలుత జగన్ ప్రభుత్వమే నేరుగా అప్పులు చేయగా.. తరువాత నిబంధనలు అడ్డంకిగా మారడంతో వివిధ కార్పొరేషన్ల పేరిట అప్పులు దండిగా చేశారు. మద్యం పై వచ్చే భవిష్యత్ ఆదాయాన్ని చూపి సైతం రుణాలు పొందారు. కానీ ఈ రోజు మోదీ ఇస్తున్నారని బీజేపీ వారు.. జగన్ తెస్తున్నారని వైసీపీ వారు మాట్లాడుతున్నారు. కానీ ఈ అప్పులకు బాధ్యులు వారు కారు. ఒక్కో సెక్యూరిటీ బాండ్ను 15, 20 సంవత్సరాలకు కుదువపెట్టి అప్పులు తెస్తున్నారు. అప్పటికీ ప్రజామోదం ఉంటే వారే కొనసాగుతారు. లేకుంటే కొత్తవారు ఎన్నికవుతారు. అలాగని వారు ఈ అప్పులకు బాధ్యత వహిస్తారా? అంటే అదీ లేదు. ఇదిముమ్మాటికీ ప్రజలపైనే భారం పడుతోంది. కానీ ఈ కనీస బాధ్యత ఎరుగకుండా మాటల గారడీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్న వ్యవహారం ఆందోళన కలిగిస్తోంది.
త్వరలో కేంద్రం కన్నెర్ర…
రాజకీయ ప్రయోజనాలు ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేస్తోంది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఏదో రోజుకూ అప్పులు తిరగబెట్టే అవకాశముంది. అప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అప్పుడు ఏం చేసినా చెల్లుబాటు కాదు. అయితే ఈ పరిస్థితిని కేంద్రంలోని మోదీ సర్కారు ఇప్పటికే గుర్తించింది. దేశంలో 11 రాష్ట్రాలు మితిమీరిన విధంగా అప్పులు చేస్తున్నాయని.. ఇదే విధంగా కొనసాగితే ఆర్థిక దివాళా దిశగా వెళతాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళనతో ఉంది. రాష్ట్రపతి ఎన్నికల తరువాత కొరడా ఝుళిపించడానికి సిద్ధమవుతోంది. అప్పులపై ప్రత్యేకంగా చర్యలు చేపట్టడానికి సమాయత్తమవుతోంది.
Also Read:TCA Dhoom Dham: కెనడాలో ‘తెలంగాణ కెనడా అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ‘ధూంధాం-2022’