Pawan Kalyan- Modi: మోదీ రూట్ మ్యాప్ అటకెక్కనుందా ? . బీజేపీతో పవన్ బంధం తెగిపోనుందా ? లేక మూడు పార్టీలు కలిసి నడుస్తాయా ?. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కలయిక తెరలేపింది. టీడీపీ, జనసేన పొత్తు ఖరావుతుందన్న నేపథ్యంలో మోదీ రూట్ మ్యాప్ పై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, జనసేన ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్న సందర్భంలో బీజేపీ అడుగులు ఒంటరిగానా ? ఉమ్మడిగానా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాయి. కానీ టీడీపీ, బీజేపీ మాత్రమే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాయి. జనసేన ఎన్నికలకు దూరంగా జరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జనసేన కార్యకర్తల పై దాడులు పెరిగాయి. ప్రశ్నించే వారికి సంకెళ్లు పడ్డాయి. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల దాడిలో పదుల సంఖ్యలో జనసేన కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో కేంద్రంలోని బీజేపీతో కలిసి నడవాలని, వైసీపీ ఆగడాలను అడ్డుకోవాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచింది. పలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు కలిసి నిర్వహించారు. కానీ ఏపీ బీజేపీ ఊహించిన స్థాయిలో అధికార వైసీపీ మీద పోరాటం నడపలేకపోయింది. జనసేనతో కలిసి నడవలేకపోయింది. ఆ పార్టీలోని వర్గాల కారణంగా అప్పుడప్పుడు ప్రకటనలు మినహా ప్రత్యేకంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పై కార్యక్రమాలు నిర్వహించలేదు. పవన్ బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వేచి చూశారు. కానీ కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు.
పోయిన ఏడాది వైజాగ్ టూర్ లో పవన్ పై ప్రభుత్వం నిర్భందకాండను ప్రదర్శించింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, పవన్ కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను పరామర్శించారు. ప్రభుత్వ తీరును ఖండించారు. దీంతో ఏపీ బీజేపీ అప్రమత్తమైంది. పవన్ ను ప్రధాని మోదీ పిలిపించుకుని రోడ్ మ్యాప్ ఇచ్చారు. ఇందులో టీడీపీ ప్రస్తావన లేకుండా మోదీ రోడ్ మ్యాప్ ఇచ్చారన్నచర్చ అప్పట్లో జరిగింది. ఆ తర్వాత కూడ ఏపీ బీజేపీలో ఎలాంటి మార్పు లేదు. ఓ వైపు జనసేన తన పోరాట పంథాను కొనసాగిస్తున్నా.. ఏపీ బీజేపీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. దీంతో బీజేపీ రోడ్ మ్యాప్ తో ఉపయోగం లేదన్న ఆలోచన జనసేనలో కలిగింది. ఉమ్మడి పోరాట పంథా లేకుండా ప్రభుత్వంతో కొట్లాడలేమని నిర్ణయానికొచ్చింది.

ఇటీవల టీడీపీ అధినేత జిల్లాల్లో విరివిగా యాత్రలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కందుకూరు, గుంటూరుల్లో తొక్కిసలాటలు జరిగియి. పలువురు కార్యకర్తలు, సామాన్య ప్రజలు మరణించారు. ఇదే అదునుగా వైసీపీ ప్రభుత్వం రోడ్లు, కూడళ్లలో సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ బ్రిటీషు కాలం నాటి జీవో ఒకటి తెచ్చింది. కానీ జీవో ప్రతిపక్షాలకు మాత్రమే అన్నట్టు యథేచ్చగా వైసీపీ సమావేశాలు నిర్వహించుకుంటోంది. కుప్పంలో టీడీపీ అధినేత సభలకు, సమావేశాలకు అనుమతి నిరాకరించింది. దీంతో చంద్రబాబు కాలినడకన తిరిగారు. ప్రభుత్వ తీరు పై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను చీకటి జీవోగా అభివర్ణించారు. కానీ వైసీపీ మాత్రం తన పంతం వీడలేదు. ఈ జీవోకు నిరసనగా జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రతిపక్షాలకు ఓ న్యాయం, ప్రభుత్వానికి ఓ న్యాయమా ? అని నిలదీశారు. పనిలో పనిగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలని ఇరు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
టీడీపీ, జనసేనల కలయికతో బీజేపీతో పవన్ బంధం సందిగ్ధంలో పడింది. మోదీ రూట్ మ్యాప్ ఇక లేనట్టే అన్న పరిస్థితి ఏర్పడింది. నిర్ణయాధికారం ఏపీ బీజేపీకే జనసేనాని వదిలేసినట్టు కనిపిస్తోంది. మరి ఏపీ బీజేపీ ప్రయాణం ఒంటరిగానా ? టీడీపీ, జనసేనతోనా అన్నది ఆ పార్టీనే తేల్చుకోవాలి.