ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసోపేత నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మోదీ ఇప్పటికే నోట్లరద్దు, ఆర్టికల్ 370 రద్దు లాంటి నిర్ణయాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. మరొకొన్ని రోజుల్లో మోదీ క్షమాభిక్షలపై చట్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

క్షమాభిక్షలకు చెక్ పెట్టేందుకు చట్టంలోని సెక్షన్లలో మార్పులు చేయడానికి ఇప్పటికే కేంద్రం కొందరు నిపుణులతో మార్పులు చేర్పులకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టింది. ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో కీలక మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలో సంచలనం సృష్టించిన కేసుల్లో దోషులు ఉరిశిక్ష వాయిదా పడటం కోసం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి, గవర్నర్ లకు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే.
నిర్భయ కేసు నిందితుల్లో ఇలా పలుమార్లు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్నా కాలయాపన జరిగింది. ఫలితంగా చట్టాలపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతోందని కేంద్రం భావిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. చట్టాలను సవరించి క్షమాభిక్షలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు కేంద్రం మార్పులు చేయనుందని తెలుస్తోంది.
నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించిన తరువాత ఒక నివేదికను సిద్ధం చేసి ప్రజాభిప్రాయాలను కేంద్రం కోరుతుంది. ప్రజల సూచనలు పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఐపీసీ, సీఆర్పీసీ సెక్షన్లలో మార్పులు చేర్పులు చేస్తుంది. కేంద్రం నిర్ణయానికి ప్రజల మద్దతు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.