Homeజాతీయ వార్తలుPassenger Trains: పేదోళ్ల బండి ప్యాసింజర్ రైళ్లను పాతాళంలో పడేస్తున్న మోడీ సర్కార్!

Passenger Trains: పేదోళ్ల బండి ప్యాసింజర్ రైళ్లను పాతాళంలో పడేస్తున్న మోడీ సర్కార్!

Passenger Trains: విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రోడ్‌కు ప్యాసింజర్‌ రైలులో టికెట్‌ చార్జీ రూ.30 మాత్రమే. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌గా మార్పు చేసిన వాటిలో చార్జీ రూ.60 అయింది.

– అనంతపురం నుంచి ధర్మవరానికి ప్యాసింజర్‌లో రూ.10 ఉండే చార్జీ, ఎక్స్‌ప్రెస్‌గా మార్చడంతో రూ.30కి చేరింది.

– అనంతపురం నుంచి తిరుపతికి ప్యాసింజర్‌లో టికెట్‌ రూ.60 ఉండగా, ఇపుడు ఎక్స్‌ప్రెస్‌ కావడంతో రూ.110 అయింది.

భారత రైల్వేలో ప్యాసింజర్‌ రైళ్లలకు ప్రత్యేక స్థానం ఉంది. పేదలపై అధిక ఆర్థిక భారం పడకుండా చవకైన ఛార్జీలతో గమ్యస్థానాలకు చేర్చే రైళ్లుగా ప్యాసింజర్లకు పేరుంది. గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ రైళ్లు ఎంతో మందికి దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఎక్కువ ఛార్జీలు వెచ్చించి ప్రయాణించలేని వారంతా ప్యాసింజర్‌ రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయి. పాలు, కూరగాయల రవాణా, గ్రామీణ ప్రాంతాల్లో హాల్టింగ్‌తో చాలా మంది రోడ్డు మార్గం కంటే రైలు మార్గాల్లోనే ప్రయాణానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. అయితే ఈ ప్యాసింజర్‌ రైలు బండి ఇకపై కనుమరుగు కాబోతోంది. ప్యాసింజర్‌ రైళ్లను ఎత్తివేసేలా భారత రైల్వే చర్యలు చేపడుతోంది. కొన్ని మార్గాల్లో పూర్తిగా లేకుండా చేస్తోంది. ఇటీవల వరకు ప్యాసింజర్లుగా నడిచిన వాటినే ఇప్పుడు అన్‌రిజర్వ్‌డు ఎక్స్‌ప్రెస్‌లు, స్పెషల్‌ ఫేర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు చేసి, ఛార్జీలు పెంచేసింది.

కరోనా తర్వాత..
కోవిడ్‌ కారణంగా రైళ్లన్నీ నిలిపేసిన రైల్వేశాఖ.. తరవాత క్రమంగా పునరుద్ధరిస్తూ వచ్చింది. తొలుత కేవలం రిజర్వేషన్‌ బోగీలతో, తర్వాత స్పెషల్‌ ఫేర్‌తో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌లను నడిపింది. ఆ తర్వాత పాత రైళ్లను పునరుద్ధరించింది. కోవిడ్‌కు ముందున్న ప్యాసింజర్లు అన్నింటినీ పట్టాలెక్కించలేదు. వీటిలో కొన్నింటిని పూర్తిగా ఆపేసింది. మరికొన్నింటిని ఎక్స్‌ప్రెస్‌లుగా చేసి ప్రయాణికులపై అదనపు భారం వేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పుకోస్తా జోన్‌లో ఉన్న వాల్తేరు డివిజన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఎక్స్‌ప్రెస్‌లకే మొగ్గు..
అన్ని డివిజన్లలో రైల్వే అధికారులు ప్యాసింజర్లను.. ఎక్స్‌ప్రెస్‌లుగా నడపటంపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

– గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో కోవిడ్‌కు ముందు 60 ప్యాసింజర్లు ఉండేవి. తర్వాత అన్నింటినీ పునరుద్ధరించినప్పటికీ.. అవి స్పెషల్‌ ఫేర్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా మారిపోయాయి. ఈ డివిజన్‌లో ప్రస్తుతం ఒక్క ప్యాసింజర్‌ రైలు కూడా లేదు.

– విజయవాడ డివిజన్‌లో కోవిడ్‌కు ముందు 129 ప్యాసింజర్లు తిరిగేవి. ఇందులో 85 ప్యాసింజర్లను అన్‌ రిజర్వ్‌డు స్పెషల్స్‌గా మార్చారు. 26 ప్యాసింజర్లను పూర్తిగా రద్దు చేశారు. విజయవాడ–రాజమహేంద్రవరం, గుంటూరు–నరసాపురం, విజయవాడ–గుంటూరు, విజయవాడ–బెంగళూరు తదితర ప్యాసింజర్లు రద్దయిన వాటిలో ఉన్నాయి. విజయవాడ–గూడూరు, విజయవాడ–తెనాలి ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా చేశారు.

– ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి గతంలో నడిపిన ప్యాసింజర్లలో తిరుపతి–అరక్కోణం, తిరుపతి–గూడూరు, తిరుపతి–నెల్లూరు ప్యాసింజర్లను పునరుద్ధరించలేదు.

– తిరుపతి–కాట్పాడి, తిరుపతి–పుదుచ్చేరి, తిరుపతి–గూడూరు, తిరుపతి–గుంతకల్లు, తిరుపతి–చెన్నై, తిరుపతి–విల్లుపురం, తిరుపతి–గుంటూరు, తిరుపతి–కదిరి దేవరపల్లి రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పుచేశారు.

– వాల్తేరు డివిజన్‌లోని మన రాష్ట్ర పరిధిలో గతంలో 12 ప్యాసింజర్లు నడుస్తుండగా.. నాలుగింటినే పునరుద్ధరించారు. మిగిలిన వాటిని ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. ఇలా మారిన ప్యాసింజర్లలో విశాఖపట్నం–రాయ్‌పుర్, విశాఖపట్నం–రాయగడ, విశాఖపట్నం–పలాస, విశాఖపట్నం–కాకినాడ, రాయగడ–గుంటూరు రైళ్లు ఉన్నాయి.

ప్రయాణికులపై అదనపు భారం
గతంలో ప్యాసింజర్లుగా ఉండి, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన వాటిని దాదాపు అన్ని స్టేషన్లలో నిలుపుతున్నారు. చార్జీల రూపంలో మాత్రం ప్రయాణికులపై అదనపు భారం వేశారు. గతంలో ప్యాసింజర్‌లో కనీస చార్జీ రూ.10 ఉండగా, ఇపుడు రూ.30 అయింది. అంటే కనీస చార్జీ రూపంలో ఒక్కో ప్రయాణికుడిపై రూ.20 చొప్పున భారం పెరిగింది. అలాగే దూరాన్ని బట్టి చార్జి అదనంగా రూ.60 వరకు పెరిగింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular