https://oktelugu.com/

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత నోట రాముడి పాట

బాలరాముడి విగ్రహ ప్రతిష్ట భారీగా జరగడం.. మోడీకి అమితమైన ప్రాధాన్యం తగ్గడంతో.. గులాబీ క్యాంప్ ఒకింత నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఆమె తండ్రి చేసినట్టు రాముడి ప్రతిష్టను మోడీ బిజెపి కార్యక్రమం లాగా చేయలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 23, 2024 7:22 pm
    MLC Kavitha

    MLC Kavitha

    Follow us on

    MLC Kavitha: రామ రామ యన్న రామ చిలుక ధన్యమూ.. రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడత ధన్యమూ.. అభినందనలందుకున్న కోతిమూక ధన్యమూ.. ఆలింగనం అందుకున్న గుహుడి జన్మ ధన్యమూ.. సీత జాడ చూపినట్టు పక్షి జన్మ ధన్యమూ.. రేగు పండు రూచి చూపిన శబరి జన్మ ధన్యమూ.. పాత ధూళి సోకిన శిలదెంతో పుణ్యమూ.. వారధిని నిలిపినట్టి జలమెంతో ధన్యమూ.. గుండెల్లో నిలుపుకున్న హనుమంతుడు ధన్యమూ.. అన్న వెంట నడిచిన లక్ష్మణుడిదెంతో పుణ్యమూ..రాణి వాసం విడిసిన సీతమ్మదెంతో త్యాగమూ.. రాముడెంట నడిచిన తల్లి చరిత ధన్యమూ.. సత్య, ధర్మ పాలనే రాముని అవతరామూ.. మధురాతీమధురమూ రెంక్షరాల నామమూ..
    చదువుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి కదూ.. ఆహా ఎంత బాగా రాశారు.. అనిపిస్తోంది కదూ.. ఇది రాసింది ఎవరో గాని పాడింది మాత్రం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అదేంటి కవిత బతుకమ్మ ఆడంగా చూశాము కానీ.. పాడంగా ఎప్పుడూ వినలేదు కదా.. అని అనుకుంటున్నారు కదూ.. సరే మీ అభిప్రాయం ఎలాగా ఉన్నా.. కవిత రాముడి పాట పాడింది. ఆ పాట విడుదల అయిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆడంబరంగా నిర్వహించలేదు. అధికారంలో ఉండి ఉంటే యాదాద్రి గుడి సంప్రోక్షణ లాగా… మొత్తం గులాబీ కలర్ అద్దేవారేమో..

    ఆ మధ్యే కదా కవిత తండ్రి.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..హిందూ గాళ్ళు.. బొందూ గాళ్ళు అని వ్యాఖ్యానించింది.. రామ జన్మభూమి, లక్ష్మణ జన్మభూమి, శూర్పణక జన్మభూమి అని ఎక్కిరించింది. అప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏమన్నా చెల్లుబాటు అయింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారం పోయింది. మంచానికి పరిమితం కావలసి వచ్చింది. అప్పట్లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు జైశ్రీరామ్ అంటే మేము జై హనుమాన్ అంటామని నినదించిన కవిత.. ఓటమి తర్వాత మెల్లిగా హిందూ అనుకూల లైన్ తీసుకుంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది. నిజామాబాదులో ఆమె పోటీ చేయకపోయినప్పటికీ.. చేసే అంత ఆసక్తి చూపించకపోయినప్పటికీ హిందుత్వం మీద ఆమె వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే అంతటి వ్యాఖ్యలు చేసినప్పటికీ రామ జన్మభూమి ట్రస్ట్ అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం పలకలేదు. ఆమె తండ్రికి ఆహ్వానం పలికినప్పటికీ ఆయన వెళ్లే వీలు లేదు. ఆహ్వానం పలకలేదని చిన్న బుచ్చుకుందో.. మరేమిటో తెలియదు గానీ.. అదే విషయాన్ని ఒకింత బాధతోనే విలేకరులకు చెప్పింది.

    బాలరాముడి విగ్రహ ప్రతిష్ట భారీగా జరగడం.. మోడీకి అమితమైన ప్రాధాన్యం తగ్గడంతో.. గులాబీ క్యాంప్ ఒకింత నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఆమె తండ్రి చేసినట్టు రాముడి ప్రతిష్టను మోడీ బిజెపి కార్యక్రమం లాగా చేయలేదు. మహారధులందరినీ రామజన్మ భూమి ట్రస్ట్ ద్వారా పిలిపించాడు. అందరికీ బాల రాముడి దర్శన భాగ్యం కల్పించాడు. వచ్చిన వారందరినీ పేరుపేరునా పలకరించాడు. మొత్తానికి మూడోసారి తామే అధికారంలోకి వస్తున్నామని సంకేతాలు పంపాడు. అసలే వచ్చేవి పార్లమెంట్ ఎన్నికలు.. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ తలుపులు తెరిస్తే ఎంతమంది పోతారో తెలియదు. ఇప్పటికే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్లారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో హిందువులకు దగ్గరయ్యే ప్రయత్నాన్ని కవిత ప్రారంభించింది. మోదీ బాల రాముడు విగ్రహం ప్రతిష్టించిన మరుసటి రోజు తాను ఆలపించిన రాముడి పాటను విడుదల చేసింది. ఈ పాట కవిత అఫీషియల్ సామాజిక మాధ్యమాల ఖాతాలో కనిపించకపోయినప్పటికీ.. ఆమెకు అత్యంత సన్నిహితులు తమ సోషల్ మీడియా ఎకౌంట్లో ఆ పాటను పోస్ట్ చేశారు. కవిత రాముడికి చేస్తున్న పూజలు.. మోడీ ఆవిష్కరించిన బాలరాముడు విగ్రహం.. ఇంకా కొన్ని రాముడి గుడు లకు సంబంధించిన ఫోటోలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. వాళ్ల జై శ్రీరామ్ అంటే మేం జై హనుమాన్ అంటామని చెప్పిన నోటితోనే.. కవిత రాముడిని కీర్తించడం.. అది కూడా మోడీ బాల రాముడిని ఆవిష్కరించిన మరుసటి రోజు పాటను విడుదల చేయడం.. నిజంగా ఆశ్చర్యకరమే.