MLC Kavitha: పాఠం చెప్పాలంటే.. ఆ రంగంలో అనుభవం అయినా ఉండాలి.. ఆ రంగానికి సబంధించి సంపూర్ణ శిక్షణ పొంది ఉండాలి. కానీ ఆ రంగానికి సంబంధించి ఎలాంటి సబంధం లేకపోయినా.. మీడియా కొనేశాం కాబట్టి.. నామాటే శాసనం.. నేను చెప్పిందే పాఠం అంటే ఎలా ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జర్నలిస్టులకు జర్నలిజం పాఠాలు నేర్పినట్లు ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్ ఫ్యామిలీ, సర్కార్.. తమకు వ్యతిరేకంగా రాయకుండా మీడియా సంస్థల యజమానులను మేనేజ్ చేస్తోంది. చురుకైన జర్నలిస్టు ఉన్నది ఉన్నట్లు రాసినా, అందులో కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంశాలు ఉంటే వాటిని తొలగించడం, లేదా తీవ్రత తగ్గించడం చేస్తున్నాయి తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా. ఇంత దిగజారినా కూడా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూరుకుపోతున్న కవిత ఇప్పుడు జర్నలిస్టులకే పాఠాలు చెబుతుండడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. మీడియా తన పాత్ర పోషించడం లేదని, కవులు, కలాకారులు గలమెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం గురివింద సామెతాల అనిపిస్తోంది.

నాడు ఎటుపోయావ్ అక్కా…
తెలంగాణలో ప్రస్తుతం మీడియా సంస్థలన్నీ తెలంగాణ సర్కార్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అన్ని సంస్థల యజమానులు ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పెట్టుకోవడం ఎందుకని కొందరు, సర్కారు ఇస్తున్న యాడ్స్, యాజామాన్యాలకు ఇస్తున్న తాయిలాలతో మరికొందరు సర్కార్ అనుకూల వార్తలే రాస్తున్నారు. సర్కార్ రాజ్యాంగం ఉల్లంఘించినా, ప్రజావ్యతిరేక చర్యలకు దిగినా, నిర్బంధకాండ సాగిస్తున్నా.. పాతాక శీర్షికలో కథనాలు రాయలేని స్థితిలో పత్రికలు, బ్రేకింగ్ వార్తలు చెప్పలేని స్థితిలో టీవీ చానెళ్లు ఉన్నాయి. అదేసమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సభలకు ఎక్కడా లేనంత కవరేజ్ ఇస్తున్నాయి. సీఎంవో నుంచి ప్రకటన రిలీజ్ అయినా పతాక శీర్షికన ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి. కోదండరామ్, బండి సంజయ్ నిర్బంధ అరెస్ట్, తీన్మార్ మల్లన్న, రఘు ఇలా అనేకమంది జర్నలిస్టుల అక్రమ అరెస్టు, కొన్ని చానెళ్లపై నిషేధం, నిరుద్యోగుల ఆహ్మత్యలు, కేసీఆర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి రైతులు ఆత్మహత్య చేసున్నా మీడియా రాయలేని దుస్థితి. అప్పుపడు లేవని కవిత గొంతు ఇప్పుడు తనదాకా వచ్చాక లేవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అప్పుడు ఏమయ్యావక్కా అని సామాన్యుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
మీడియా సంస్థలను కొనడం.. రిపోర్టర్లను తప్పించడం..
తమకు అనుకూలంగా లేని మీడియా సంస్థలను టీఆర్‌ఎస్ సర్కార్ కొనుగోలు చేసింది. టెన్ టీవీ గతంలో కమ్యూనిస్టుల చేతిలో ఉండేది, నమస్తే తెలంగాణ అల్లం నారాయణ ఎడిటర్‌గా ఉన్న సమయంలో టీఆర్‌ఎస్ సర్కార్‌ను వ్యతిరేక విధానాలను ఎండగట్టింది. టెన్ టీవీ కూడా వామపక్ష భావజాలంతో వాస్తవాలను ప్రసారం చేసింది. టీవీ9 రవిప్రకాశ్ చేతిలో ఉంటే మంచిది కాదని కేసీఆర్ భావించారు. ఇవే కాకుండా అనేక చిన్న పత్రికలు, చిన్నచిన్న చానెళ్లు స్వతంత్రంగా పనిచేసేవి. వీటిని కేసీఆర్, కేటీఆర్ స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మీడియా సంస్థల్లో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసిన రిపోర్టను ఆయా సంస్థల నుంచి తొలగించిన, గెంటేసిన చరిత్ర టీఆర్‌ఎస్ సర్కార్‌ది. అప్పుడు కవిత కనీసం ప్రశ్నించలేదు. ఇప్పుడు మాత్రం మీడియా స్వాతంత్య్రం, స్వేచ్ఛ గురించి మాట్లాడడం హాస్యాస్పదం.
యజమానులు సిగ్గుపడేలా..
ఇప్పటికే తెలంగాణ సర్కార్‌కు, టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న పత్రికలు, టీవీ చానళ్ల యజమానులు కవిత చేసిన వ్యాఖ్యలను చూసి సిగ్గుపడుతున్నారు. ఒక్కో ఎడిటర్ అనుభవం అంత వయసు కూడా లేని కవిత, తాము ఇంత అనుకూలంగా వ్యవహరిస్తున్నా.. ప్రశ్నించడం చూసి సిగ్గుపడుతున్నారు. జర్నలిజం పాఠాలు కవితతో చెప్పించుకోవడం ఏంటిరా బాబు అని మదన పడుతున్నారు.

సోషల్ మీడియా దూకుడుతో వాస్తవాలు వెలుగులోకి..
తెలంగాణలో మీడియా సంస్థలు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న తరుణంలో సోషల్ మీడియా ప్రజలకు ప్రత్యామ్నాయ మీడియాగా మారింది. యూట్యూబ్ చానెళ్లు, న్యూస్‌వెబ్‌సైట్ల యజమానులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. ఆడ్రాయిడ్ ఫోన్ చేతిలోకి వచ్చాక, ఇంటర్నెట్ సేవలు చౌకగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు పత్రికలు చూడడం మానేశారు. న్యూస్ వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లు, సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా చూస్తున్నారు. వాస్తవాలు తెలుసుకుంటున్నారు. తెలంగాణలో ఇవి ప్రభావవంతంగా, శక్తివంతంగా మారుతున్నాయి. దీనిని సహించలేకపోతున్న తెలంగాణ సర్కార్, ఆయన కూతురు కవిత, కేటీ ఆర్ వాస్తవాలు జీర్ణించుకోలేక మీడియాకు పాఠాలు చెబుతున్నారు. ఇదే సమయంలో యూట్యూబ్ చానెళ్లు, న్యూస్ వెబ్‌సైట్లకు లీగల్ నోటీసులు ఇస్తున్నారు. డిఫర్మేషన్ సూట్ వేస్తున్నారు. అయినా అవి ఎక్కడా తగ్గడం లేదు. వాస్తవాలను గమనించని కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులకు పాఠాలు చెప్పడమే ఇప్పుడు జోక్ ఆఫ్‌ది తెలంగాణగా మారింది.