MLC Kavitha: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపులో కొన్ని రోజులుగా పోటీ పడుతున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సాకుతో కేంద్రం పెట్రో ధరలను ఇష్టానుసారం పెంచుకుంటూ పోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తానేం తక్కువ తిన్నా అన్నట్లు ఆర్టీసీ చార్జీల పెంపుతో పోటీ పడుతోంది. అయితే ఇక్కడ చార్జీల పెంపుపై రాష్ట్రంలో అధికార పార్టీ నేతల స్పందన చూస్తేనే నవ్వొస్తోంది. ‘మాది సంసారం… వాళ్లది వ్యభిచారం’ అన్నట్లుగా ఉంది ధరల పెంపుపై గులాబీ నేతల స్పందన చూస్తుంటే అని విమర్శలు వినిపిస్తున్నాయి.

-ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత..
ఇటీవల ఐదు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజులకే కేంద్రం పెట్రో బాదుడు షురూ చేసింది. దాదాపు నెల రోజుల పాటు నిత్యం పైసల రూపంలో ధర పెంచుతూ మొత్తంగా రూ.15 వరకు పెంచింది. ప్రస్తుతం నిలకడగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నప్పటికీ తాజాగా వంటగ్యాస్ ధరనూ పెంచింది. గృహ వినియోగ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.2 వేలకు చేరింది. తాజాగా ఆదివారం కమర్షియల్ సిలిండర్ ధరను కేంద్రం రూ.102.50 పెంచింది. ఈ ధరల పెంపు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు. అయితే ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రాష్ట్రాలు పెట్రో ధరలపై పన్ను తగ్గించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరారు.
Also Read: YS Jagan Illegal Assets Case: అక్రమాస్తుల కేసులో జగన్ కు బిగ్ రిలీఫ్
-బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల ఆగ్రహం
ప్రధాని విన్నపంపై బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎక్కడ మీటింగ్ పెట్టినా కేంద్రాన్ని ధరల పెంపుపై ఏకి పారేస్తున్నారు. గురివింద గింజ తన కింద ఉన్న నల్ల మచ్చ ఎరుగకుండా ఎగిరెగిరి పడుతుంది అన్నట్లు.. ఉంది టీఆర్‌ఎస్, మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న తీరని మరోవైపు బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రం పెట్రో ధరల పెంపుపై ప్రశ్నిస్తున్న వారు.. రాష్ట్రంలో పెరిగిన ధరలపై మాత్రం నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు.
– ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను భారీగా పెంచింది. యూనిట్‌పై 50 పైసల నుంచి మొదలు రూ.8 వరకు స్లాబ్‌ల ఆధారంగా పెరిగింది. దీనిపై ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేసినా ఏ మంత్రి మాట్లాడలేదు. ఏ ప్రజాప్రతినిధి స్పందించలేదు.
– ఇక ఆర్టీసీ చార్జీలైతే పెట్రో ధరలతో పోటీ పడుతున్నాయి. పెట్రో ధరలు రోజుకు పైసల్లో పెరుగుతుంటే ఆర్టీసీ చార్జీలు మాత్రం రూపాయల్లో పనెరుగుతున్నాయి. ఎండీగా సజ్జన్నార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టిసీ బాగుపడుతుందని అందరూ అనుకున్నారు. అయితే సంస్థ బాగేమో కానీ ప్రజలపై ధరల భారం మాత్రం భారీగా పడింది.. పడుతోంది. చార్జీలు పెంచుతామంటున్న ఎండీ.. పెంపు విషయం ప్రకటించకుండా దొడ్డిదారిన ఎన్ని రకాలుగా ప్రయాణికులను దోపిడీ చేయొచ్చో అన్ని రకాల చార్జీలు పెంచారు.
– సౌకర్యాల కల్పన పేరుతో టికెటపై రూ.2 పెంచారు.
– చిల్లర అడ్జెస్ట్‌మెంట్ పేరుతో రూ.2 నుంచి రూ.5 వరకు పెంచారు.
– డీజిల్ సెస్ పేరుతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు రూ.2 పెంచారు. ఎక్స్ ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
– బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు.
రాష్ట్రంలో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. యుద్ధం సాకుతో వంట నూనెలను వ్యాపారులు బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఉప్పు నుంచి మొదలు అన్ని రకాల ధరలూ గడిచిన మూడు నెలల్లో 10 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. నియంత్రణను ప్రభుత్వం గాలికి వదిలేసింది.

-కేంద్రంపైనే ఎమ్మెల్సీ కవిత దృష్టి..
కేంద్రం పెంచుతున్న ధరలపై దృష్టి పెడుతున్న ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కవిత, రాష్ట్రంలో ధరల పెంపుపై మాత్రం స్పందించడం లేదు. రాష్ట్రంలో వంటింట్లో ధరల మంటలు సెగలు రేపుతున్నా పట్టించుకోని కవిత.. కేంద్రం పెంచిన ధరలపై ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించడం విమర్శలకు తావిస్తోంది. కరెంటు బిల్లు పెంచినేప్పుడు.. ఆర్టీసీ చార్జీలు పెరుగుతున్నా.. ఏమాత్రం మాట్లాడని కవిత, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైన సంఘటన జరిగినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచినా తక్షణమే స్పందిస్తారు. ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని ట్వీట్లు చేస్తారు. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర పెంపుపై కేంద్రంపై ఫైర్ అయ్యారు కవిత. ఇలా స్పందించారు. ‘‘కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు’’ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయని పేర్కొన్నారు. కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెంచడం ప్రత్యక్షంగా, పరోక్షంగా సామాన్యులపై మరింతగా ఆర్థిక భారం పెంచుతుందని అన్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీని భరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు సామాన్య ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించారు. గతంలో కర్ణాటకలోని హిజాబ్ వివాదంపై ఇలాగే స్పందించారు. కానీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నాయకులు మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా స్పందించరు. ఇదేం తీరని ప్రజలు కవితను ప్రశ్నిస్తున్నారు.
Also Read:Pawan Kalyan: సీఎం జగన్ పేరు మార్చిన పవన్ కళ్యాణ్!



[…] Also Read:MLC Kavitha: కవితక్కా.. ఇదేం లెక్క..! […]
[…] Also Read: MLC Kavitha: కవితక్కా.. ఇదేం లెక్క..! […]